
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు లోక్‌సభ స్పీకర్ ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి మెజార్టీ రాజకీయ పక్షాలు దూరంగా ఉన్నాయి. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు సాంప్రదాయంగా లోక్‌సభ స్పీకర్ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తారు.
అందులో భాగంగానే శనివారం పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
సభను సజావుగా నిర్వహించాలని రాజకీయ పార్టీల నేతలకు విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలు, సభ్యులు సహకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సమావేశానికి ఎక్కువ పార్టీలు గైర్హాజరయ్యాయి. అధికార ఎన్‌డిఎ తరపున బిజెపి, అప్నాదళ్, ఎల్‌జెఎస్‌పి హాజరుకాగా, ప్రతిపక్షాల నుంచి కాంగ్రెస్, డిఎంకె, వైసిపి హాజరయ్యాయి. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై చర్చలు జరపాలని పార్టీ నేతలందరికీ విజ్ఞప్తి చేసినట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.
ఈ పార్లమెంట్ సమావేశాలు 18 సిట్టింగ్‌లు జరుగుతాయని, మొత్తం 108 గంటలు సమయం అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఇప్పటి వరకు జీరో అవర్ కోసం ఉదయం 9 గంటల లోపు నోటీసులు ఇచ్చేవారని, ఇప్పుడు ఉదయం 8 గంటల లోపే నోటీసులు ఇవ్వాలని పేర్కొన్నారు.
ప్రభుత్వ వ్యవహారాలతో పాటు, తక్షణ ప్రజా ప్రాముఖ్యత కలిగిన విషయాలపై చర్చకు అవసరమైనంత సమయం కేటాయించబడుతుందని హామీ ఇచ్చారు. కరోనా ప్రోటోకాల్‌ను అనుసరిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి, డిఎంకె పక్షనేత టిఆర్ బాలు, వైసిపి పక్షనేత మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాగా, ప్రజా సమస్యలపై పార్లమెంట్‌లో చర్చించాలని కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి కోరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ద్రవ్యోల్బణం, అగ్నిపథ్ పథకం, రూపాయి విలువ పతనం, నిరుద్యోగం, రైతుల సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేసినట్లు చెప్పారు.
కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 12 వరకు జరిగే ఈ సమావేశాల్లో అటవీ చట్టంలో మార్పులతో సహా 29 బిల్లులను ప్రభుత్వం సిద్ధం చేసింది. వీటిలో ఐదు బిల్లులను ప్రభుత్వం గత సమావేశాల్లోనే ప్రవేశపెట్టింది. వాటిలో నాలుగు బిల్లులు పార్లమెంటరీ స్థాయీ సంఘం పరిశీలనలో ఉన్నాయి.
More Stories
శబరిమల సన్నిధానం చుట్టూ ఉన్న ఫ్లైఓవర్ తొలగింపు
రెండు రోజుల్లో భూమిపైనే అత్యంత తెలివైన ఎఐ గ్రోక్ 3
న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాటలో 18 మంది మృతి