తదుపరి బ్రిటిష్ ప్రధానిగా రిషి సునాక్ వైపే మొగ్గు!

భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్‌కు సముచిత ప్రధాని అయ్యే అర్హతలు సంతరించుకుని ఉన్నారని బ్రిటన్‌లో అత్యధికులు స్పష్టం చేస్తున్నారు. బోరిస్ జాన్సన్ రాజీనామా తరువాత అధికార కన్సర్వేటివ్ పార్టీ నాయకుడి ఎన్నిక దేశ తదుపరి ప్రధానిని నిర్ణయించడంలో కీలక అవుతుంది. 

ఈ క్రమంలో జరుగుతోన్న పోటీలో రెండోరౌండ్‌లోనూ మాజీ ఆర్థిక మంత్రి అయిన సునాక్ ఆధిక్యత దక్కించుకున్నారు. తదుపరి ప్రధాని ఎవరైతే బాగుంటుందనే విషయంపై జరిగిన ఒపినియన్ పోల్ వివరాలను ది సండే టెలిగ్రాఫ్ ప్రచురించింది. 2019 సార్వత్రిక ఎన్నికలలో టోరీలకు మద్దతు పలికిన వారిని ఎంచుకుని శాంపుల్‌గా జెఎల్‌పార్టనర్స్ పోల్‌ను నిర్వహించారు. 

48 శాతం మంది సునాక్ తదుపరి ప్రధాని కావాలనుకుంటున్నారు. ఇక 39 శాతం మంది విదేశాంగ మంత్రి లిజ్ ట్రుస్‌ను ఇష్టపడ్డారు. వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డంట్ వైపు 33 శాతం మంది మొగ్గు చూపారు. రిషికి గట్టి పోటీగా భావిస్తున్న వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డంట్‌ 33 శాతంతో మూడో స్థానంలో ఉండటం విశేషం! జాన్సన్ తరువాతి ప్రధాని ఎవరైనా పన్నుల తగ్గింపు సమర్థత సంతరించుకుని ఉండాలని అత్యధికులు ఆశిస్తున్నారు.

ఇప్పుడు నిర్వహించిన ఒపినియన్ పోల్‌లో కూడా ఇదే కీలకం అయింది. సునాక్‌కు విషయ పరిజ్ఞానం ఉంది. పలు విషయాలపై తగు విధంగా స్పందిస్తారు. ఇదే విధంగా అందరి అభిప్రాయాలను తీసుకుంటారని, కలగొలుపు మనిషి అని చాలా మంది మద్దతు వ్యక్తం చేశారు.

తన పట్ల ఆదరణ చూపిస్తున్న మద్దతుదారులకు రిషి సునాక్‌ కృతజ్ఞతలు తెలియచేశారు. ”ఈ దేశానికి సేవ చేయడం కోసం అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా వున్నాను. మనందరం కలిసి విశ్వాసాన్ని పునరుద్ధరించాల్సి వుంది. మన ఆర్థిక వ్యసవ్థను పునర్నిర్మించాల్సి వుంది. ఈ దేశాన్ని ఏకతాటిపై నిలపాల్సి వుంది.” అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

తాను అధికారం చేపడితే, అధిక ద్రవ్యోల్బణాన్ని కట్టడిచేయడానికే అధిక ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ఈ నెల 21కల్లా బరిలో ఇద్దరు మిగలాల్సివుంది. ఆ తర్వాత విస్తృత పోలింగ్‌లో ఆ ఇద్దరిలో ఒకరిని కన్జర్వేటివ్‌నేతగా ఎన్నుకుంటారు. సెప్టెంబరు 5న ఫలితాలు ప్రకటిస్తారు.

సునాక్ కు అడ్డుతగిలే యత్నంలో బోరిస్ జాన్సన్ 

ఓ వైపు పలు రౌండ్లలో రిషి సునాక్ కన్సర్వేటివ్ పార్టీ నేతకు జరిగే ఎన్నికలలో దూసుకుపోతూ ఉండగా మరో వైపు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ మాత్రం ఆయనను ప్రధాని కాకుండా ఎలాగైనా అడ్డుకోవాలని పట్టుదలగా ఉన్నల్టు కనిపిస్తున్నారు. తన మద్దతుదార్లను రంగంలోకి దించి, ఎంపిలు ఇతరులెవ్వరినైనా ఎంచుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ సునాక్‌ను గెలిపించరాదని, ఇందుకు తగు బలం ఏదో విధంగా సంతరించుకోవాలని జాన్సన్ తరఫున కొందరు లాబీయింగ్‌కు దిగుతున్నట్లు వెల్లడైంది.

దేశంలో వెలుగుచూసిన కుంభకోణాలతో సుమారు 60 మంది కన్జర్వేటివ్‌ ఎంపిలు తమ పదవుల నుండి తప్పుకోగా.. బోరిస్‌ జాన్సన్‌ పదవి వీడక తప్పలేదు. అయితే దీనికి రిషి సునక్‌ కారణమని బోరిస్‌ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.సునాక్ మొదటిగా మంత్రివర్గం నుండి రాజీనామా చేసి,  తిరుగుబాటు చేయడంతోనే తన ప్రభుత్వం కూలిపోయినదని ఆయన ఆగ్రహంగా ఉన్నట్లు స్పష్టం అవుతున్నది.
 
 అందుకే ఆయన ఓటమి పాలు చేయాలని సొంత పార్టీ నేతలకు ఈ విధంగా చెబుతున్నారని స్థానిక మీడియా పేర్కొంటోంది. రిషిని బలపర్చవద్దని ప్రధాని పదవికి పోటీ పడి ఓడిపోయిన  నేతల మద్దతుదారులకు చెబుతున్నారని వార్తలు వస్తున్నాయి.  తాను ఏ నాయకత్వ అభ్యర్థులను ఆమోదించనని, పోటీలో జోక్యం చేసుకోనన్న బహిరంగంగా బోరిస్‌ చెప్పినప్పటికీ.. సునక్‌ ప్రధాని కాకుండా.. ఈ పదవి కోసం పోటీ పడి ఓడిపోయిన నేతలతో సంభాషించారని తెలుస్తోంది.
విదేశాంగమంత్రి లిజ్‌ ట్రస్‌ లేదంటే జాకబ్‌ రీస్‌, డోరిస్‌, పెన్నీ మోర్డాంట్‌లలో ఎవరో ఒకరికి మద్దతివ్వాలని ఆయన సూచించినట్టు తెలిపింది. బోరిస్‌ జాన్సన్‌ పదవి నుండి తప్పించేందుకు రిషి సునక్‌ కొన్ని నెలలుగా ప్రయత్నాలు చేశారని, తనను మోసం చేసి.. తన ఎంపిలను దూరం చేశారన్న ఉద్దేశంతో బోరిస్‌ ఉన్నట్లు మీడియా చెబతుతోంది.