శ్రీశైలానికి దూసుకొస్తున్న కృష్ణమ్మ

ఎగువన కర్ణాటక నుంచి తెెలుగు రాష్ట్రాల్లోని శ్రీశైలం ప్రాజెక్టుకు దాదాపు 5లక్షల క్యూసెక్కులకు పైగా వరద దూసుకొస్తోంది. ఎడతెరిపి లేని భారీ వర్షాలకు ఎగువన కర్ణాటకలోని అలమట్టి, నారాయణపూర్‌, ఉజ్జయినీ, తుంగభద్ర ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయాయి. దీంతో కృష్ణమ్మ వరద దిగువన ఉన్న జూరాల ప్రాజెక్టుకు మీదుగా శ్రీశైలం వైపుకు పరవళ్లు తొక్కుతోంది.

ఎగువున కర్ణాటకలోని అలమట్టి ప్రాజెక్టు నుంచి 1, 25, 000 క్యూసెక్కులు, నారాయణపూర్‌ రిజర్వాయర్‌ నుంచి 1, 33, 188 క్యూసెక్కులు, తుంగ భద్ర నుంచి 1, 15, 266 క్యూసెక్కుల వరద వస్తోంది.మంగళవారం ఎగువనుంచి వచ్చిన వరద జూరాల ప్రాజెక్టును దాటింది. జూరాల నుంచి 1, 07, 865 క్యూసెక్కుల వరదను శ్రీశైలం వైపునకు వదులుతున్నారు.

ఇప్పటికే జూరాల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 9టీఎంసీల మేర వరద నీరు చేరడంతో శ్రీశైలంలోకి వరద ను అధికారులు వదులుతున్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌ పూర్తి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా… ప్రస్తుతం రిజర్వాయర్‌లో 46.51 టీఎంసీల నీరు నిల్వ ఉంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలానికి 41, 999 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. మరోవైపు నాగార్జునసాగర్‌కు 1277 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది.

అంతకంతకూ పెరుగుతున్న వరదతో గోదావరి లంక గ్రామాలను ముంచెత్తుతోంది. ఉప నదులు ఉప్పొంగుతుండటంతో గోదావరి నది బుధవారం మహోగ్రరూపం దాల్చింది. వరద తీవ్రరూపం దాల్చడంతో ధవళేశ్వరం బ్యారేజీకి గల 175 గేట్లు ఎత్తేశారు.

ఐఎండీ సూచనల ప్రకారం దక్షిణ ఒడిశా, దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతుందని విపత్తుల సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా.బి.ఆర్‌ అంబేద్కర్‌ తెలిపారు. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.

వరద సహాయక చర్యల్లో మొత్తం 6ఎన్డీఆర్‌ఎఫ్‌, 4 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఉన్నట్లు తెలిపారు. మూడో ప్రమాద హెచ్చరిక వచ్చే అవకాశం ఉన్నందున లంక గ్రామల ప్రజలు వారి ప్రాంతంలో వరద ప్రభావం ఎక్కువగా ఉంటే కంట్రోల్‌ రూమ్‌ కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అత్యవసర సహాయం, సమాచారం కోసం 24 గంటలు అందుబాటు-లో ఉండే స్టేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నెంబర్లు 1070, 18004250101, 08632377118 సంప్రదించాల్సిందిగా సూచించారు. గోదావరి,కృష్ణా, తుంగభద్ర పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.