ఎట్టకేలకు అధ్యక్ష పదవికి రాజపక్సే రాజీనామా 

ప్రజాందోళనలకు తలొగ్గిన శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స ఎట్టకేలకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. రాజీనామా చేయకుండా దేశం విడిచిపారిపోయిన ఆయన.. మాల్దీవులు అక్కడి నుంచి గట్టి భద్రత మధ్య గురువారం సింగపూర్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్‌జెట్‌లో సింగపూర్‌ చేరుకున్న వెంటనే స్పీకర్‌కు తన రాజీనామా లేఖను పంపించారు.

 దానితో దశాబ్దాలుగా శ్రీలంక రాజకీయాలపై కొనసాగుతున్న రాజపక్స కుటుంభం ఆధిపత్యంకు గండి పడిన్నట్లయింది.   జులై 13నే రాజీనామా చేస్తానని ప్రకటించిన రాజపక్స.. చెప్పాపెట్టకుండా మాల్దీవులకు పారిపోయాడు. దీంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.  ఈ మెయిల్ ద్వారా ఆయన తన రాజీనామాను పార్లమెంట్ స్పీకర్‌కు పంపారు. రాజపక్స రాజీనామా తమకు అందిందని శ్రీలంక స్పీకర్ కార్యాలయం స్పష్టం చేసింది.

ప్రజాగ్రహం పెబుల్లికి ప్రధాని నివాసం, ఆపై స్పీకర్‌ నివాసాలపై దాడులకు దిగారు నిరసనకారులు. ఈ క్రమంలో లంకలో అత్యవసర పరిస్థితి, కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు, మిలిటరీ పహారా నడుమ శాంతి భద్రతలను రక్షిస్తోంది అక్కడి తాత్కాలిక ప్రభుత్వం. ప్రజల నిరసనలు తారాస్థాయికి చేరిన క్రమంలో రాజీనామా ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది.
 
 సౌదీ ఎయిర్‌లైన్స్ విమానంలో ఆయన సింగపూర్‌ చేరుకున్నారు. అయితే ఆయన తమను ఆశ్రయం కోరలేదని, ప్రైవేట్ పర్యటనలో భాగంగా వచ్చారని సింగపూర్ విదేశాంగ శాఖ తొలుత వెల్లడించింది.  మొత్తం వ్యవహారంలో మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. 
 
అధ్యక్షుని రాజీనామాతో శ్రీలంక ప్రజలు పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నరు. మరోవైపు, తాత్కాలిక అధ్యక్షుడు  రణిల్ విక్రమసింఘే ఆదేశాలతో ఆర్మీ రంగంలోకి దిగింది. యుద్ధ ట్యాంకులతో కొలంబో వీధుల్లో మార్చ్ చేసింది. మరోసారి తీవ్ర నిరసనలు జరిగితే అడ్డుకునేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. దీంతో గురువారం కొలంబో వీధులు ప్రశాంతంగా కనిపించాయి. ‘‘నిరసనకారులు హింసకు దూరంగా ఉండాలి. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. బలవంతంగానైనా సరే నిరోధించే చట్టబద్ధమైన అధికారం భద్రతా దళాలకు ఉంది” అని ఆర్మీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. 
ఇటీవలి వరకూ రాజపక్స సోదరులు, మంత్రివర్గంలో ఉన్న వారి బంధువులు తీసుకున్న నిర్ణయాలు, బంధుప్రీతి, అవినీతికి పాల్పడటంతోపాటు ఎన్నికల్లో గెలవడానికి ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించారు.  ప్రజలను ఆకర్షించి పదవిలోకి రావడం కోసం విపరీతమైన ప్రజాకర్షక హామీలు ఇవ్వడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది.
అవసరాలు తీర్చుకోవడం కోసం కరెన్సీని 42 శాతం అధికంగా ముద్రించడం, ఫలితంగా దేశంలో ద్రవ్యోల్బణం 15 శాతానికి మించడం ఇలా ఒకదాని పర్యవసానం మరొక దానిపై తీవ్రంగా పడింది.
చైనా నుంచి దిగుమతి చేసుకునే ఎరువులు నాణ్యతగా లేకపోవడం వల్ల వేరే దేశాలనుంచి దిగుమతి చేసుకోవాలంటే సరిపడిన డాలర్లు (విదేశీ మారక ద్రవ్యం) లేకపోవడం, ఫలితంగా 100 శాతం సేంద్రీయ వ్యవసాయానికి అడుగులు వేయడం, అది సత్ఫలితాలను ఇవ్వకపోగా తీవ్ర తిండి గింజల కరువుకు దారి తీసింది.
 
చివరికి విదేశీ సంస్థలు, ప్రపంచ దేశాలకు అప్పుకట్టలేని స్థితిలో శ్రీలంక ఉంది. అప్పులు కట్టలేమని బహిరంగంగా ప్రకటించింది కూడా. ప్రస్తుతం ఆహార సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులతోపాటు, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయి. కాగితం, సిరా కొరతతో కనీసం విద్యార్థులకు పరీక్షల నిర్వహణ కూడా వాయిదా వేశారు. డీజిల్‌ విక్రయాల నిలిపివేత, రోజుకు 15 గంటల కరెంటు కోత ఇలా చాలా సమస్యలను శ్రీలంక ఎదుర్కుంటోంది.