ఆ డబ్బంతా పార్థా ఛటర్జీదే.. అర్పితా ముఖర్జీ స్పష్టం 

పశ్చిమ బెంగాల్‌లో ఉద్యోగ నియామకాల స్కామ్‌ కేసు దర్యాప్తు వేళ తన ఇంట్లోంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు అంతా నాటి బెంగాల్‌ విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీదేనని నిందితురాలు, నటి అర్పితా ముఖర్జీ ఒప్పుకున్నారు. ఈడీ కస్టడీలో విచారణలో ఆమె ఈ విషయం వెల్లడించారు.

ఉపాధ్యాయుల నియామక స్కామ్‌లో భాగంగా ఈడీ సోదాల్లో ఆర్పిత ఇంట్లో రూ.20 కోట్ల కరెన్సీ కట్టలను స్వాధీనం చేసుకోవడం తెల్సిందే. ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించిన లావాదేవీల కోసం వారు 12 నకిలీ సంస్థలను నడుపుతున్నట్లు ఈడీ ఉన్నతాధికారి వెల్లడించారు. అర్పిత, పార్థా ఉమ్మడిగా ఒక ఆస్తిని కొనుగోలుచేయగా, సంబంధిత డాక్యుమెంట్‌ను ఈడీ స్వాధీనంచేసుకుంది. గ్రూప్‌ సీ, గ్రూప్‌ డీ తరగతి ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు, తుది ఫలితాలు, అపాయిమెంట్‌ లెటర్స్‌ తదితర పత్రాలూ అర్పిత ఫ్లాట్‌లో దొరికాయి.

వెస్ట్‌ మేదినీపూర్‌ ఓ స్కూల్‌ పేరిట మంత్రి భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టినట్లు ఈడీ ఆరోపిస్తోంది. కాగా, అనారోగ్యమంటూ ఆస్పత్రిలో చేరిన మంత్రి పరిస్థితి బాగానే ఉందని, ఆస్పత్రిలో చికిత్స అనవసరమని భువనేశ్వర్‌ ఎయిమ్స్‌    ప్రకటించింది. కాగా, మంత్రి, అర్పితలను ఆగస్ట్‌ మూడో తేదీ దాకా ఈడీ కస్టడీకి అప్పజెప్తూ ఈడీ కోర్టు ఆదేశాలిచ్చింది.

ఇలా ఉండగా, పాఠశాల ఉద్యోగాల కుంభకోణం కేసులో శనివారం అరెస్టయిన మంత్రి తమ పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీకి మూడు సార్లు ఫోన్ చేశారు. అయితే, ఆయన చేసిన కాల్స్‌కు మమత ఎలాంటి స్పందన ఇవ్వలేదని తెలుస్తున్నది.  తాము అరెస్టయిన సమాచారాన్ని కుటుంబసభ్యులకు గానీ, స్నేహితులకు గానీ తెలియజేసేందుకు ఫోన్ చేసే అవకాశాన్ని నిందితులకు కల్పిస్తే, ఆయన మమతకు ఫోన్ చేశారని  పోలీసులు తెలిపారు.
 
మమతాబెనర్జీకి మూడుమార్లు ఫోన్ చేసినట్టు అరెస్ట్ మెమోలో పోలీస్ అధికారులు వెల్లడించారు. అర్ధరాత్రి  55 నిమిషాల సమయంలో మంత్రి అరెస్టు కాగా.. 2 గంటల 33 నిమిషాలకు మొదటి కాల్ చేశారు. కానీ.. ఆ సమయంలో మమతా ఆ కాల్‌కు స‍్పందించలేదు. 
 
ఆ తర్వాత.. వేకువ జామున 3 గంటల 37 నిమిషాలకు కూడా ఫోన్ చేయగా.. మమత నుంచి మళ్లీ ఎలాంటి స్పందన లభించలేదు.  తిరిగి.. ఉదయం 9 గంటల 35 నిమిషాలకు మరోసారి ఫోన్ చేసినా పార్థ ఛటర్జీకి నిరాశే ఎదురైంది.
 
ఆ తర్వాత.. మంత్రి అనారోగ్యానికి గురికావటంతో.. ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించటంతో.. కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు మంత్రి పార్థ ఛటర్జీని ఈరోజు ఉదయం ఎయిర్ అంబులెన్స్‌లో భువనేశ్వర్‌లోని ఏయిమ్స్‌కు తరలించారు. కాగా.. దృశ్య మాధ్యమం ద్వారా విచారణకు హాజరుకావాలని మంత్రికి న్యాయస్థానం తెలిపింది.
 
మరోవంక, తన మంత్రి అరెస్ట్ పై రెండు రోజులపాటు మౌనం వహించిన మమతా బెనర్జీ  నేరం రుజువైతే పార్థ ఛటర్జీకి జీవిత ఖైదు విధించినా అభ్యంతరంలేదని సోమవారం స్పష్టం చేశారు. ఈ కేసును వీలైనంత త్వరగా తేల్చాలని కోరారు. ఎవరు తప్పు చేసినా తాను సహించబోనని, అవినీతికి మద్దతు ఇవ్వబోనని చెప్పారు.