మోదీ రైతు సంక్షేమ పధకాలను అడ్డుకుంటున్న కేసీఆర్

నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్రంలో రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే కేసీఆర్ తెలంగాణ లో వాటి అమలును అడ్డుకుంటున్నారని  బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్ కుమార్ చాహార్  ఆరోపించారు. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ లో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తూ  ప్రధాన మంత్రి పసల్ బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయకుండా రైతులకు కేసీఆర్ ద్రోహం చేస్తున్నాడని విమర్శించారు. 
 
కిసాన్ మోర్చా తెలంగాణ లో గ్రామ గ్రామానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రచారం చేయడం తో పాటు కేసీఆర్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపు ఇచ్చారు.కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అధ్యక్షత వహించారు. 
 
రైతు బంధు పేరుతో అన్ని సబ్సిడీలు బంద్ చేసిండని కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ధ్వజమెత్తారు.  రైతు బంధు ఇచ్చి నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెంచిండని కేసీఆర్ పై మండిపడ్డారు.  రైతుల కోసం తాను ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నట్లు కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని అంటూ  ఉద్యోగులకు సరిగ్గా జీతాలివ్వలేనోడు రైతులను ఎట్లా ఆదుకుంటాడని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టబోతోందని అబద్ధాలు చెబుతూ కేసీఆర్ రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.  ఉచిత విద్యుత్ పేరుతో డిస్కంలకు కేసీఆర్ రూ. 60 వేల కోట్లు బకాయి పెట్టారన్న సంజయ్ప రిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో గంట సేపు కూడా విద్యుత్  ఇచ్చే పరిస్థితి ఉండదని హెచ్చరించారు.
కేసీఆర్ చెప్పే మాటలను రైతులు నమ్మవద్దన్న బండి సంజయ్  రైతులను ఆదుకునే ఒకే ఒక పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు. రకరకాల స్కీములతో ఒక్కో ఎకరాకు రైతులకు కేంద్రం రూ.41 వేలు అందిస్తోందని తెలిపారు. ప్రతి కిసాన్ మోర్చా కార్యకర్త ఈ విషయాలన్నింటినీ రైతులకు అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు.
కేసీఆర్ మోసానికి కి బలి అయిన వారిలో రైతులు ముందు వరుసలో ఉన్నారని తెలిపారు. 2018 లక్ష రూపాయల రుణ మాఫీ హామీ కేసీఆర్ ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి క్లౌడ్ బరస్ట్ పేరుతో కేసీఆర్ నాటకాలు అడుతున్నడని మండిపడ్డారు. 
 
కేంద్ర ప్రభుత్వం డిఎపి  యూరియా పై ఎకరాకు సుమారుగా రూ 35,000 సబ్సిడీ ఇచ్చి రైతుకు వెన్ను దన్నుగా నిలిస్తే కేసీఆర్ ఇన్పుట్ సబ్సీడీ ఇవ్వకుండా రైతును దగా చేసాడని విమర్శించారు. 
 
 కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ లక్ష రూపాయల రుణ మాఫీ అమలుకు ప్రధాన మంత్రి పసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణ లో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కిసాన్ మోర్చా చేపట్టిన రైతు సంతక సేకరణ ఉద్యమం ఆగస్టు 7 వరకు తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నిర్వహిస్తామని వెల్లడించారు. 
 
 కిసాన్ మోర్చ జాతీయ ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.