విఫల రాజ్యం మరో విఫల యత్నం కార్గిల్ యుద్ధం

జూలై 26, 1999, కార్గిల్ పర్వత ప్రాంతాలలో భారత సేనలు సాధించిన అనూహ్యమైన విజయం- కార్గిల్ విజయ్ దివస్ భారత సేనల అద్వితీయ ధైర్యసాహసాలు, అత్యున్నత త్యాగం, విజయ గాధ మాత్రమే కాదు దౌత్యపరంగా అంతర్జాతీయంగా భారత్ ను బలీయమైన శక్తిగా నిలిపిన రోజు. 
 
అంతేకాదు, అంతర్జాతీయంగా మొదటిసారిగా పాకిస్థాన్ ను ఏకాకిగా చేసిన సమయం. మరోవంక, పాకిస్థాన్ ను ఉగ్రవాదాన్ని పోషిస్తున్న ఓ వికార దేశంగా ప్రపంచ ప్రజల ముందుంచిన ఘటన. 
 
ఈ యుద్ధం అణుయుద్ధంగా మారే ప్రమాదం కలిగించడం ద్వారా మూడవ దేశం తక్షణ జోక్యానికి దారితీసే విధంగా చేయడం ద్వారా కాశ్మీర్‌ను అంతర్జాతీయ వివాదంగా చిత్రీకరించాలని ముషారఫ్ ప్రధాన ఎత్తుగడ.  అందుకోసమే, ఎల్‌ఓసీని ఉల్లంఘించి కార్గిల్‌లోని నియంత్రణ లేని ప్రాంతాలను ఆక్రమించాలి అనుకున్నారు. అయితే కార్గిల్ దాడి తర్వాత భారతీయ సైన్యం స్పందించిన తీరు పాకిస్థాన్ సైన్యం ఊహకు అందని విధంగా ఉండడంతో వారి ఆటలు సాగలేదు.
అంతర్జాతీయంగా భారత దేశ దౌత్య సంబంధాలలో, రాజకీయ ప్రాపకంలో, సైనికంగా జనసేన సామర్థ్యంతో భారత్ ను ఒక శక్తివంతమైన దేశంగా భారత్ గుర్తించిన సమయం. అటువంటి దేశ పౌరులంగా మనమంతా గర్వంతో, కృతజ్ఞతా భావంతో స్మరించుకోవలసిన రోజు ఇది. 
 
పాకిస్థాన్ వంచనను అంతర్జాతీయంగా బహిర్గతం చేయగలిగాము. ఆనాడు వాజపేయి, జార్జ్ ఫెర్నాండస్, జస్వంత్ సింగ్ – తిరుమూర్తుల నాయకత్వంలో మన ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించిన తీరు అనూహ్యం. 1971లో బాంగ్లాదేశ్ ఆవిర్భావం తర్వాత మనం సైనికంగా, దౌత్యపరంగా సాధించిన మరో అసాధారణమైన విజయంగా చెప్పవచ్చు.  
 
వ్యూహాటకమైన కార్గిల్  పర్వత ప్రాంతాలను ఆక్రమించుకోవడం ద్వారా సమీప భవిష్యత్ లో మొత్తం జమ్మూ, కాశ్మీర్ ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం కోసం పాకిస్తాన్ కుట్రపూరితంగా, దొంగచాటుగా దెబ్బతీయాలని చేసిన ప్రయత్నాన్ని మన సేనలు అపూర్వమైన ధైర్యసాహసాలతో ఎదిరించారు. ప్రతికూలమైన పర్వత ప్రాంతాలలో మన సేనల పోరాట పటిమ మొత్తం ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేసింది.
 
