కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ మరో విశిష్ట మైలురాయికి చేరువైంది. ప్రక్రియ మొదలైన 18 నెలలకు 200 కోట్ల కరోనా డోసుల మార్క్‌ను చేరింది. శనివారం రాత్రి వరకు 199.97 కోట్ల వ్యాక్సిన్ డోసులు పూర్తయ్యాయని ‘కొవిన్’ పోర్టల్ డేటా పేర్కొంది.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. భారత్ మళ్లీ చరిత్ర సృష్టించింది. 200 కోట్ల వ్యాక్సిన్ డోసులను దాటినందుకు భారతీయులందరికీ అభినందనలు. అసమానంగా కృషిచేసి ఈ రికార్డును అందుకోవడం గర్వకారణం. ఇది కోవిడ్‌కు వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేస్తుందని ట్విట్టర్ వేదికగా తెలిపారు.
మొత్తం డోసుల్లో ప్రికాషన్ టీకాల సంఖ్య 5.48 కోట్లుగా ఉందని గణాంకాలు స్పష్టం చేశాయి. 16 జనవరి 2021న భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. 100 కోట్ల డోసుల మైలురాయిని చేరువవ్వడానికి 277 రోజుల సమయం పట్టింది. గత ఏడాది సెప్టెంబర్ 17న దేశవ్యాప్తంగా ఒకే రోజు 2.5 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు. ఒక రోజు టీకాల్లో ఇప్పటివరకు ఇదే అత్యధికంగా ఉంది.
కొవిన్ పోర్టల్ సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం 14 వేల ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దేశ జనాభాలో 96 శాతం మంది కొవిడ్ కరోనా మొదటి డోస్( తీసుకున్నారు. రెండు డోసులూ తీసుకున్నవారి సంఖ్య జనాభాలో 87 శాతంగా ఉంది. కాగా అంతర్జాతీయంగా చూస్తే ప్రపంచ జనాభాలో సంపూర్ణ వ్యాక్సినేషన్ పొందినవారి సంఖ్య 62.1 శాతంగా ఉంది.
భారత్‌తో పోల్చితే చాలా తక్కువగా ఉంది. కాగా 18 ఏళ్లు పైబడిన వారికి 75 రోజుల పాటు ప్రికాసన్ డోసు ప్రక్రియ కొనసాగుతుందని గతవారమే కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. 18-59 ఏళ్ల వయసున్న 77.10 కోట్ల జనాభాకు ప్రికాసన్ డోసు వేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటివరకు కేవలం 1 శాతం లోపు మందికే ప్రికాసన్ డోసు పూర్తయింది.
మరోవైపు రెండు డోసుల మధ్య కాలవ్యవధిని కూడా కేంద్రం తగ్గించింది. 9 నెలల నుంచి 6 నెలలకు కుదించింది. కేంద్ర వైద్యశాఖ రిపోర్ట్ ప్రకారం.. భారత్‌లో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 143,449గా ఉన్నాయి.
More Stories
బస్తర్ ప్రాంతంలో 12 మంది నక్సల్స్ హతం!
ఓఎంఆర్ పద్ధతిలో నీట్ యూజీ 2025 పరీక్ష
శ్రీహరికోటలో మూడవ లాంచ్‌ప్యాడ్