తెలంగాణలో గిరిజన వర్సిటీకై పార్లమెంట్ లో బిల్ 

తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ఈ వర్సిటీ ఏర్పాటు బిల్లును ప్రవేశపెట్టనుంది. 

 
ఈ మేరకు కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, 2022ను కేంద్ర విద్యా శాఖ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు లోక్‌సభ, రాజ్యసభ సచివాలయాలకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సమాచారమిచ్చింది. ఈ మేరకు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే, ఆమోదించబోయే బిల్లుల జాబితాలో ఈ బిల్లును చేర్చుతూ ఉభయసభల సచివాలయాలు బులెటిన్‌ విడుదల చేశాయి. 
 
ఈ సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది. కాగా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గిరిజన విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్ల క్రితమే వర్సిటీ ఏర్పాటు కాగా, తెలంగాణ ప్రభుత్వం భూకేటాయింపులో జాప్యం చేయడం వల్ల వర్సిటీ ఏర్పాటు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంది. 
 
కాగా ములుగు జిల్లా జాకారంలో గిరిజన వర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించగా కేంద్ర ప్రభుత్వం దాన్ని ఖరారు చేసింది. ఆగస్టు 12 వరకు కొనసాగనున్న ఈ సమావేశాల్లో మొత్తం 24 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే మరో 8 బిల్లులు ఉభయ సభల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.
 
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా ఈ సమావేశాల్లోనే నిర్వహించనున్నారు.  సమావేశాల తొలిరోజే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. అలాగే, ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు నిర్వహిస్తారు.
 
పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించింది. 45 రాజకీయ పార్టీలను ఆహ్వానించగా, 36 పార్టీల ప్రతినిధులు మాత్రమే హాజరయ్యారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. ఉభయ సభల్లో 32 బిల్లులు ప్రవేశపెట్టేందుకు వివిధ విభాగాలు సూచించాయని, వాటిలో 14 బిల్లులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.