తొలి స్వదేశీ విమాన వాహక నౌక నావికా దళానికి అప్పగింత

మన దేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన తొలి విమాన వాహక నౌకను కొచ్చిన్ షిప్‌యార్డు లిమిటెడ్ (సీఎస్ఎల్) గురువారం భారత నావికా దళానికి అప్పగించింది. ఇది ఐఎన్ఎస్ విక్రాంత్ పేరుతో భారత నావికా దళం  కార్యకలాపాల్లో పాల్గొంటుంది. ఈ విమాన వాహక నౌకను భారత నావికా దళానికి అప్పగించినట్లు రక్షణ శాఖ వర్గాలు ఓ వార్తా సంస్థకు తెలిపాయి. దీనిని వచ్చే నెలలో  అధికారికంగా నావికా దళంలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలిపాయి. 
రక్షణ శాఖ విడుదల చేసిన ప్రకటనలో, స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ విమాన వాహక నౌక హిందూ మహాసముద్రం ప్రాంతంలో మన దేశ పరిస్థితి మరింత పటిష్టమయ్యేందుకు దోహదపడుతుందని తెలిపింది. ముఖ్యంగా బ్లూ వాటర్ నేవీ (మహా సముద్రాల లోపలి జలాల్లో అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలను నిర్వహించే సత్తాగల సముద్ర సంబంధ దళం)లో మన దేశ సత్తా బలోపేతమవుతుందని తెలిపింది.
 
కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ విడుదల చేసిన ప్రకటనలో, ఈ విమాన వాహక నౌకను భారత నావికా దళానికి అప్పగించినట్లు ధ్రువీకరించింది. భారత దేశంలో ఇప్పటి వరకు తయారైన అతి పెద్ద యుద్ధ నౌక ఇదేనని తెలిపింది. ఇది 45,000 టన్నుల సామర్థ్యం కలదని తెలిపింది. ఇది మన దేశంలో అత్యధికంగా కోరుకునే నావల్ వెజల్ ప్రాజెక్ట్ అని పేర్కొంది. 
 
1971లో జరిగిన యుద్ధంలో కీలక పాత్ర పోషించిన ఐఎన్ఎస్ విక్రాంత్ పేరును ఈ విమాన వాహక నౌకకు పెట్టినట్లు వివరించింది. మన దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకుంటున్న తరుణంలో ఐఎన్ఎస్ విక్రాంత్ మరోసారి అవతరించడం సముద్ర సంబంధిత భద్రతను విస్తరించు కోవడం కోసం భారత దేశం చేస్తున్న కృషికి నిదర్శనమని తెలిపింది.
ఈ విమాన వాహక నౌక పొడవు 262 మీటర్లు. గతంలోని విక్రాంత్ కన్నా ఇది చాలా పెద్దది, అత్యాధునికమైనది. దీనికి నాలుగు గ్యాస్ టర్బయిన్స్ ఉన్నాయి. మొత్తం మీద 88 మెగావాట్ల పవర్ ఉంది. గరిష్ఠంగా 28 నాట్స్ వేగంతో నడుస్తుంది. ఈ నిర్మాణ ప్రాజెక్టు మూడు దశల్లో జరిగిందని, మొదటి దశ 2007 మే నెలలో పూర్తయిందని, రెండో దశ డిసెంబరు 2014లోనూ, మూడో దశ 2019 అక్టోబరులోనూ పూర్తయిందని తెలిపింది. దీని కోసం దాదాపు రూ.20,000 కోట్లు ఖర్చయిందని పేర్కొంది.
మొత్తం మీద 76 శాతం స్వదేశీ కంటెంట్‌తో తయారైన ఈ నౌక స్వయం సమృద్ధ భారత దేశం పథకానికి నిఖార్సయిన ఉదాహరణ అని, ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మేక్ ఇన్ ఇండియా’ పథకానికి మంచి ప్రోత్సహాన్నిచ్చే అంశమని తెలిపింది. ఈ నౌకను అప్పగించడంతో విమాన వాహక నౌకను దేశీయంగానే డిజైన్ చేసి, నిర్మించే సత్తాగల కొన్ని దేశాల సరసన భారత దేశం చేరిందని వివరించింది.
రెక్కలు కదలకుండా స్థిరంగా ఉండేవిధంగా నిర్మించిన విమానాలు, మిగ్-29కే ఫైటర్ జెట్స్ వంటి రోటరీ ఎయిర్‌క్రాఫ్ట్, కమోవ్-31, ఎంహెచ్-60ఆర్ మల్టీ రోల్ హెలికాప్టర్లు, అదేవిధంగా స్వదేశంలో తయారైన అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్లు, లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఈ విమాన వాహక నౌక మోసుకెళ్ళగలదు. 30 విమానాల కార్యకలాపాలు ఈ నౌక ద్వారా జరిగే అవకాశం ఉంది. షార్ట్ టేకాఫ్ చేయవచ్చు.
ఈ విమాన వాహక నౌక నిర్మాణంలో మన దేశంలోని బీఈఎల్, బీహెచ్ఈఎల్, జీఆర్ఎస్ఈ, కెల్ట్రాన్, కిర్లోస్కర్, లార్సన్ అండ్ టూబ్రో, వర్‌ట్సిల ఇండియా వంటి భారీ పరిశ్రమలతోపాటు దాదాపు 100కు పైగా ఎంఎస్ఎంఈ (చిన్నతరహా, మధ్య తరహా పరిశ్రమలు) భాగస్వాములయ్యాయి.
స్వదేశంలోనే నిర్మించాలనే ప్రయత్నాల వల్ల అనుబంధ పరిశ్రమల అభివృద్ధి కూడా జరుగుతోందని ఈ ప్రకటన వివరించింది. ఉపాధి అవకాశాల సృష్టితోపాటు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఉపయోగపడుతున్నట్లు తెలిపింది.  యుద్ధ నౌకల నిర్మాణానికి తగిన స్థాయిగల  ఉక్కును మన దేశంలోనే ఉత్పత్తి చేయడానికి ఈ ప్రాజెక్టు దోహదపడిందని తెలిపింది. నావికా దళం, డీఆర్‌డీవో, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో ఈ ఉక్కును ఉత్పత్తి చేసినట్లు వివరించింది.