బెంగాల్ అభివృద్ధిలో మతపర వివక్షత … గవర్నర్ ఆరోపణ 

రాష్ట్రంలో ఆర్థిక రంగం, ప్రభుత్వోద్యోగాల్లో అభివృద్ధి, సాధికారత మతపరంగా జరుగుతున్నట్లు  ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కర్ ఆరోపించారు. మతం ఆధారంగా సానుకూలత ప్రదర్శించడం ప్రజాస్వామిక విలువలకు పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు. 

ధన్‌కర్ బగ్డోగ్రా విమానాశ్రయంలో విలేకర్లతో మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న బుజ్జగింపు రాజకీయాల వల్ల ప్రజాస్వామ్యం ఆత్మ ధ్వంసమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల రాజకీయ కార్యకలాపాలకు రాష్ట్రంలో స్థానం లభించడం లేదనిపేర్కొంటూ దీనివల్ల సమాజంలో తీవ్రమైన అసమతుల్యత ఏర్పడుతుందని హెచ్చరించారు.

మమత ప్రభుత్వం బ్యూరోక్రాట్లను అధికార పార్టీ టిఎంసి కీలుబొమ్మలుగా మార్చిందని మ్మండిపడుతూ ఎంతో శ్రమిస్తే కానీ ఈ వ్యవస్థ మారదని చెప్పారు. మితిమీరిన బుజ్జగింపు, సంతుష్టీకరణ కనిపిస్తున్నాయని పేర్కొంటూ ఈ బుజ్జగింపులు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తాయని తెలిపారు.

వీటిపై గళమెత్తాలని మేధావులను, సాధారణ ప్రజానీకాన్ని కోరుతున్నానని ఆయన  చెప్పారు. మేధావులు, ప్రజలు మౌనంగా ఉండటం తనను తీవ్రంగా కలచివేస్తోందని తెలిపారు. గత మూడేళ్ళలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినట్లు చెప్తున్నప్పటికీ, క్షేత్ర స్థాయిలో అలాంటిదేమీ కనిపించలేదని ధ్వజమెత్తారు. తాను ఈ వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఈ వ్యవస్థపై గళమెత్తకపోతే భావి తరాలు మనల్ని క్షమించబోవని హెచ్చరించారు.