2024 ఎన్నికల్లో ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా తిరిగి మోదీ 

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ప్రధాని అభ్యర్థి  తిరిగి నరేంద్ర మోదీయే  అని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కీలక ప్రకటన చేశారు. ఈ విషయమై వస్తున్న కథనాలకు తెరదించుతూ ఆయన నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లనున్నట్లు వెల్లడించారు.

అంతేకాదు, బీహార్ లో బీజేపీ-జేడీయూ పొత్తు కొసాగుతుందని అమిత్‌ షా స్పష్టం చేశారు. 2024 సార్వత్రిక ఎ‍న్నికలతో పాటు 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని తేల్చి చెప్పారు. బిహార్ రాజధాని పట్నాలో రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ మోర్చాల ఉమ్మడి జాతీయ కార్యవర్గ సమావేశాలకు అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆదివారం ముగింపు కార్యక్రమంలో ప్రసంగించి ఈ వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో ప్రధాని మోదీ రిటైర్ అవుతారని, ఆయన స్థానంలో బీజేపీ కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకొస్తుందనే కొన్న్ని వర్గాలలో జరుగుతున్న  ప్రచారంపై ఎన్నికలకు రెండేళ్ల ముందే అమిత్ షా స్పష్టత  ఇచ్చారు. మోదీనే తమ అభ్యర్థి అని కార్యకర్తలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు.

పార్టీ కార్యకర్తలకు కూడా 2024 ఎన్నికలకు సన్నద్ధం కావాలని, ప్రధాని మోదీ  వరుసగా మూడవసారి అధికారంలోకి వచ్చేలా చూడాలని చెబుతూ గత సారి కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంగా పనిచేయాలని మార్గనిర్ధేశం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి 300 కన్నా ఎక్కువ సీట్లు గెల్చుకొని తన అత్యుత్తమ ప్రదర్శనను కనబరచడం గమనార్హం. 

 కశ్మీరీలు తయారు చేసిన త్రివర్ణ పతాకాలను ఈ కార్యక్రమంలో అందరికీ పంచారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీరీల ఆలోచనలు మారాయని తెలిపిందుకే వారు తయారు చేసిన జెండాలు పంపిణీ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.  అలాగే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను పురస్కరించుకుని దేశం నలుమూలలా జాతీయ జెండాలను ఎగురవేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు. ఆగస్టు 13-15వరకు మూడు రోజులపాటు ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా రెపరెపలాడాలని సూచించారు.

దళితులు, గిరిజనులు, ఓబిసిల వంటి బలహీన వర్గాలకు మోదీ రాజకీయ మద్దతు గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని అమిత్ షా బూత్ స్థాయి కార్యకర్తలను  కోరారు. “కేంద్ర మంత్రివర్గంలో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు  అత్యధిక ప్రాతినిధ్యాన్ని పొందుతున్నారు. గ్రామీణ నేపథ్యాల నుంచి వచ్చిన వారి ప్రాతినిధ్యం కూడా పెరిగింది” వంటి వాస్తవాలను సామాన్య ప్రజలకు తెలియజేయాలని కూడా ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు.

సమాజంలోని అన్ని వర్గాల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించడాన్ని బిజెపి విశ్వసిస్తుందని స్పష్టం చేశారు. ఒక గిరిజన మహిళ అత్యున్నత రాజ్యాంగ పదవికి ఎదిగింది అంటూ ద్రౌపది ముర్ము అధ్యక్షునిగా ఎన్నికైన విషయాన్ని ప్రస్తావించారు.  కేరళ, తమిళనాడు, మిజోరాం, మేఘాలయ వంటి సుదూర రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా 600 మందికి పైగా ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా సమావేశాలను ప్రారంభించారు.