అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి తప్పుకోనున్న రష్యా

2024 సంవత్సరం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి తప్పుకోవాలని రష్యా నిర్ణయించినట్టు ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. స్వయంగా రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘రోస్ కాస్మోస్’ అధిపతి యూరీ బోరిసోవ్ ఈ విషయాన్ని వెల్లడించారని పేర్కొంది. 
 
ఇప్పటివరకు ఐఎస్ఎస్ భాగస్వామ్య దేశాలకు ఇచ్చిన హామీలను తు.చ తప్పకుండా అమలు చేస్తామని తెలిపినట్లు కథనంలో ప్రస్తావించింది. ఈ అంశంపై ‘రోస్ కాస్మోస్’ అధిపతి యూరీ బోరిసోవ్ ప్రత్యేక నివేదికను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు మంగళవారం అందించారని తెలిపింది.  
ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ప్రకటించిన నేపథ్యంలో పాశ్చాత్య దేశాల నుంచి కఠిన ఆంక్షలను రష్యా  ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో పాశ్చాత్య దేశాలపై అన్ని అస్త్రాలను ప్రయోగించిన రష్యా ఇప్పుడు ‘ఐఎస్‌ఎస్‌’ అంశాన్ని కూడా తెరపైకి తెచ్చింది.
తమ దేశంపై ఆంక్షలను ఎత్తివేయకుంటే ఐఎస్‌ఎస్‌కు రష్యా వైపునుంచి అందుతున్న సేవలకు అంతరాయం కలుగుతుందని పలుమార్లు  ‘రోస్‌ కాస్మోస్’ హెచ్చరించింది.   అదే జరిగితే  500 టన్నుల బరువైన ‘ఐఎస్‌ఎస్‌’ నిర్మాణం సముద్రంలో కానీ, భూమిపై కానీ కూలిపోయే ముప్పు ఉంటుందని హెచ్చరిక చేసింది.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ముఖ్యంగా రెండు కీలకమైన విభాగాలున్నాయి. ఇందులో ఒకదాన్ని అమెరికా పర్యవేక్షిస్తుంటే, మరొకదాన్ని రష్యా నిర్వహిస్తోంది. ఐఎస్‌ఎస్‌ను నివాసయోగ్యంగా మార్చే పవర్‌ సిస్టమ్స్‌లను యూఎస్‌ నిర్వహిస్తోంది.  ఐఎస్‌ఎస్‌ నిర్దేశిత కక్ష్యలో తిరిగేందుకు కావాల్సిన ప్రొపల్షన్‌ సిస్టమ్‌ను రష్యా అందిస్తోంది. ఎందుకంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం పూర్తిగా జీరో గ్రావిటీ స్పేస్‌లో లేదు. ఇది కొద్దిగా భూమి గురుత్వాకర్షణను ఎదుర్కొంటుంది.
భూమి చుట్టూ తిరుగుతున్న సమయంలో ఇది కొంత శక్తిని కోల్పోతుంది. దాన్ని అలాగే వదిలేస్తే కూలిపోయే ప్రమాదం ఉంటుంది. ఈనేపథ్యంలో ఐఎస్‌ఎస్‌ ను నియంత్రించేందుకు రష్యా థ్రస్టర్లను పంపుతుంది. ఇవి ఐఎస్‌ఎస్‌ను నిరంతరం నియంత్రిత కక్ష్యలో తిరిగేలా చేస్తాయి.
అలాగే దానికి కావాల్సిన వేగాన్ని కూడా అందిస్తాయి. ఒకవేళ రష్యా ఈ సేవలను అందించడం ఆపేస్తే తమ కంపెనీ రంగంలోకి దిగుతుందని ఇప్పటికే స్పేస్‌ ఎక్స్‌ యజమాని ఎలాన్‌ మస్క్‌ హామీ ఇచ్చారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నిర్వహణలో మొత్తం 15 దేశాలకు చెందిన 5 అంతరిక్ష పరిశోధనా సంస్థలు పాల్గొంటున్నాయి.
అమెరికా, జపాన్, రష్యా, కెనడా, ఐరోపా స్పేస్ ఏజెన్సీలో సభ్యత్వం కలిగిన దేశాలన్నీ ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. భూమి నుంచి 420 కిలోమీటర్ల ఎత్తులో నిర్దిష్ట కక్ష్యలో ఐఎస్ఎస్ తిరుగుతుంటుంది.  గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది. ఈ లెక్కన ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమిని చుట్టేస్తుంది.  ఒక మిలియన్ పౌండ్ల బరువు ఉండే  అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఫుట్ బాల్ మైదానం సైజులో ఉంటుంది.