శ్రీలంకలో ఆగని ఆందోళనలు… ఎమర్జెన్సీ విధింపు

కట్టలు తెంచుకున్న జనాగ్రహం చూసి అధ్యక్షుడు గొటబాయ బుధవారం వేకువజామునే కుటుంబంతో సహా దేశం విడిచి పారిపోవడం గురించి తెలిసిన జనం ఉదయం నుంచే మళ్లీ రోడ్డెక్కారు. కొలంబోలోని ప్రధాని రణిల్ విక్రమ సింఘే నివాసం వైపు వేల మంది ర్యాలీగా బయల్దేరారు.

దేశంలో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్టు ప్రధాని రణిల్ విక్రమసింఘే బుధవారం ప్రకటించారు. ఆందోళనకారులను అరెస్ట్ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. తాత్కాలిక అధ్యక్షుడిగాగా బాధ్యతలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు

పార్లమెంట్ ముట్టడికి జనాలు కదిలి వస్తుండడంతో ఎమర్జెన్సీ పరిస్థితిని విధిస్తున్నట్టు రణిల్ విక్రమసింఘే పేర్కొన్నారు. కొలంబో సహా పశ్చిమ ప్రావిన్స్‌లో నిరవధిక కర్ఫ్యూ విధిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆందోళనలను అదుపులోకి తీసుకొచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.

ఆందోళనకారులు ప్రధాని నివాసం గేటు వద్దకు చేరుకున్నాక పరిస్థితిని అదుపు చేసేందుకు భద్రతా దళాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లోనే శ్రీలంక ప్రభుత్వం మళ్లీ ఎమర్జెన్సీ ప్రకటించింది.

ప్రధాని నివాసానికి పెద్ద ఎత్తున చేరుకున్న నిరసనకారులు దేశం విడిచి పారిపోయిన గొటబాయ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీలంక రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు రాజీనామా చేస్తే ప్రధాని తాత్కాలికంగా ఆ బాధ్యతలు చేపడతారు. అయితే నిరసనకారులు దీన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. ప్రధాని రణిల్ విక్రమ సింఘే తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు స్వీకరించవద్దని హెచ్చరిస్తున్నారు. ఇద్దరూ తమ పదవుల నుంచి తక్షణమే తప్పుకోవాలని తేల్చి చెప్పారు.

సైన్యానికి విశేష అధికారాలు 
 
 నిరసనకారులు ప్రధాని భవనం, అధ్యక్ష భవనంలోకి వెళ్లి నానా హంగామా చేస్తున్నారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమ సింఘే సంచలన నిర్ణయం తీసుకున్నారు. శాంతిభద్రతలను కాపాడేందుకు లంక సైన్యానికి కీలక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.
 
 పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఏం చేయాలో అది చేయండని, అవసరమైతే కనిపిస్తే కాల్చివేయండని కూడా సైన్యానికి స్పష్టం చేసినట్టు తెలిసింది. ఫాసిస్టుల చేతుల్లోకి దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లనీయనని రణిల్ విక్రమసింఘే స్పష్టం చేశారు.
తాత్కాలిక అధ్యక్షుడిగా తనను తప్పుకునేలా చేయాలని విధ్వంసకారులు చూస్తున్నారని ఆయన చెప్పారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు, శాంతిభద్రతలను పరిరక్షించేందుకు శ్రీలంక పోలీసులు, సైన్యానికి పూర్తి స్థాయి అధికారాలు ఇస్తున్నట్లు ప్రకటించారు.