ఎలాంటి పదాలపై పార్లమెంట్ లో నిషేధం విధించడం లేదు

పార్లమెంట్ లో తాజాగా కొన్ని పదాలను ఉపయోగించడంపై నిషేధం విధించినట్లు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను  లోక్‌సభ  స్పీకర్ ఓం బిర్లా తోసిపుచ్చారు. ఉభయ సభల్లో తాము ఏ పదాన్నీ నిషేధించ లేదని స్పష్టం చేశారు. ఇలాంటి అన్‌పార్లమెంటరీ పదాలతో కూడిన ఓ పుస్తకాన్ని విడుదల చేశారని, పేపర్లను వృథా చేయొద్దన్న ఉద్దేశంతో తాము దానిని ఇంటర్నెట్‌లో పెట్టామని పేర్కొన్నారు.
కొన్ని పదాలను తొలగించామని, తొలగించబడిన పదాల సంకలనం మాత్రమే జారీ చేశామనిని, అంతేగానీ ఎలాంటి పదాలను నిషేధించలేదని వివరణ ఇచ్చారు.  ‘‘ఏ పదం నిషేధించబడలేదు, 1954 నుండి కొనసాగుతున్న పద్దతి ప్రకారమే.. పార్లమెంటు కార్యకలాపాల సమయంలో తొలగించాం” అని స్పష్టత ఇచ్చారు స్పీకర్‌.
 ఇంతకుముందు ఇలాంటి అన్‌పార్లమెంటరీ పదాల పుస్తకం విడుదలైంది. పేపర్లు వృథా కాకుండా ఉండేందుకు ఇంటర్నెట్‌లో పెట్టాం. వారు (ప్రతిపక్షాలు) ఈ 1,100 పేజీల నిఘంటువు (అన్‌పార్లమెంటరీ పదాలతో కూడిన) చదివారా? చదివి ఉంటే… అపోహలు వ్యాపించవు… ఇది 1954, 1986, 1992, 1999, 2004, 2009, 2010లో విడుదలైందని తెలిపారు.
 2010 నుంచి వార్షిక ప్రాతిపదికన విడుదల చేయడం ప్రారంభించిందని చెబుతూ  దయచేసి.. నిషేధిత పదాలంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దంటూ ఓం బిర్లా విపక్షాలను కోరారు.