‘ప్రజా రాష్ట్రపతి’గా ఆదివాసీ బిడ్డనే ఎన్నుకోండి

జగత్‌ ప్రకాశ్‌ నడ్డా, 
బీజేపీ జాతీయ అధ్యక్షుడు
ఇంకొన్ని రోజుల్లో దేశానికి కొత్త రాష్ట్రపతి రానున్నారు. ఈ అత్యున్నత పీఠం అధిరోహించేందుకు ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని జాతి మొత్తం సమర్థించడం అందరం చూస్తున్నాం. మరో ఏడాదిలో ‘ఆజాదీ కా అమృత్‌’ మహోత్సవం జరుపుకొంటున్న తరుణంలో స్వయంకృషితో పైకి వచ్చిన గిరిజన మహిళ సమున్నత పదవిని అధిష్ఠించబోతుండడం మనందరికీ గర్వకారణం. 
 
స్వాతంత్ర్యానంతరం జన్మించిన ఓ మహిళ తదుపరి రాష్ట్రపతి కానుండడం మహిళా సాధికారతేనని భారతీయ వనితలంతా భావిస్తున్నారు. పలు ఇతర కారణాల వల్ల కూడా ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వం ప్రత్యేకమైనది. దశాబ్దాలుగా వంశపారంపర్య రాజకీయా లు, వ్యక్తిగత ధనార్జనే ప్రబలంగా మారిన రాజకీయ వ్యవస్థలో ఓ కీలకమైన పరిణామం.

అట్టడుగు నుంచి పైపైకి..

ఒడిసాలోని రాయ్‌రంగాపూర్‌లో ఉపాధ్యాయరాలిగా ముర్ము కెరీర్‌ ప్రారంభించారు. అనంతరం నీటిపారుదల శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా చేరారు. తన వృత్తిపరమైన బాధ్యతల ను శ్రద్ధాసక్తులతో నిర్వర్తించినా ప్రజాసేవపైనే ఆమెకు మక్కువ ఎక్కువ. 1997లో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి రాయ్‌రంగాపూర్‌ నగర పంచాయతీ కౌన్సిలర్‌ అయ్యారు. 
 
మూడేళ్ల తర్వాత రాయ్‌రంగాపూర్‌ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ నియోజకవర్గం నుంచి రెండు సార్లు గెలిచారు. 2007లో ఒడిసా అసెంబ్లీలో ఉత్తమ శాసనసభ్యురాలిగా నీలకంఠ్‌ అవార్డు అందుకున్నారు. ఆ రాష్ట్ర మంత్రివర్గంలో వాణిజ్యం, రవాణా, మత్స్య, పశుసంవర్ధక శాఖ వంటి కీలక శాఖలు నిర్వహించారు. 
 
అభివృద్ధే పరమావధిగా, అవినీతి రహితంగా పనిచేశారు. 2015లో జార్ఖండ్‌ తొలి మహిళా గవర్నర్‌గా నియమితులయ్యారు. గవర్నర్‌ అయిన తొలి ఒడిసా మహిళ, ఆదివాసీ బిడ్డ కూడా ఆమే. జార్ఖండ్‌ చరిత్రలో ఆరేళ్లు ఆ పదవిలో కొనసాగినవారే లేరు. ప్రజా ఆకాంక్షల కు కేంద్ర బిందువుగా రాజ్‌భవన్‌ను తీర్చిదిద్దారు. 

విషాదాలు దిగమింగుకుని..

ద్రౌపది రాజకీయ విజయపథంలో వ్యక్తిగతంగా పూడ్చలేని కొన్ని విషాదాలు కూడా ఎదురయ్యాయి. తన భర్తను, పిల్లలను కోల్పోయారు. ఈ ఎదురుదెబ్బలు మరింత కష్టపడడానికి, ఇతరుల దుఃఖాలను పారదోలడానికి ఆమెకు దోహదపడ్డాయి. రాష్ట్రపతి పదవికి ఆమె అభ్యర్థిత్వం నవభారత స్ఫూర్తిని సంక్షిప్తంగా తెలియజేస్తోంది. 
 
ప్రజాస్వామ్య దేశాలను ప్రభుత్వాలు, ఆయా వ్యవస్థలు మాత్రమే రూపుదిద్దవు. ప్రజలు కూడా వాటి రూపశిల్పులే. గత ఎనిమిదేళ్లుగా నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వ ప్రధాన లక్షణం కూడా ఇదే. దశాబ్దాలుగా అధికారాన్ని చేతుల్లో పెట్టుకున్న కొందరి ఏకస్వామ్యాన్ని బద్దలు కొట్టి అట్టడుగు స్థాయిలో ప్రజల సాధికారతకు ఎంతగానో కృషి చేస్తోంది.
 
