తైవాన్ – చైనాల మధ్య కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు

చైనా తన భూభాగంగా చెబుతున్న తైవాన్‌లో దాదాపు 25 ఏళ్ల తర్వాత అమెరికా అత్యున్నత స్థాయి నేత నాన్సీ పెలోసీ చేబడుతున్న పర్యటన ఒక వంక చైనా – అమెరికాల మధ్య మాటల యుద్దాన్ని తీవ్రతరం చేస్తుండగా, మరోవంక చైనా – తైవాన్ ల మధ్య యుద్ధ మేఘాలు ఆవరిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
యూఎస్ హౌస్ స్పీకర్‌గా ఉన్న నాన్సీ పెలోసి 4 దేశాల ఆసియా పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి తైవాన్‌లో అడుగుపెట్టబోతున్నారు. తైవాన్‌లో అడుగుపెడితే అమెరికా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని, తమ సైన్యం చూస్తూ కూర్చోదని ఇప్పటికే చైనా హెచ్చరించింది.
డ్రాగన్‌ హెచ్చరికలతో అప్రమత్తమైన అమెరికా  స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటనకు ముందే నాలుగు యుద్ధ నౌకలను తైపీ సమీపంలోని సముద్ర జలాల్లో మోహరించింది. అందులో యుద్ధ విమానాలను మోసుకెళ్లే నౌక సైతం ఉంది. ఈ పరిణామాలతో తైవాన్ కూడా అప్రమత్తమైంది. చైనాతో యుద్ధానికి సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో ఆ దేశ మిలిటరీని హైఅలర్ట్ చేసిందని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. కొంతమంది అధికారులు, సైనికులకు సెలవులు కూడా రద్దు చేసినట్టు పేర్కొన్నాయి. తక్షణమే యుద్ధానికి సిద్ధమవ్వాలంటూ గగనతల రక్షణ దళాలకు ఆదేశాలు అందినట్టు తైవాన్ న్యూస్ సంస్థల రిపోర్టులు పేర్కొన్నాయి.
తైవాన్‌, ఫిలిప్పీన్స్‌కు తూర్పున, జపాన్‌కు దక్షిణాన ఫిలిప్పీన్స్ సముద్రంలో అమెరికా యుద్ధ నౌక యూఎస్‌ఎస్‌ రొనాల్డ్‌ రీగన్‌ను మోహరించినట్లు అగ్రరాజ్య నౌకాదళ అధికారులు తెలిపారు. జపాన్‌కు చెందిన ఈ రీగన్‌ నౌక  గైడెడ్‌ మిసైల్స్‌, యూఎస్‌ఎస్‌ రాకెట్లు, నౌకా విధ్వంసక మిసైల్స్‌ వంటివి కలిగి ఉన్నట్లు చెప్పారు.

ఈ మోహరింపు సాదారణ ప్రక్రియలో భాగమేనని, అయితే.. ఏదైనా అనుకోని సంఘటన ఎదురైతే దానికి తగినట్లుగానే తమ స్పందన ఉంటుందన్నారు. మరోవైపు.. యూఎస్‌ఎస్‌ త్రిపోలీ నౌక సైతం గత మే నెలలోనే సాన్‌డియాగో నుంచి బయలుదేరిందని, తైవాన్‌ సమీపంలోకి చేరుకున్నట్లు చెప్పారు.

చైనాపై మొదటి నుంచే తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో నిలుస్తున్న స్పీకర్‌ నాన్సీ పెలోసీ  పర్యటనపై చైనా చేస్తున్న హెచ్చరికలకు తాము భయపడబోమని అమెరికా స్పష్టం చేసింది. అయితే.. పెలోసీ పర్యటన నేపథ్యంలోనే తైవాన్‌కు ఇరువైపులా యుద్ధ నౌకలను మోహరించినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

మరోవైపు, తైవాన్‌కు అతి సమీపంలోకి చైనా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు మోహరించటం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాతో స్నేహం చేసి తైవాన్‌ యుద్ధానికి కాలు దువ్వుతున్నట్లు తెలుస్తోంది.

చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ ఘాటుగా స్పందిస్తూ ‘‘నిప్పుతో చెలగాటమాడేవారుదానితోనే నాశనమవుతారు. పీపుల్ లిబరేషన్ ఆర్మీ చూస్తూ కూర్చోదు.. ఎలాంటి పరిణామాలు జరిగినా ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవ్వాలని అమెరికాను మళ్లోసారి హెచ్చరిస్తున్నాం’’ అని హెచ్చరించారు.

కాగా అధికారిక సంబంధాలతో తైవాన్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని చైనా బలంగా విశ్వసిస్తోంది. గతవారం ఇదే అంశంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఫోన్ కాల్‌లో కూడా మాట్లాడారు. తైవాన్ విషయంలో అమెరికా వైఖరిని బాహాటంగానే తప్పుబట్టారు.

అయితే తమకు ఎలాంటి దురుద్దేశం లేదని అమెరికా చెబుతోంది. ఈ పర్యటనతో అమెరికా విధానంలో ఎలాంటి మార్పు ఉండబోదని పేర్కొంది.  కాగా పౌర యుద్ధంలో కమ్యూనిస్టులు గెలుపొందాక 1949లో తైవాన్, చైనా వేరు పడ్డాయి. ఒకే దేశంగా కొనసాగుతామని అప్పట్లో ఇరు దేశాలూ చెప్పాయి.

కానీ జాతీయ నాయకత్వం సూచించే ప్రభుత్వం విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ఎలాంటి అధికారిక సంబంధాలు లేవు. అయితే వాణిజ్యం, పెట్టుబడుల విషయంలో కొన్ని బిలియన్ డాలర్లు ఇరుదేశాలతో ముడిపడి ఉండడం గమనార్హం