 ఉగ్రవాదులతో పాటు వారి వేషధారణలో చొరబడి భారత్-పాకిస్థాన్ నియంత్రణ రేఖ వెంబడి కార్గిల్ కొండలను ఆక్రమించిన పాక్ సైనికులను భారతీయ సైనికులు తుదముట్టించారు. అణ్వాయుధ దాడి వంటి తీవ్ర సంక్షోభం తలెత్తే అవకాశం ఉందన్న భయంతో కూడా భారతదేశాన్ని భయపెట్టలేమని యావత్ ప్రపంచ సమాజం గ్రహించేటట్లు చేయగలిగారు. దేశ  ఐక్యత, సమగ్రతను రక్షించే సమస్యలపై ప్రపంచంలోని ఏ అగ్రరాజ్యం ఒత్తిడికి లేదా ప్రభావానికి భారత్ లొంగబోదని స్పష్టం చేశారు. 
 
కార్గిల్ యుద్ధం పాకిస్థాన్‌ను ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే రాజ్యంగా పూర్తిగా బహిర్గతం చేసింది. కార్గిల్ దాడిపై తనకు ఎలాంటి సమాచారం లేదని  పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ చెప్పగా, షరీఫ్‌కు అన్నీ తెలుసని ఆర్మీ చీఫ్ ముషారఫ్ పేర్కొంటూ దొంగాట ఆడారు. 
 
కార్గిల్‌ గురించి షరీఫ్‌కు తెలుసో, తెలియదో గాని పాక్ సేనలకు తిరిగి భారత్ పై యుద్దానికి దిగలేని విధంగా గుణపాఠం చెప్పాం.  సైన్యం చేసిన ఈ దుశ్చర్య గురించి ప్రధానికి నిజంగా తెలియకపోతే, ‘పాకిస్థాన్‌కు సైన్యం లేదు, సైన్యంలో పాకిస్తాన్ ఉంది’ అని స్పష్టం అవుతుంది.
·
మొత్తానికి ఈ దుస్సాహసం పాకిస్తాన్ ను జటిలమైన సంకటంలో పడవేసింది. మే 17న పాక్ సేనలు కార్గిల్ పర్వతాలపైకి చొచ్చుకు పోయేవరకు తనకు ఈ దాడి గురించి తెలియదని ఆ దేశం విదేశాంగ మంత్రి కూడా కలత చెందారు. పాకిస్తాన్ సైన్యంలో ఇంతటి గందరగోళం అంతకు ముందెన్నడు కలుగలేదు.

భారత్ అనుసరించిన అసాధారణమైన దౌత్య వ్యూహం కారణంగా  కార్గిల్ శిఖరాల నుంచి సైన్యాన్ని వెనక్కి రప్పించాలని ప్రపంచంతో పాటు తమకు బాసటగా మరోవైపు నుండి భారత్ పై యుద్దానికి దిగుతుందని అనుకున్న  చైనా కూడా సేనలను వెనుకకు తీసుకెళ్లామని ఒత్తిడి చేయడంతో పాకిస్తాన్ దిగ్భ్రాంతి చెందింది. 

కార్గిల్‌లో పోరాడుతున్న తమ సేనలు కాదని, ముజాహిదీన్‌లు అని మొదట పాకిస్తాన్ ప్రపంచానికి అబద్ధం చెప్పింది, కానీ ప్రపంచ ఒత్తిడిలో పాకిస్తాన్ తన సైన్యాన్ని వెనక్కి పిలిచినప్పుడు,  వారి కుట్ర ఏమిటో  ప్రపంచానికి బట్టబయలైంది. పాకిస్తాన్ ముజాహిదీన్లను నియంత్రిస్తున్నట్లు భారత్ చేస్తున్న ఆరోపణలు వాస్తవమని మొత్తం ప్రపంచం గ్రహించింది. 
 
