విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్‌ ఆల్వా

మాజీ కేంద్ర మంత్రి,  మాజీ గవర్నర్ మార్గరెట్ ఆల్వాను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా విపక్ష పార్టీలు నిర్ణయించాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)  అధినేత శరద్ పవార్ నివాసంలో ఆదివారం సమావేశమైన విపక్ష పార్టీల నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సి వ్యూహంపై కూడా ఈ సమావేశంలో విపక్ష పార్టీల నేతలు చర్చించినట్టు తెలుస్తోంది.
 కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే, సీపీఎం నేత సీతారా ఏచూరి, శివసేన నేత సంజయ్ రౌత్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరును ముందుగానే ప్రకటించిన విపక్ష పార్టీలు ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో మాత్రం ఎన్డీయే ప్రకటించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నాయి.
80 ఏళ్ల మార్గరెట్ ఆల్వాకు 19 పార్టీలు మద్దతు ఇస్తుండగా, ఈనెల 19న ఆమె నామినేషన్ వేయనున్నారు. విపక్షాల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వాను ఎంపిక చేసినట్టు ప్రకటించిన శరద్ పవార్ తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా తమ నిర్ణయానికి మద్దతు పలికినట్టు చెప్పారు.
ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్‌ పేరును ఎన్డీయే ప్రకటించిన మరుసటి రోజు ఈ నిర్ణయం ప్రకటించాయి. కాగా, ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్లు వేసే గడువు ఈనెల 19వ తేదీతో ముగుస్తుంది.
మార్గరెట్‌ ఆల్వా 1942 ఏప్రిల్ 14న కర్నాటకలోని మంగళూరులో రోమన్‌ కాథలిక్‌ కుటుంబంలో జన్మించారు. 1969లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆమె 1975, 1977 మధ్య అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సంయుక్త కార్యదర్శిగా 1978 , 1980 మధ్య కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు.

అనంతరం, 1999లో ఉత్తర కన్నడ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమిపాలయ్యారు. ఆ సమయంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 

ఏప్రిల్ 1974లో మార్గరెట్‌ ఆల్వా కాంగ్రెస్ ప్రతినిధిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1980, 1986, 1992లో తిరిగి ఎన్నికయ్యారు.  పీవీ నరసింహారావు, ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీలు ప్రధానులుగా ఉన్న సమయంలో.. మార్గరెట్‌ కేంద్రమంత్రిగా సేవలందించారు.