తెలంగాణాలో జిల్లాలకు వ్యాపిస్తున్న కరోనా మహమ్మారి 

ఇప్పటి వరకు హైదరాబాద్, పరిసర  ప్రాంతాలకే పరిమితమై ఉంటున్న కరోనా మహమ్మారి క్రమంగా తెలంగాణ జిల్లాలో వ్యాపిస్తుంది. కరోనా కేసులు జిల్లాల్లో పెరుగుతుండడం రాష్ట్ర ప్రభుత్వాన్ని, వైద్య, ఆరోగ్యశాఖను ఆందోళనకు గురి చేస్తోంది. పది రోజుల క్రితం జీహెచ్‌ఎంసీ పరిసర మేడ్చల్‌, రంగారెడ్డి పట్టణ జిల్లాలకే పరిమితమైన వైరస్‌ ఇప్పుడు… గ్రామీణ జిల్లాల్లోనూ వేగంగా వ్యాప్తి చెందుతోంది. 
 
ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో కరోనాతో చేరుతున్న రోగుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. కరోనా వితప్కర కాలంలో నోడల్‌ ఆసుపత్రిగా వ్యవహరించిన గాంధీ ఆసుపత్రిలో దాదాపు 40 మంది దాకా రోగులు కరోనాతో చికిత్స పొందుతున్నారు. ఈ పరిణామాన్ని పరిశీలిస్తే వైరస్‌ మరోసారి పంజా విసురుతోందన్న ఆందోళనను వైద్య నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. 
 
జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ , ప్రయివేటు ఆసుపత్రుల్లోనూ కరోనాతో చేరుతున్న రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో కరోనా మరణాలు కూడా చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారులు అధికారికంగా ధృవీకరించడం లేదు. 
 
ఒక్క వరంగల్‌ జిల్లాలోనే రెండు వారాల వ్యవథిలో దాదాపు ఆరుగురు దాకా కరోనాతో మృత్యువాత పడినట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు. 70 శాతం కేసులు జీహెచ్‌ఎంసీ పరిసర జిల్లాల నుంచే గ్రామీణ జిల్లాల్లో వేగంగా విస్తరిస్తున్న వైరస్‌ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారికంగా ప్రతీ రోజూ 800 దాకా కొత్త కరోనా కేసులు నమోదువుతున్నాయి. 
 
జీహెచ్‌ఎంసీ, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల నుంచే రోజువారీ కొత్త కేసుల్లో దాదాపు 70శాతం మేర నమోదవుతుండగా,  మిగతా కేసులు కరీంనగర్‌, ఖమ్మం, నల్గొండ, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల తదితర జిల్లాల నుంచి నమోదువుతున్నాయి. ఈ జిల్లాల్లో ప్రతీ రోజూ కనీసం 30 దాకా కొత్త కరోనా కేసులు అధికారికంగా నమోదవుతున్నాయి. 

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని, మాస్కును తప్పనిసరిగా ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా తిరిగి కరోనా వైరస్‌ కబళించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అనుమానం వచ్చిన వెంటనే కరోనా నిర్ధారణా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. జన సమూహాల్లోకి వెళ్లినపుడు, ప్రయాణ సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
 
రెండు వారాలుగా కరోనా కేసులు జిల్లాల్లో మళ్లి విజృంభిస్తుండడంతో బూస్టర్‌ డోస్‌ పంపిణీలో వైద్య, ఆరోగ్యశాఖ వేగం పెంచింది. బూస్టర్‌ డోస్‌ వేసుకుంటే కరోనా నుంచి దాదాపు పూర్తిస్థాయిలో రక్షణ లభిస్తుందని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పీహెచ్‌సీల వారీగా గ్రామాలు, వీధుల్లో సర్వే చేస్తూ రెండు డోస్‌ల వ్యాక్సిన్‌ వేసుకున్న ప్రతీ ఒక్కరికీ బూస్టర్‌ డోస్‌ టీకా వేస్తున్నారు.