తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది

రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో రోజు రోజుకు ప్రజల్లో బీజేపీ, మోదీ పట్ల ఆదరణ పెరుగుతోందని ఆయన చెప్పారు. 
 
లోక్‌సభ ప్రవాస్ యోజనలో భాగంగా హైదరాబాద్‌ పార్లమెంట్ ఇన్‌చార్జ్‌ సింధియా శనివారం పాతబస్తీలో రెండు రోజుల పర్యటనను ప్రారంభించారు. రెండు రోజుల పాటు కార్యకర్తలు, పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. మలక్‌పేట, చాంద్రయణగుట్ట, గోషామహల్‌, చార్మినార్‌, కార్వాన్ అసెంబ్లీ పరిధిలో పర్యటిస్తున్నారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఆయన బస చేస్తున్నారు.
 
జీహెచ్ ఎంసీ ఎన్నికలను చూస్తే గతంలో కార్పొరేటర్ల ఎన్నికల్లో కేవలం 4 శాతం మాత్రమే బీజేపీవి ఉండేవి. కానీ గత ఎన్నికల్లో 38 బీజేపీ గెలిచిందని ఆయన గుర్తు చేశారు. బీజేపీ, మోదీపై ప్రజలకు నమ్మకం పెరుగుతోందని తెలిపారు. 
 
శాసనసభకు సంబంధించి గతంలో తెలుగుదేశంతో కలిసి పోరాడితే బీజేపీతో గెలిచిన సీట్ల కంటే ఇప్పుడు సొంతంగా బీజేపీ పోటీ చేసి గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం తిరోగమనంలో ఉందని పేరొక్నటు, కేంద్ర ప్రభుత్వ పథకాలను కేసీఆర్ సర్కార్ సరిగ్గా అమలు చేయడం లేదని విమర్శించారు. బీజేపీ హయాంలోనే తెలంగాణకు అధిక నిధులు కేటాయించినట్లు చెప్పారు.
అలాగే తెలంగాణలో అవినీతి తీవ్ర స్థాయిలో ఉందని సింధియా ఆరోపించారు. తప్పు చేయనప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ అంటే భయమెందుకు? అని ప్రశ్నించారు.  దీంతో సహజంగానే ప్రస్తుత ప్రభుత్వం ఆందోళనలో ఉందని పేర్కొన్నారు.
హైదరాబాద్ లో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను పార్టీ తనకు అప్పగించిందని చెప్పారు.  ప్రతి బూత్‌ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని సింధియా తెలిపారు. కాగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆయన ముర్మును అవమానించడమంటే గిరిజనులు, మహిళలను కించపరచడమేనని స్పష్టం చేశారు.