సాక్షిని బెదిరించిన సంజయ్ రౌత్… అరెస్ట్ తో బిగుసుకుంటున్న కేసు

తాను ఏ తప్పు చేయలేదని, కేవలం రాజకీయ కక్షసాధింపు కారణంగా, శివసేన పార్టీని అస్థిరం కావించడం కోసమే తనపై అక్రమ కేసు బనాయించి వేధిస్తున్నారని, ఎవరెంత బెదిరించినా తాను  శివసేనను వీడనని మనీ లాండరింగ్ కేసులో ఈడి అధికారులు అదుపులోకి తీసుకొనే ముందు చెప్పుకొచ్చిన రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌ ఆ కేసులో మరింతగా చిక్కువుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఈడీ అధికారులు ఆరు గంటలకు పైగా తమ కార్యాలయంలో విచారించిన తర్వాత గత అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో ఓ సాక్షిని బెదిరించినట్లు ఆయనపై మరో కేసు నమోదు కావడం ప్రాధాన్యత సంతరింప చేసుకుంది. 

సంజయ్ రౌత్ కు సన్నిహితుడు సుజిత్ పాట్కర్ భార్య స్వప్నా పాట్కర్‌ను దుర్భాషలాడి, బెదిరించినందుకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదయింది. ఆమె ఆరోపణల ఆడియో క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతుంది. దీనిలో రౌత్ ఆమెను బెదిరించినట్లు స్పష్టంగా వినబడింది. 

ఇప్పుడు, శివసేన ఎంపీపై ఐపీసీ 504,506, 509 సెక్షన్ల కింద వకోలా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ముఖ్యంగా, స్వప్న పాట్కర్ పాత్ర చాల్ ల్యాండ్ కేసులో సాక్షిగా ఉన్నారు.

మరాఠీ చిత్ర పరిశ్రమలో ప్రఖ్యాత వ్యక్తి అయిన స్వప్నా పాట్కర్ పాత్ర చాల్ పునరాభివృద్ధి కేసులో కీలక సాక్షులలో ఒకరు. ఈ కేసుతో సంబంధం ఉన్నప్పటి నుండి రౌత్ పాట్కర్‌ను బెదిరించినట్లు ఫిర్యాదులో ఆరోపించారు. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఆడియో క్లిప్‌లో, సంజయ్ రౌత్ అని ఆరోపించబడిన ఒక వ్యక్తి వాయిస్, ఒక మహిళపై అసభ్యకరమైన బెదిరింపులు, దుర్భాషలను విసరడం చూడవచ్చు. 

ఇలా ఉండగా, ఈడీ దాడులకి భయపడి మాతో చేరాలనుకునే వారు తమ  వద్దకి రావద్దని, తమతో చేరవద్దని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే స్పష్టం చేశారు. పైగా, అటువంటి వారు బీజేపీలో కూడా చేరవద్దని హితవు చెప్పారు. సంజయ్‌ రౌత్‌ నివాసంపై ఈడీ దాడుల అనంతరం, తనను శివసేన నుంచి దూరం చేసేందుకే కేంద్రం ఈడీతో దాడులు చేయిస్తోందని, ఎవరెంత బెదిరించినా తాను  శివసేనను వీడనని సంజయ్‌ రౌత్‌ తన ట్విట్టర్‌లో పేర్కొనడంపై శిండే స్పందించారు.

సంజయ్‌ రౌత్‌ నివాసంపై ఈడీ దాడుల అనంతరం ‘ఇక లెక్కలు చూపించాల్సిందే’ అంటూ బీజేపీ నేత కిరీట్‌ సోమయ్య తనదైన శైలిలో రావుత్‌కు చురకలంటించారు. మాఫియా సంజయ్‌ రౌత్‌ అంటూ సంభోదిస్తూ, ఆయనకు ఇక లెక్కలు చూపించాల్సి రానుందని ఎద్దేవా చేశారు.

“రూ. 1,200 కోట్ల పత్రాచాల్‌ కుంభకోణం, వసాయి నాయిగావ్‌లోని బిల్డర్ల కుంభకోణం లేదా మహారాష్ట్రను దోచుకునే పనిచేసిన మహావికాస్‌ ఆఘాడి ప్రభుత్వం ఇలా మాఫియాగిరి, దాదాగిరి చేస్తూ అందరినీ జైల్లో వేస్తానని బెదిరింపులు చేశారు. కానీ ఇప్పుడు వారికి ఈ విషయాలన్నింటిపై లెక్కలు చూపించాల్సిన సమయం వచ్చింది” అని కిరీట్‌ సోమయ్య స్పష్టం చేశారు.

ఎన్నడో అరెస్టు చేయాల్సింది

శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ నివాసంపై ఈడీ దాడుల అనంతరం ఎంపీ నవనీత్‌ రాణా తనదైన శైలిలో స్పందిస్తూ ఈ చర్య ఎప్పుడో తీసుకోవాల్సింది అని చెప్పారు. విలేకరిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన సంజయ్‌ రౌత్‌ వద్ద ఇంతపెద్ద మొత్తంలో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటూ ఆమె సవాల్‌ విసిరారు.

అదేవిధంగా సంజయ్‌ రౌత్, ఉద్దవ్‌ ఠాక్రేలు తమ పదవుల దుర్వినియోగం చేశారని ఆమె ఆరోపించారు.  అందరి భవిష్యత్ లను పాడుచేసే సంజయ్‌ రౌత్‌కు ఇప్పుడు ఆయన పరిస్థితి పాడవడం తనకు సంతృప్తిగా ఉందని నారాయణ రాణే కుమారుడైన బీజేపీ నాయకుడు నితేష్‌ రాణే పేర్కొన్నారు. ముఖ్యంగా సంజయ్‌ రౌత్‌కు తనకు ఎప్పుడు ఏమి జరగదని భావించేవారని,  కాని ఈడీ దర్యాప్తు, ఇతరులను ఇబ్బందులు పెట్టడం అంటే ఏమిటో ఇప్పుడు సంజయ్‌ రౌత్‌కు తెలిసివస్తుందంటూ నితేష్‌ రాణే మండిపడ్డారు.