రాష్ట్రపతి ముర్ముపై అధీర్ రంజన్ వ్యాఖ్యలతో అట్టుడికిన పార్లమెంట్

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ‘రాష్ట్రపత్ని’ అని సంబోధించి కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి అవమానించారని బీజేపీ పార్లమెంట్‌లో నిరసనకు దిగింది. బీజేపీ నిరసనలతో ఉభయ సభలు అట్టుడికాయి. రాష్ట్రపతిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన అధీర్ రంజన్ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. రాష్ట్రపతిని కాంగ్రెస్‌ పార్టీ అవమానించిందని, క్షమాపణలు చెప్పాల్సిందేనని లోక్‌సభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, రాజ్యసభలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ డిమాండ్‌ చేశారు.
పార్లమెంట్ వెలుపల, పార్లమెంట్ లోపల కూడా స్మృతి ఇరానీతో పాటు నిర్మలా సీతారామన్, పలువురు బీజేపీ మహిళా ఎంపీలు నిరసనకు దిగారు. ఒక ఆదివాసీ మహిళ దేశ అత్యున్నత పదవిని అలంకరించడం కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న మహిళను అవమానించడాన్ని సోనియా గాంధీ ఆమోదించారని ఆమె మండిపడ్డారు. సోనియా గాంధీ.. ఆదివాసీ వ్యతిరేకి, దళిత వ్యతిరేకి, స్త్రీ వ్యతిరేకి అంటూ ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ ఆమెను తీవ్రంగా అవమానిస్తోందని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు ముర్మును తోలుబొమ్మ అని కామెంట్ చేస్తున్నట్లు ఆమె చెప్పారు.
కాగా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సైతం సోనియాగాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలకు సోనియా గాంధీ ఇచ్చిన స్వేచ్ఛ కారణంగానే ఇలా మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డాయిరు. ఇందుకు సోనియా గాంధీ తప్పకుండా క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ కూడా కాంగ్రెస్‌ క్షమాపణలు చెప్పాలని స్పష్టం చేశారు.  ఇది నోరు జారి అన్న మాట కాదు.. ఒక్కసారి కాదు.. పదే పదే రాష్ట్రపతి పదం వాడారని తెలిపారు.
ఈ వ్యవహారంపై పెను దుమారం రేగడంతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కొంత అసహనానికి లోనయ్యారు. పార్టీ సీనియర్ నేతలు మల్లిఖార్జున్ ఖర్గే, ఈ వ్యాఖ్యలు చేసిన అధీర్ రంజన్ చౌదరితో సోనియా గాంధీ అత్యవసరంగా సమావేశం అయ్యారు. తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో వివరణ ఇచ్చుకునేందుకు సభలో తనకు అవకాశం ఇవ్వాలని అధీర్ రంజన్ చౌదరి లోక్‌సభ స్పీకర్‌ను కోరారు.
రాష్ట్రపతి ముర్ముపై అధీర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. దేశ వ్యాప్తంగా బిజెపి శ్రేణులు నిరసన తెలుపుతున్నారు. 
 
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ ఈడీ విచారణ, జీఎస్టీ విషయంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీలు బుధవారం నిరసన చేపట్టారు. పార్లమెంటు నుంచి విజయ్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు.  అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్ కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
అదే సమయంలో లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి వద్దకు వచ్చిన ఓ జర్నలిస్టు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నించగా.. రాష్ట్రపత్ని భవనానికి అని నోరు జారారు. ఈ వ్యాఖ్యలు కాస్తా మీడియాలో ప్రసారం కావడం దుమారానికి కారణమైంది. అధిర్ రంజన్ మాటలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది.
ఇలా ఉండగా, త‌న వ్యాఖ్య‌లు బాధిస్తే తాను స్వ‌యంగా రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్మును క‌లిసి క్ష‌మాప‌ణ చెబుతాన‌ని అధిర్ రంజ‌న్ చౌధరి తెలిపారు. ఈ ఉదంతంపై త‌న‌ను ఉరి తీసినా తాను సిద్ధ‌మేన‌ని, పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఈ వివాదంలోకి ఎందుకు లాగుతున్నార‌ని ఆయన ప్ర‌శ్నించారు. తాను పొర‌పాటుగా ఈ వ్యాఖ్య‌లు చేశాన‌ని, రాష్ట్ర‌ప‌తిని అవ‌మానించాల‌నే ఆలోచ‌న త‌న‌కు లేద‌ని పేర్కొన్నారు.