చత్తీస్‌గఢ్‌ లో కీలక మంత్రి కీలక శాఖకు సింగ్‌దేవ్‌ రాజీనామా

చత్తీస్‌గఢ్‌ లోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ముసలం మొదలైంది. ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌, మంత్రి టిఎస్‌ సింగ్‌దేవ్‌ల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. దీంతో పంచాయతీ, గ్రామీణాభివఅద్ధి శాఖల మంత్రి పదవి నుండి సింగ్‌దేవ్‌ శనివారం రాజీనామా చేశారు. ఇతర శాఖలైన వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య, జిఎస్‌టి మంత్రిగా మాత్రం ఆయన కొనసాగుతారు. 
 
పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖల నుండి తప్పుకుంటూ నాలుగు పేజీల రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపించారు. ప్రధానమంత్రి గృహ నిర్మాణ పథకం కింద ఒక్క ఇళ్లు కూడా పేదలకు నిర్మించింది లేదని, ముఖ్యమంత్రితో మొరపెట్టుకుంటున్నా నిధులు కేటాయించలేదని ఆయన ఆరోపించారు. 
 
దీంతో 8 లక్షల మందికి చేపట్టాల్సిన ఇళ్ల నిర్మాణం ముందుకు సాగడం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేదలకు ఇళ్ల నిర్మాణం అనేది కీలక హామీ అని ఆయన గుర్తు చేశారు. వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలుండగా ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. 
 
అయితే వీరిద్దరి మధ్య గతంలో కూడా విభేదాలు నెలకొన్నాయి. గత ఏడాది భూపేష్‌ బఘేేల్‌పై తిరుగుబాటు చేస్తూ ముఖ్యమంత్రిగా ఆయన రెండున్నరేళ్ల పదవీకాలం ముగిసిందని, తాను సిఎం పదవిని చేపట్టాలని పట్టుబట్టారు. దీనిపై అధిష్టానం పిలిచి సింగ్‌కు నచ్చజెప్పింది. 
 
కాగా, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై బిజెపి విమర్శలు సంధించింది. కాంగ్రెస్‌కు చత్తీస్‌గఢ్‌ మరో పంజాబ్‌లా మారనుందని ఎద్దేవా చేసింది. వచ్చే ఏడాది ఎన్నికల ముందు సీనియర్‌ నేత టిఎస్‌ సింగ్‌ డియో ఆరోగ్య శాఖ మంత్రి మినహా అన్నింటికి రాజీనామా చేశారని పేర్కొన్నారు. భూపేష్‌ భగేల్‌పై విసుగుపోయి ఇలా చేశారని తెలిపారు.