అత్యుత్తమ సంస్థలుగా నాలుగోసారి ఐఐటీ మద్రాస్, ఐఐఎస్సీ బెంగళూరు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-మద్రాస్ వరుసగా నాలుగో సంవత్సరం ‘ఓవరాల్’ ర్యాకింగ్‌లో టాపర్‌గా నిలిచింది. కేంద్ర విద్యాశాఖ పరిధిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) నిర్వహించిన ర్యాంకింగ్ పోటీలో దేశవ్యాప్తంగా 7,254 ఉన్నత విద్యాసంస్థలు పాల్గొన్నాయి.
విద్యాబోధన, వనరులు, పరిశోధన సహా ఇంకా అనేక ఇతరాంశాలను ప్రామాణికంగా తీసుకుని ర్యాంకులను నిర్థరించింది. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, లా, మెడికల్, డెంటల్, రీసెర్చ్, టాప్-3 కాలేజీలు, ఓవరాల్ వంటి కేటగిరీల్లో ర్యాంకులను రూపొందించగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విడుదల చేశారు. ఆయా విభాగాల్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన విద్యాసంస్థలకు అవార్డులు ప్రదానం చేశారు.
గత మూడేళ్లుగా ఇంజనీరింగ్ కేటగిరీతో పాటు ఓవరాల్ ర్యాంకింగ్‌లోనూ మొదటిస్థానంలో నిలుస్తున్న ఐఐటీ మద్రాస్ ఈ ఏడాది కూడా మొదటిస్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. ఓవరాల్ కేటగిరీలో రెండో స్థానంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) బెంగళూరు, మూడో స్థానంలో ఐఐటీ బాంబే నిలిచాయి.
ఓవరాల్ కేటగిరీలో మొదటి 10 స్థానాల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క సంస్థ కూడా నిలవలేదు. అయితే ఐఐటీ హైదరాబాద్ 14వ స్థానంలో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 20వ స్థానంలో నిలవగా, ఎన్ఐటీ వరంగల్ 45వ స్థానంలో, ఉస్మానియా యూనివర్సిటీ 46వ స్థానంలో నిలిచాయి. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ 71వ స్థానంలో నిలిచింది.
యూనివర్సిటీ కేటగిరిలో మొదటి స్థానంలో ఐఐఎస్‌సి బెంగళూరు, రెండో స్థానంలో జెఎన్‌యు న్యూఢిల్లీ, మూడో స్థానంలో జామియా మిల్లియా ఇస్లామియా న్యూఢిల్లీ నిలిచాయి.  యూనివర్శిటి ఆఫ్ హైదరాబాద్ 10 వ స్థానంలో నిలిచింది. ఉస్మానియా యూనివర్శిటీకి 22వ స్థానం దక్కింది.
 ఇంజనీరింగ్ కేటగిరిలో మొదటి స్థానంలో ఐఐటి మద్రాస్, రెండో స్థానంలో ఐఐటి ఢిల్లీ, మూడో స్థానంలో ఐఐటి బాంబే, 9వ స్థానంలో ఐఐటి హైదరాబాద్‌లు నిలిచాయి. మేనేజ్‌మెంట్ విభాగంలో మొదటి స్థానంలో ఐఐఎం అహ్మదాబాద్, రెండో స్థానంలో ఐఐఎం బెంగళూరు, మూడో స్థానంలో ఐఐఎం కోల్‌కత్తా ఉన్నాయి.
ఫార్మసి కేటగిరిలో మొదటి స్థానంలో జామియా న్యూఢిల్లీ నిలువగా రెండో స్థానంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎద్యుకేషన్ హైదరాబాద్, మూడో స్థానంలో పంజాబ్ యూనివర్సిటీ చండీగఢ్ నిలిచాయి. ఆర్కిటెక్చర్ విభాగంలో మొదటి స్థానంలో ఐఐటి రూర్కి, రెండో స్థానంలో ఎన్‌ఐటి కాలికట్, మూడో స్థానంలో ఐఐటి ఖరగ్‌పూర్ నిలిచాయి.
న్యాయ విద్యా విభాగంలో మొదటి స్థానంలో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా, బెంగళూరు, రెండో స్థానంలో నేషనల్ లా యూనివర్సిటీ న్యూ ఢిల్లీ, మూడో స్థానంలో సింబియాసిస్ లా స్కూల్ పూణే నాల్గవ స్థానంలో నల్సార్ యూనివర్సిటీ నిలిచాయి.
మెడికల్ కేటగిరి విషయానికి వస్తే ఎయిమ్స్ న్యూ ఢిల్లీకి మొదటి స్థానం దక్కగా పిజిఐఎంఐ చంఢీగఢ్‌కు రెండో స్థానం, క్రిస్టియన్ మెడికల్ కాలేజీ వేలూర్ (తమిళనాడుకు)కు మూడో స్థానం దక్కింది. డెంటల్ కేటగిరిలో మొదటి స్థానంలో సవితా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ సైన్సెస్ చెన్నై, రెండో స్థానంలో మణిపాల్ కాలేజీ ఆప్ డెంటల్ సైన్సెస్ మణిపాల్, మూడో స్థానంలో డా.డీవైపాటిల్ విద్యాపీఠ్ పూణె నిలిచాయి.
రిసెర్చ్ క్యాటగిరిలో మొదటి స్థానంలో ఐఐఎస్‌సి బెంగళూరు, రెండో స్థానంలో ఐఐటి మద్రాస్, మూడో స్థానంలో ఐఐటి ఢిల్లీ నిలువగా ఐఐటి హైదరాబాద్‌కు 12వ స్థానం దక్కింది. మొత్తం ఐదు విభాగాల్లో ఆయా విద్యా సంస్థలు సాధించిన ప్రగతి ఆధారంగా ఎంహెచ్‌ఆర్‌డి కోర్ కమిటి అధ్యయనం చేసింది.