మోదీ కేబినెట్‌లో 60% బలహీన వర్గాలే
బీజేపీలోని మా అగ్ర నాయకత్వంలో,  అంటే ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల్లో అత్యధికులు అణకువ కలిగిన నేపథ్యం ఉన్నవారే. రాజకీయాల్లో బాగా శ్రమించి పైకి వచ్చారు. నిజానికి మోదీ మంత్రివర్గంలో 27% మంది ఓబీసీలు, 12 మంది ఎస్సీలు, 8 మంది ఎస్టీలు ఉన్నారు. ఈ వర్గాలకు 60%కు పైగా ప్రాతినిధ్యం ఉండడం చరిత్రాత్మకం.
 
 2019 ఎన్నికల్లో మహిళలు అత్యధిక సంఖ్యలో లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని బీజేపీ బలోపేతం చేసింది. ఇదే సమయంలో ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించాలన్న కలను సాకారం చేసింది. అగ్రవర్ణ పేదలకు (ఈడబ్ల్యూఎస్‌) రిజర్వేషన్‌ కల్పించింది. 
 
సామాజిక, ఆర్థిక సవాళ్లను అధిగమించి అట్టడుగు వర్గానికి చెందిన వ్యక్తి భారత ప్రధాని కాగలరని మోదీ విజయం నిరూపిస్తోంది. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌, మహాత్మాగాంధీ, దీనదయాళ్‌ ఉపాధ్యాయ్‌ల విజన్‌కు న్యాయం చేస్తోంది. రాజకీయాధికారాన్ని వ్యక్తిగత లబ్ధికి సాధనంగా బీజేపీ చూడదు.  సమాజ అభ్యున్నతి, పరివర్తన కోసమే రాజకీయాధికారమని భావిస్తుంది. 
 
పేద, బలహీన, అట్టడుగు వర్గాల ఆత్మవిశ్వాసం పెంచేందుకు.. గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల పట్ల గౌరవసూచికంగా నవంబరు 15వ తేదీని జనజాతీయ గౌరవ్‌ దివ్‌సగా ప్రకటించడం, దేశవ్యాప్తంగా గిరిజన యోధుల మ్యూజియంల ఏర్పాటు, సంచార, అర్ధసంచార, డీనోటిఫైడ్‌ గిరిజన తెగల సాధికారత, కనీస మద్దతు ధర పరిధిలోకి వచ్చే గిరిజన ఉత్పత్తుల సంఖ్య పెంపు తదితర నిర్ణయాలు తీసుకున్నాం.
 
 ద్రౌపది ముర్ము విజయం తథ్యం. తొలి గిరిజన రాష్ట్రపతిగా, తొలి మహిళా గిరిజన రాష్ట్రపతిగా, ఒడిసా నుంచి ఈ పదవికి ఎన్నికైన తొలి వ్యక్తిగా ఆమె అనేక అడ్డుగోడలు బద్దలు కొట్టనున్నారు. రాష్ట్రపతి పదవికి ఎన్డీయే గతంలో ప్రతిపాదించిన అభ్యర్థులు డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం, రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ దేశానికి స్ఫూర్తిదాయక, పరిపక్వ నాయకత్వాన్ని అందించారు. 
 
ద్రౌపది అభ్యర్థిత్వం గళం లేనివారికి గొంతుక ఇస్తుందని, చరిత్రను తిరగరాస్తుందన్న ఆశ కల్పిస్తోంది. బీజేపీ అధ్యక్షుడిగా ప్రతి రాజకీయ పార్టీకి, నేతకు, ఎలక్టొరల్‌ కాలేజీలోని ప్రతి ఓటరుకు, ప్రతి భారతీయుడికీ నా సవినయ అభ్యర్థన.. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ఆత్మసాక్షి పిలుపునకు స్పందించి.
 
ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వానికి మద్దతివ్వండి. సామాజిక న్యాయం, సామాజిక పరివర్తన కోసం మన అన్వేషణలో ఇది గొప్ప క్షణం. ఏ పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఎందుకంటే ఇది ప్రజా రాష్ట్రపతి కోసం జరుగుతున్న ఎన్నిక.
 
(ఆంధ్రజ్యోతి నుండి)