సైనిక దళాలను ఉపయోగించడం కాలం చెల్లిన విధానం

భారత్-చైనా మధ్య సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా పిలుపునిచ్చారు.  అత్యధిక జనాభా గల చైనా, భారతదేశం రెండూ ప్రత్యర్థి దేశాలే కాదు సన్నిహిత పొరుగు దేశాలు కాబట్టి, సమస్యలను చివరికి సామరస్యంగా, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
 సైనిక చర్య ఇకపై తగినది కాద‌ని పేర్కొంటూ  సైనిక దళాలను ఉపయోగించడం కాలం చెల్లిన విధానమని దలైలామా స్పష్టం చేశారు.
 తూర్పు లడఖ్‌లో దళాల ఉపసంహరణ, ప్రతిష్టంభన తొలగింపు కోసం చర్చలకు కట్టుబడి ఉండాలని హితవు చెప్పారు.
 లేహ్‌లో పర్యటించేందుకు వెళ్తూ ఆయన జమ్మూలో శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. 2020లో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుండి, దలైలామా ధర్మశాల‌ను దాటి ఎటువంటి అధికారిక పర్యటన చేయలేదు. అలాగే, జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత అతను ఈ ప్రాంతానికి వెళ్లడం ఇదే తొలిసారి.
 చైనా,  భారతదేశం మధ్య 16వ రౌండ్ కార్ప్స్ కమాండర్-స్థాయి సమావేశాలు, ఈ పర్యటన తర్వాత కేవలం మూడు రోజుల తర్వాత జూలై 17న కూడా ప్రారంభం కాబోవడం గమనార్హం.  దలైలామా దాదాపు ఓ నెల రోజులు లడఖ్‌లో పర్యటిస్తారు.
ఆయన లడఖ్ పర్యటన చైనాకు మరింత ఆగ్రహం తెప్పిస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే తూర్పు లడఖ్‌లోని చాలా ఘర్షణ ప్రాంతాల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇరు దేశాల దళాలు మోహరించి ఉన్నాయి. దలైలామా వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చైనా  ఆరోపిస్తోంది.
అయితే తాను స్వాతంత్ర్యం కోరడం లేదని, మిడిల్‌-వే అప్రోచ్ క్రింద  టిబెట్‌లోని మూడు సంప్రదాయ ప్రావిన్సులలో నివసిస్తున్న టిబెటన్లందరికీ  అసలైన స్వయంప్రతిపత్తిని కోరుతున్నానని దలైలామా స్పష్టం చేశారు.   కొందరు చైనా అతివాదులు తనను వేర్పాటువాది అని, విప్లవకారుడని అంటున్నారని, తనను ఎల్లప్పుడూ విమర్శిస్తున్నారని దలైలామా చెప్పారు.
 అయితే తాను స్వాతంత్ర్యాన్ని కోరడం లేదని, కేవలం టిబెట్‌కు అర్థవంతమైన స్వయంప్రతిపత్తిని కల్పించాలని, టిబెటన్ బౌద్ధ సంస్కృతిని కాపాడాలని  మాత్రమే తాను కోరుతున్నట్లు ఎక్కువ మంది చైనీయులకు అర్థమైందని పేర్కొన్నారు.
దలైలామా లడఖ్ పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించినపుడు ఆయన స్పందిస్తూ, ఇది సాధారణ విషయమేనని చెప్పారు. చైనా ప్రజలు తన పర్యటన పట్ల అభ్యంతరం వ్యక్తం చేయలేదని తెలిపారు. టిబెటన్ బౌద్ధం పట్ల మరింత మంది చైనీయులు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు.
కొందరు చైనా స్కాలర్లు కూడా టిబెటన్ బౌద్ధం చాలా శాస్త్రీయమైనదని తెలుసుకుంటున్నారని చెప్పారు. పరిస్థితులు మారుతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.  టిబెట్ స్వాతంత్ర్యం కోసం దలైలామా పోరాడుతున్నారు. ,ఆయనకు 1989లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. ఇటీవల దలైలామా 87వ జన్మదినోత్సవాలను జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దీంతో మోదీపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.  చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి టిబెట్ సంబంధిత అంశాలను ఉపయోగించుకోవడం మానుకోవాలని భారత దేశానికి హితవు పలికింది. చైనా విమర్శలను భారత దేశం తిప్పికొట్టింది. దలైలామా భారత దేశపు గౌరవ అతిథి అని, ఇది తమ స్థిరమైన విధానమని స్పష్టం చేసింది.