ముజాహిదీన్‌ పేరుతో కశ్మీర్‌ లోయలో పాక్‌ ఉగ్రరూపం దాల్చిందన్న వాస్తవం కూడా ప్రపంచ దేశాలకు అర్థమయింది.  అంతర్జాతీయ వత్తిడి పెరగడంతో దిక్కులేక కార్గిల్ ఎత్తైన శిఖరాలలో పర్వేజ్ ముషారఫ్ తమ సేనలను దిక్కులేనివారిగా వదిలివేశారు. దానితో   మరణించిన  చాలా మంది పాకిస్తాన్ సైనికుల శవపరీక్ష నివేదిక వారి కడుపులో గడ్డి ఉందని, అంటే వారికి తినడానికి ఏమీ లేదని తేలింది.
ఆవిర్భవించినప్పటి నుంచి పాకిస్థాన్‌లో జవాబుదారీ వ్యవస్థ అంటూ  లేదు. అరాచకమే రాజ్యమేలుతుంది.  ఇంత పెద్ద పొరపాటుకు కారణమైన ఆర్మీ చీఫ్ ముషారఫ్ ఆ తర్వాత పాకిస్తాన్ అధ్యక్షుడు కావడమే అందుకు నిదర్శనం.  ఏమైతేనేమి, కార్గిల్ విఫల రాజ్యానికి మరో విఫల ప్రయత్నమని నిరూపించబడింది. 
 
1965, 1971 యుద్ధాలలో ఓడిపోయినా పాకిస్తాన్  సైన్యం తన  దుర్మార్గపు ఆలోచన మారలేదు. 1999 కార్గిల్ యుద్ధానికి ముందు రెండుసార్లు, పాకిస్తాన్ సైన్యం కార్గిల్ వైపు నుండి భారత్‌పై దాడి చేయాలని ప్రతిపాదనలను,  రాజకీయ నాయకత్వాలకు కూడా అందించింది.  అయితే రెండు సార్లు ఈ ప్రణాళికలను రాజకీయ నాయకులు తిరస్కరించారు. ఒకసారి జియా ఉల్ హక్, రెండోసారి బెనజీర్ భుట్టో. 
 
ఈ ప్రణాళికను భుట్టోకు సమర్పించినప్పుడు, కార్గిల్ యుద్ధ సమయంలో ఆర్మీ చీఫ్‌గా ఉన్న పర్వేజ్ ముషారఫ్ ఆర్మీకి డిజిఎంఓ.  అయితే, ఆ సమయంలో ఆర్మీ చీఫ్‌గా ఉన్న పర్వేజ్ ముషారఫ్ ఆధ్వర్యంలో మూడవసారి అమలు చేశారు.    

దాడిలో పాక్ ప్రధాన లక్ష్యాలు
* శ్రీనగర్‌ను లేహ్‌ను కలిపే జాతీయ రహదారిపై సరఫరాలను నిలిపివేయడం.
* సరఫరాల దిగ్బంధనం, భారతీయ సైన్యం ప్రతీకార చర్యను ఆలస్యం చేస్తుందని భావించి ఈ  ప్రణాళిక చేశారు.
* తమ సైన్యాన్ని తమ స్థావరం నుండి వెనక్కి నెట్టగల సామర్థ్యం భారత్‌కు లేదని పాకిస్తాన్ ఖచ్చితంగా భావించింది.
* ఇవి కాకుండా, జమ్మూ లోయపై ఆధిపత్యం కూడా వారి ఉద్దేశాలలో ఉన్నటు తెలుస్తున్నది.
*, భారత్‌కు వ్యతిరేకంగా జిహాద్ కోసం 20,000-30,000 మంది యువకులను పంపాలని అప్పటి ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ అధిపతి ముల్లా రబ్బానీని పాకిస్తాన్ అభ్యర్థించింది. స్పష్టంగా, రబ్బానీ దాదాపు 50,000 మందిని పంపిస్తానని  వాగ్దానం చేశాడు. 
ఈ ఎత్తుగడలతో కార్గిల్‌ను స్వాధీనం చేసుకోవాలని ముషారఫ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.  1965 యుద్ధానికి ముందు పాకిస్తాన్ సైన్యం కార్గిల్ శిఖరాలపై ఉండేది. భద్రత, వ్యూహాత్మక కోణం నుండి ఈ ప్రాంతం చాలా ముఖ్యమైనది. 1965, 1971 యుద్ధాల తరువాత, ఈ శిఖరాలపై భారతదేశం నియంత్రణ నెలకొనడంతో, వీటిని తిరిగి పొందాలని ముషారఫ్ కోరుకున్నారు.