తెలంగాణ హైకోర్టుకు ఆరుగురు కొత్త జడ్జీలు

తెలంగాణ హైకోర్టులో కొత్తగా ఆరుగురిని జడ్జిలుగా నియమించాలని సుప్రీం కొలీజియం సిఫారసు చేసింది. న్యాయవాదులకు హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి కల్పించాలని సిఫారసులో వెల్లడించింది. కొలీజియం సిఫారసు చేసిన వారిలో ఏనుగుల వెంకట వేణుగోపాల్, నేగేశ్ భీమపాక, నామవరపు రాజేశ్వరరావు, కాజా శరత్, పుల్ల కార్తీక్, జగ్గన్నగారి శ్రీనివాసరావులు ఉన్నారు.
 
వీరిని సుప్రీం కొలీజియం సిఫారసు చేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు సదరు న్యాయాధికారుల పేర్లను కొలీజియం కేంద్రానికి పంపింది. కేంద్రం ఆమోదముద్ర వేసిన తరువాత ఆ పేర్లు రాష్ట్రపతి ఆమోదం కోసం వెళతాయి. రాష్ట్రపతి ఆమోదం తరువాత వారు న్యాయమూర్తులుగా ప్రమాణం పదవీ బాధ్యతలు చేపడుతారు. 
 
రాష్ట్రంలో ప్రస్తుతం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్తో సహా 27 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. తాజా ఉత్తర్వులతో 27 మందికి మరో ఆరుగురు న్యాయమూర్తులను నియమించడంతో సంఖ్య 33కు చేరనుంది.
ఏనుగుల వెంకట వేణుగోపాల్ కరీంనగర్ జిల్లా మంకమ్మతోటలో 1967 ఆగస్టు 16న జన్మించారు. ఈయన తండ్రి రాజేశ్వర్‌రావు హ్యాండ్‌లూమ్స్‌ ఇండస్ట్రీస్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా, తల్లి బాలాకుమారి టీచర్‌ గా చేసి రిటైర్‌ అయ్యారు. ఉస్మానియా వర్సిటీలో లా చదివారు.
1992లో లాయర్‌గా ఎన్‌ రోల్‌ అయ్యాక  కరీంనగర్‌ కోర్టులో ప్రాక్టీస్‌ మొ దలుపెట్టారు. సీనియర్‌ అడ్వొకేట్‌ రాం జెఠ్మలానీ దగ్గర జూనియర్‌గా పనిచేశారు.  కేంద్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో వాదించారు.  రైల్వే స్టాండింగ్‌ కౌన్సిల్‌గా చేశారు. 2021లో సీనియర్‌గా ప్రమోషన్‌ పొందారు. అన్ని రకాల కేసులు వాదించారు.
నేగేశ్ భీమపాక  1969, మార్చి 8న భద్రాచలంలో జన్మించారు. తండ్రి భూపతిరావు స్వతంత్ర సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే. తల్లి శాంతమ్మ. భద్రాచలంలోనే పాఠశాల విద్య పూర్తి చేశారు. ఖమ్మంలో ఇం టర్, ఎల్‌ఎల్‌బీని  సీఆర్‌ రెడ్డి కాలేజీలో, ఎల్‌ఎల్‌ఎంను హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో అభ్యసించారు. 1993లో అడ్వొకేట్​గా నమోదయ్యారు. గవర్నమెంట్‌ అసిస్టెంట్‌ ప్లీడర్‌గా,  జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, ఇండస్ట్రీస్‌ జీపీగా సేవలందించారు.
నామవరపు రాజేశ్వరరావు  1969, జూన్‌ 30న  మహబూబాబాద్‌ జిల్లా సుదన్‌పల్లిలో గిరిజాకుమారి, సత్యనారాయణరావులకు జన్మించారు. వరంగల్‌ సరస్వతీ శిశు మందిర్‌లో పాఠశాల విద్య, గోవిందరావుపేటలో ఇంటర్, మహబూబాబాద్‌లో డిగ్రీ చేశారు.  హైదరాబాద్‌ పెండేకంటిలో లా పూర్తిచేశారు. 2001లో అడ్వొకేట్​గా ఎన్‌రోల్‌ చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున వివిధ సంస్థలకు న్యాయవాదిగా పనిచేశారు. 2019 నవంబర్‌ నుంచి అసిస్టెంట్‌ సొలిసిటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
కాజా శరత్ 1971, జనవరి 29న భద్రాచలంలో లలితాంబ, సీతారామయ్యలకు జన్మించారు. డిగ్రీ వరకు అక్కడే చదివారు. ఏయూ నుంచి లా, ఓయూ నుంచి ఎంఏ, ఎల్‌ఎల్‌ఎం పూర్తిచేశారు. 1997లో అడ్వొకేట్​గా ఎన్‌రోల్‌ అయ్యారు. కొత్తగూడెం, భద్రాచలం కోర్టుల్లో ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. 2002 నుంచి హైకోర్టులో వాదిస్తున్నారు.  
 
పుల్ల కార్తీక్ 1967, జూన్‌ 4న జగిత్యాలలో పోచమల్లమ్మ, ఒగ్గు హనుమంతులకు జన్మించారు. జగిత్యాలలో ప్రాథమిక విద్య, ఉస్మానియా ఆర్ట్స్‌ కాలేజీలో డిగ్రీ, పీజీ, ఓయూలో లా, ఎల్‌ఎల్‌ఎం చదివారు. 1996లో అడ్వొకేట్‌గా ఎన్‌రోల్‌ అయ్యారు. 2015లో ఏపీ పరిపాలన ట్రైబ్యునల్‌ జీపీగా చేశారు. 2017 నుంచి గవర్నమెంట్‌ జీపీగా పనిచేస్తున్నారు.
 
జగ్గన్నగారి శ్రీనివాసరావు 1969, ఆగస్టు 31న రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట మండలం లింగన్నపేటలో మాణిక్యరావు, లక్ష్మీబాయిలకు జన్మించారు. అదే జిల్లాలో ఇంటర్‌ పూర్తిచేశారు. న్యూ సైన్స్‌ కాలేజీలో డిగ్రీ చదివారు. ఓయూలో బీఏ, ఎల్‌ఎల్‌బీ చేశారు. 1999లో అడ్వొకేట్​గా ఎన్‌రోల్‌ అయ్యారు. 2015 నుంచి సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌లో స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేస్తున్నారు.