భోపాల్ లో పోలీస్ కాలర్ పట్టుకున్న దిగ్విజయ్ సింగ్!

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి  దిగ్విజయ సింగ్ శుక్రవారం భోపాల్ లో పోలీసు సిబ్బందితో ఘర్షణకు దిగడమే కాకుండా,  వారిలో ఒక పోలీస్ కాలర్ పట్టుకొని నిలదీయడం కలకలం రేపింది.  మహిళా ఓటరును జిల్లా పంచాయతీ కార్యాలయం ఆవరణలోకి రానీయకుండా అడ్డుకోవాలని కోరుతూ సింగ్, పోలీసు సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

సీనియర్ కాంగ్రెస్ నాయకుడి చర్యను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సింగ్ తీవ్రంగా ఖండించారు, “ఆయన (దిగ్విజయ సింగ్) ఒక పోలీసును కాలర్ పట్టుకున్నారు.. నేను సోనియా గాంధీని అడగాలనుకుంటున్నాను, ఆమె దీనికి మద్దతు ఇస్తుందా? రాహుల్ గాంధీ అలా చేయమని అడిగారా?” అంటూ నిలదీశారు. 

 
ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాలు రాష్ట్రంలో గతంలో ఎన్నడూ జరగలేదని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.  దిగ్విజయ పోలీసులతో ప్రవర్తించిన తీరు మాజీ ముఖ్యమంత్రి స్థాయికి తగదని హితవు చెప్పారు. ఇలాంటి దురహంకార చర్యల వల్ల కాంగ్రెస్‌ తన పునాదిని కోల్పోతున్నదన్న వాస్తవానికి అద్దం పడుతుందని సీఎం స్పష్టం చేశారు. 

భోపాల్ జన్‌పద్ పంచాయతీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల సందర్భంగా “తీవ్ర అక్రమాలు” జరిగాయని ఆరోపిస్తూ  పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్, ఇతరులు పోలీసులతో ఘర్షణకు దిగారు.

అయితే, తమ పార్టీ మద్దతు ఇచ్చిన  అభ్యర్థులు 41 జిల్లా పంచాయతీలలో అధ్యక్ష పదవిని గెలుచు కోవడం, కాంగ్రెస్ 10 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి రావడంతో ఆ పార్టీ నాయకులు తట్టుకోలేక పోతున్నారని బిజెపి రాష్ట్ర నాయకులు విమర్శించారు.  మధ్యప్రదేశ్‌లోని 52 జిల్లాలు ఉండగా, ఒక్క సిద్ధిలో మాత్రం హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ ఎన్నికలు జరగలేదు.

 
బిజెపి అఖండ విజయం 
 
మధ్యప్రదేశ్‌లో ఇటీవల ముగిసిన జన్‌పద్ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. బీజేపీ భారీ విజయం ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌ల ఆధిపత్యాన్ని, ప్రజాదరణను మరోసారి రుజువు చేసింది. మధ్యప్రదేశ్‌లోని 11 మునిసిపల్ కార్పొరేషన్లలో జరిగిన మేయర్ ఎన్నికల్లో బిజెపి ఐదు స్థానాల్లో విజయం సాధించగా, మరో రెండు నగరాల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఒక్కొక్కటి చొప్పున స్థానాలను కైవసం చేసుకున్నాయి.

అదే విధంగా, రాష్ట్రవ్యాప్తంగా 23,000 వేల పంచాయతీల్లో దాదాపు 20,000 మంది బీజేపీ మద్దతు అభ్యర్థులు విజయం సాధించారు. అంతే కాకుండా,  రాష్ట్రంలోని నగర్ నిగం, నగర్ పాలిక, నగర్ పరిషత్‌లోని మొత్తం 3,468 వార్డులను బిజెపి కైవసం చేసుకుంది.

బీజేపీ పట్ల విశ్వాసం ఉంచినందుకు సీఎం చౌహాన్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బిజెపి ప్రజల నుండి అపారమైన ప్రేమ ఉందని చెబుతూ కాంగ్రెస్ ఇప్పుడు ఓ మూలకు పరిమితమైందని, ఇప్పుడు గ్రామీణ ప్రాంతం మొత్తం బిజెపికి అండగా నిలుస్తోందని తెలిపారు.

బీజేపీని ‘అర్బన్ పార్టీ’గా పరిగణిస్తున్నారని అడిగిన ప్రశ్నకు సీఎం చౌహాన్ స్పందిస్తూ  ‘‘ఇప్పుడు పరిస్థితి మారిపోయింది, నగరాలలో బీజేపీ ముందుకెళ్లింది.కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం మాకు లభించిన ఆదరణ అద్భుతం’’ అని పేర్కొన్నారు.

“ప్రధాని నరేంద్ర మోదీ పేదలకు సంక్షేమ పథకాలు, రైతుల ఆదాయాన్ని పెంచే ప్రయత్నాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు బిజెపికి పనిచేశాయి. అందుకే బిజెపి గ్రామీణ ప్రాంతాలలో కూడా స్థిరపడింది” అని ఆయన తెలిపారు. .

అంతకుముందు, స్థానిక ఎన్నికల్లో బిజెపిని గెలిపించినందుకు మధ్యప్రదేశ్‌లోని ఓటర్లకు ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు ఇది ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై తమకున్న అవినాభావ విశ్వాసానికి ప్రతీక అని కొనియాడారు.  పార్టీ కార్యకర్తలకు, గెలిచిన అభ్యర్థులకు మోదీ ట్వీట్‌లో అభినందనలు తెలిపారు.