ముర్ముకు వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ముర్ముకు వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్రపతి అభ్యర్థి ముర్మును గెలుపించుకోవాల్సిన అవసరం ఉందని మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు.

‘రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళకు తొలిసారి అవకాశం లభించింది. వైఎస్సార్‌సీపీ మొదటి నుంచి సామాజిక న్యాయం వైపే ఉంది. సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించిన ప్రభుత్వం మనది. మనమంతా ముర్ముకే ఓటేసి గెలిపించుకోవాలి. ఏ ఒక్క ఓటు వృథా కాకుండా చూసుకోవాలి’ అని చెప్పారు.

ద్రౌపది ముర్ము తెలుగులో ప్రసంగం ప్రారంభిస్తూ వారసత్వ  కట్టడాలకు ఆంధ్రప్రదేశ్‌ నిలయం అని కొనియాడారు.  ఆంధ్రప్రదేశ్‌కు ఘనమైన చరిత్ర ఉన్నదని,  ఎందరో మహనీయులు తెలుగు గడ్డపై జన్మించారని తెలుపుతూ ఈ క్రమంలో తెలుగు కవులైన నన్నయ్య, తిక్కన, ఎర్రప్రగడలను ముర్ము స్మరించుకున్నారు.

“తిరుపతి, లేపాక్షి వంటి ప్రసిద్ధ క్షేత్రాలకు ఏపీ నిలయం. స్వాతంత్ర్య సమరంలో ఏపీకి ఘన చర్రిత ఉంది. ఈ పోరాటంలో రాష్ట్ర మహనీయులు కీలక ప్రాత పోషించారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమంతో కీలక పాత్ర పోషించారు. రాష్ట్రంలో ప్రకృతి సహజసిద్దమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి” అని ఆమె వివరించారు.

అనంతరం రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతు ద్రౌపది ముర్ము కోరారు. కేంద్ర మంత్రి జి కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘ప్రధాని నరేంద్ర మోడీ తరఫున సీఎం వైఎస్‌ జగన్‌కు ధన్యవాదాలు. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైఎస్సార్‌సీపీ మద్దతు పలకడం సంతోషం. అందరితో చర్చించాకే ద్రౌపది ముర్మును అభ్యర్థిగా ప్రకటించాము” అని తెలిపారు.

రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారి ట్రైబల్‌ మహిళకు అవకాశం లభించిందని చెబుతూ,  పార్టీలకు అతీతంగా ముర్ముకు అందరం మద్దతు పలకాలని ఆయన  పిలుపిచ్చారు.

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము  మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వచ్చారు.   ఈ నేపథ్యంలో మధ్యాహ్న ప్రాంతంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ద్రౌపది ముర్ముకు విమానాశ్రయంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, మార్గాని భరత్‌, గోరంట్ల మాధవ్‌ స్వాగతం పలికారు.

ఆమెకు గిరిజన సంప్రదాయంలో ఎంపీలు ఘన స్వాగతం అందించారు. అనంతరం ఎయిర్‌పోర్టు నుండి ద్రౌపది ముర్ము రోడ్డు మార్గంలో విజయవాడుకు బయలుదేరారు. ఇక, ఆమె వెంట కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కూడా ఉన్నారు.

చంద్రబాబు ఆత్మీయ సమావేశం 

కాగా,  ద్రౌపది ముర్ముతో టీడీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో టీడీపీ, బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, యనమల, అచ్చెన్నాయుడు, సీఎం రమేశ్‌, జీవీఎల్, సోమువీర్రాజు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్మును టీడీపీ అధినేత చంద్రబాబు సన్మానించారు. అలాగే ముర్ముకు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చంద్రబాబు పరిచయం చేశారు.

ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము మద్దతిచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. దేశవ్యాప్తంగా 42 పార్టీలు ద్రౌపది ముర్ముకు మద్దత్తు ఉందని కిషన్‌రెడ్డి తెలిపారు.

నాలుగు సంవత్సరాల అనంతరం టీడీపీ, బీజేపీ నేతలు మాటామంతి కలిపారు. ద్రౌపది ముర్ము‌ను ఎన్‌డీఏ అభ్యర్ధిగా నియమించడంపై టీడీపీ, బీజేపీ నేతలు చర్చించుకున్నారు. ఆమెకు అన్ని పార్టీలు మద్దతు ఇస్తూ, ప్రతిపక్షాల అభ్యర్ధికి ఒక ఓట్ కూడా లేని రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్, మిజోరాం మాత్రమే కావడం గమనార్హం.

అంతకు ముందు, చంద్రబాబుతో బీజేపీ నేతలు సోమువీర్రాజు, సీఎం రమేశ్‌, జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీలు వాకాటి నారాయణరెడ్డి, పివిఎన్ మాధవ్‌ భేటీ అయ్యారు. రాష్ట్రపతి అభ్యర్థికి ముర్ముకు మద్దతు ప్రకటించినందుకు కృతజ్ఞతలు నేతలు తెలిపారు.