సైన్స్ సిటీ కోసం మూడు లేఖలు రాసినా స్పందించని కేసీఆర్

హైదరాబాద్లో సైన్స్ సిటీ ఏర్పాటు కోసం చొరవ తీసుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మరో లేఖ రాశారు. సైన్స్ సిటీ కోసం అవసరమైన 25 ఎకరాల స్థలం, గైడ్ లైన్స్ కు అనుగుణంగా డీపీఆర్ ను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని లేఖలో ఆయన కోరారు. సైన్స్ సిటీ ఏర్పాటుతో విద్యార్థులు, యువతలో సైన్స్ పట్ల ఎంతో ఆసక్తిని పెంపొందించవచ్చని ఆయన పేర్కొన్నారు.
అంతేకాదు పర్యాటకంగా కూడా నగరానికి మంచి గుర్తింపు వస్తుందని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.  కలకత్తా, బెంగుళూరు, ముంబై, కురుక్షేత్ర సైన్స్ సిటీలను ప్రతి రోజూ వేలాది మంది విద్యార్థులు, యువత వారి కుటుంబ సభ్యులు, పర్యాటకులు సందర్శించి సైన్స్ పట్ల ఎంతో ప్రేరణను పొందుతున్నారని గుర్తు చేశారు. దేశంలో ఐదవ సైన్స్ సిటీని హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని  నిర్ణయించడం సంతోషంగా ఉందని చెప్పారు.
అయితే సైన్స్ సిటీ ఏర్పాటు కోసం తానే స్వయంగా మూడు సార్లు లేఖ రాసినా  రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదని కేంద్ర మంత్రి విచారం వ్యక్తం చేశారు.  హైదరాబాద్ నగరంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయదలచిన సైన్స్ సిటీ విషయమై ప్రతిపాదనను పంపమని గత ఏడాది డిసెంబర్ 15న మొదటి లేఖ రాశానని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
అటు తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 22న మరోసారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా లేఖ పంపామని తెలిపారు. అటు తర్వాత గత మే 6వ తేదీన కూడా ఇంకో లేఖ రాశానని చెప్పారు. డీపీఆర్ తయారు చేయడానికి ఏదైనా సాంకేతిక సహకారం అవసరమైతే కలకత్తాలోని డైరెక్టర్ జనరల్ ను సంప్రదిస్తే వారు సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నారని ఆ లేఖలో వివరంగా తెలియజేశానని కిషన్ రెడ్డి వివరించారు.
\ఇలా మూడుసార్లు లేఖ రాసినా రాష్ట్ర ప్రభుత్వం నుండి  ఎలాంటి స్పందన రాకపోవడంతో సైన్స్ సిటీ ఆవశ్యకతను మరోసారి ఈ లేఖ ద్వారా తెలియజేస్తున్నానని తెలిపారు. సైన్స్ సిటీ ఏర్పాటు వల్ల సైన్సుకు సంబంధించి ఇక్కడ ప్రదర్శించే ఎన్నో ఆవిష్కరణలు ప్రేరణ కలిగిస్తాయని,  కొత్త పరిశోధనలు చేయడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని కల్పిస్తాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
హైదరాబాదు నగరం సైన్స్ సిటీ ఏర్పాటు చేయడానికి కావలసిన అన్ని అర్హతలు కలిగి ఉందని, కాబట్టి ఈ విషయంలో మీరు వ్యక్తిగతంగా చొరవ చూపించి ఇకపై ఎలాంటి ఆలస్యం జరగకుండా 25 ఎకరాల భూమితోపాటు డీపీఆర్ ను తయారు చేయించి పంపాలని ఆయన ఈ సందర్భంగా కేసీఆర్ ను కోరారు.  తద్వారా తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులు, యువతకు సైన్స్ సిటీని చేరువ చేయాలని కేంద్ర మంత్రి ఆకాంక్ష వ్యక్తం చేశారు.