ఏపీలో మహిళా సాధికారతపై ప్రధాని ప్రత్యేక దృష్టి

ఆంధ్రప్రదేశ్‌లో మహిళా స్వయం సహాయక బృందాల ద్వారా మహిళా సాధికారతపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక దృష్టి సారించారని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో పట్టణ, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక బృందాల గురించి ఎంపీ జీవీఎల్ నరసింహారావు పలు ప్రశ్నలు అడిగారు. 
 
దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన జాతీయ పట్టణ మిషన్ పథకం కింద ఏర్పడిన మహిళ స్వయం సహాయక బృందాల సంఖ్య, రాష్ట్రంలో పట్టణాల వారీగా ఈ పథకం కింద అందిన బ్యాంకు లోన్ల వివరాలు, గత మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయదలచిన స్వయం సహాయక బృందాల సంఖ్య, చేరుకున్న లక్ష్యాలు, ప్రభుత్వం నుంచి వారికందిన సహాయం, విశాఖపట్నం నగరంలో ఉన్న స్వయం సహాయక బృందాల సంఖ్య, వారికిచ్చిన లోన్లు, వాటి వడ్డీ, సబ్సిడీ వివరాలు అందజేయాల్సిందిగా కోరారు. 
 
ఆయన ప్రశ్నలకు సోమవారం కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి సమాధానమిస్తూ 2021-22 వరకు 4,875 స్వయం సహాయక బృందాలను ఏర్పరచాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాగా ఇప్పటివరకు 5,149 గ్రూపులను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. పీఎంఎఫ్‌ఎంఈ పథకం కింద ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ స్వయం సహాయక బృందాలకు ఆయా ప్రాంతాల్లో ప్రాథమిక రుణ సదుపాయాన్ని అందజేస్తోందని తెలిపారు.
 
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 80,371 మహిళా స్వయం సహాయక బృందాలున్నాయని, రూ. 19,116 కోట్ల వరకు రుణాలు అందించామని చెప్పారు. వడ్డీపై రూ 32 కోట్ల వరకు సబ్సిడీ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన జాతీయ పట్టణ మిషన్ పథకం కింద విశాఖపట్నంలో ఇప్పటివరకు 17,549 స్వయం సహాయక మహిళా బృందాలను ఏర్పాటు చేసి రూ. 1556.52 కోట్లను లోన్లుగా అందించినట్టు తెలిపారు. 
 
వడ్డీ సబ్సిడీ కింద కోటి 24 లక్షల రూపాయలు వరకు ఇచ్చామని కేంద్ర మంత్రి వివరించారు. విశాఖ నగరం, ముఖ్యంగా మహిళా సాధికారతపై నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారనడానికి కేంద్ర మంత్రి ఇచ్చిన వివరాలే నిదర్శనమని ఎంపీ జీవీఎల్ హర్షం వ్యక్తం చేశారు. విశాఖ నగరంలో వీలైనన్ని మహిళా స్వయం సహాయక బృందాల ఏర్పాటు ద్వారా దరిద్ర రేఖకు దిగువన ఉన్న వారు ఆర్థికంగా బలపడడానికి తోడ్పాటు అందిస్తామని చెప్పారు.