‘ఐ2యూ2’ కూటమి సదస్సు అజెండాపై ప్రధాని హర్షం 

నాలుగు దేశాల ‘ఐ2యూ2’ కూటమి తన తొలి శిఖరాగ్ర సదస్సులోనే సానుకూల అజెండాను సిద్ధం చేసుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇంధన భద్రత, ఆహార భద్రత, ఆర్థిక ప్రగతి కోసం నాలుగు దేశాలు కలిసికట్టుగా పనిచేయబోతున్నాయని, ఈ మేరకు ఒక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించుకున్నాయని వెల్లడించారు.

ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఆచరణీయ పరస్పర సహకారానికి ఈ ఫ్రేమ్‌వర్క్‌ ఒక మంచి మోడల్‌ అని ఉద్ఘాటించారు. ఐ2యూ2(ఇండియా, ఇజ్రాయెల్, యూఎస్‌ఏ, యూఏఈ) తొలి శిఖరాగ్ర సదస్సును గురువారం వర్చువల్‌గా నిర్వహించారు.

సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి యైర్‌ లాపిడ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌–నహ్యాన్‌ పాల్గొన్నారు. సదస్సును ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ ఐ2యూ2 అజెండా, దార్శనికత ప్రగతిశీలకంగా, ఆచరణయోగ్యంగా ఉందని కొనియాడారు.

నాలుగు దేశాల పెట్టుబడి, నిపుణత, మార్కెట్లు వంటి బలాలను ఒకే వేదికపైకి తీసుకొస్తే అది ప్రపంచ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ రంగాల్లో పలు ఉమ్మడి ప్రాజెక్టులను గుర్తించామని, వాటి అమలు విషయంలో ముందుకెళ్లేందుకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించుకున్నామని తెలిపారు.

నీరు, ఇంధనం, రవాణా, అంతరిక్షం, ఆరోగ్యం, ఆహార భద్రత వంటి ఆరు కీలక రంగాల్లో ఉమ్మడి పెట్టుబడులను మరింత పెంచేందుకు అంగీకారానికొచ్చామని చెప్పారు.

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మాట్లాడుతూ “ఈ రోజు మనం ఎదుర్కొంటున్న సవాళ్లలో వాతావరణ సంక్షోభం లేదా పెరుగుతున్న ఆహార అభద్రత ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా చేసిన క్రూరమైన, రెచ్చగొట్టని దాడితో అస్థిర ఇంధన మార్కెట్లు మరింత దిగజారాయి…” అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

“ప్రస్తుతం శూన్యత ఉంది. రాబోయే 3 సంవత్సరాలలో, ఈ సమూహం పెట్టుబడి పెట్టగల,కలిసి అభివృద్ధి చేయగల కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను గుర్తించడానికి పని చేస్తుంది… మనం కలిసి ఉంటే మనం చాలా గొప్పగా చేయగలము” అని బిడెన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

వనరులను ఎలా సమీకరించాలో తెలిసిన దేశాల ద్వారానే నిజమైన పరిష్కారాలు వస్తాయని ఇజ్రాయెల్ ప్రధాని యాసిర్ లాపిడ్ చెప్పారు. మనం ప్రపంచాన్ని మంచిగా మార్చాలనుకుంటున్నామని తెలిపారు.

“ప్రైవేట్ మార్కెట్‌ను భాగస్వామిగా కలిగి ఉండటమే మన లక్ష్యం. 4 వేర్వేరు దేశాలు కావడం.. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పిల్లలకు నాణ్యమైన విద్య, పర్యావరణంపై జరిగే నష్టాన్ని తగ్గించడం వంటి అంశాలతో సహా మనందరికీ ఒకే విషయం కావాలని స్పష్టంగా తెలుసు” అని ఇజ్రాయెలీ ప్రధాని స్పష్టం చేశారు.

సదస్సు అనంతరం ఐ2యూ2 కూటమి ఒక ప్రకటన జారీ చేసింది. ‘అగ్రికల్చర్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ ఫర్‌ క్లైమేట్‌ ఇనీషియేటివ్‌’పై ఆసక్తి చూపిన భారత్‌ను అమెరికా, యూఏఈ, ఇజ్రాయెల్‌ స్వాగతించాయి.ప్రారంభ సదస్సు ఆహార భద్రత సంక్షోభం,  స్వచ్ఛమైన ఇంధనంపై దృష్టి సారించింది.

గ్లోబల్ ఫుడ్ షాక్‌లను మెరుగ్గా నిర్వహించగల దీర్ఘకాలిక, మరింత వైవిధ్యభరితమైన ఆహార ఉత్పత్తి, ఆహార పంపిణీ వ్యవస్థలను నిర్ధారించడానికి వినూత్న మార్గాలను నాయకులు చర్చించినట్లు సంయుక్త ప్రకటన తెలిపింది. ఆహార భద్రత, స్థిరమైన ఆహార వ్యవస్థలను మెరుగుపరచడానికి మరింత వినూత్నమైన, కలుపుకొని, సైన్స్ ఆధారిత పరిష్కారాలను నిర్మించడానికి బాగా స్థిరపడిన మార్కెట్‌లను ప్రభావితం చేయాలనే తమ సంకల్పాన్ని నాయకులు వ్యక్తం చేశారు.

భారత్‌లో యూఏఈ పెట్టుబడులు

కాగా, ఐ2యూ2 ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా భారత్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా సమీకృత ఫుడ్‌పార్కుల అభివృద్ధికి 2 బిలియన్‌ డాలర్లు (రూ.1.60 లక్షల కోట్లు) ఖర్చు చేస్తామని ప్రకటించింది. అలాగే గుజరాత్‌లో హైబ్రిడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటుకు ఐ2యూ2 భాగస్వామ్య దేశాలు ఆసక్తి కనబర్చాయి. ఫుడ్‌పార్కుల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను భారత ప్రభుత్వం సమకూర్చనుంది. ఈ పార్కులతో రైతులను అనుసంధానించనున్నారు.