బైడెన్ వద్దంటున్న 64 శాతం మంది డెమొక్రాట్లు

అమెరికా అధ్యక్షునిగా పదవి చేపట్టి ఒకటిన్నరేళ్ళు మాత్రమే అయినప్పటికీ జో బైడెన్ తీవ్ర వ్యక్తిరేకతను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆయన సొంత పార్టీ డెమొక్రాట్లు నుండే తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. 
 
64శాతం మంది డెమొక్రాట్లు 2024లో బైడెన్‌ వద్దనుకుంటున్నారని తాజాగా నిర్వహించిన పోల్స్‌లో వెల్లడైంది. న్యూయార్క్‌ టైమ్స్‌, సియనా కాలేజీ కలసి ఈ ఒపీనియన్‌ పోల్స్‌ నిర్వహించాయి. 2024లో అధ్యక్ష అభ్యర్ధిగా బైడెన్‌ కన్నా మరెవరినైనా పార్టీ నామినేట్‌ చేస్తే బాగుంటుందని 64 శాతం మంది డెమొక్రాట్‌ ఓటర్లు అభిప్రాయపడ్డారు.
 
30 ఏళ్ల లోపు వారిలో 94 శాతం మంది మరో నేత కోసం ఎదురుచూస్తున్నారు. మొత్తంగా బైడెన్‌ ప్రజాదరణ రేటింగ్‌ 33 శాతానికి పడిపోయింది..కేవలం 13 శాతం మంది మాత్రమే దేశం సరైన దిశలోనే పయనిస్తోందని అభిప్రాయపడుతున్నారు. ఈనాడు దేశం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సమస్య ఏమిటని ప్రశ్నించగా, 20 శాతం మంది ఓటర్లు ఆర్థిక వ్యవస్థ (ఉద్యోగాలు, స్టాక్‌ మార్కెట్‌ అన్నీ కలిపి) అని చెప్పారు. 
 
మరో 15 శాతం మంది ద్రవ్యోల్బణం, జీవన వ్యయమని చెప్పారు. దాదాపు 96 శాతం మంది ఓటర్లు ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణం రెండూ చాలా తీవ్రమై సమస్యలేనని చెప్పారు. కాగా 58 శాతం మంది ఓటర్లు ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ నిరుపేదగా వుందని అభివర్ణించారు. కేవలం 10 శాతం మంది మాత్రమే అద్భుతం లేదా బాగుంది అని వ్యాఖ్యానించారు. 
 
అదేసమయంలో, వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో మరో వ్యక్తి నామినేట్‌ కావాలని అభిప్రాయపడినవారిలో 33శాతం మంది, ప్రస్తుత అధ్యక్షుడికి 79 ఏళ్ళ వయస్సు అయినందునే కొత్త అభ్యర్ధి కావాలనుకుంటున్నామని చెప్పారు.