ద్రౌపది ముర్ముకు శివసేన మద్దతు 

సొంత పార్టీ ఎంపీల నుండి వచ్చిన వత్తిడి మేరకు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు శివసేన అధినేత, మహారాష్ట్ర  మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తన మద్దతును ప్రకటించారు. గిరిజన మహిళ రాష్ట్రపతి కావడం సంతోషంగా ఉందని తెలిపారు.

ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలనే తమ నిర్ణయం వెనుక ఎలాంటి ఒత్తిళ్లు లేవని ఆయన చెప్పారు. శివసేన ఎంపీల సమావేశంలో ఏ ఒక్కరూ మద్దతు విషయంలో పట్టుబట్టలేదని చెప్పారు. గతంలో కూడా తాము రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు విషయంలో స్వతంత్రం గానే నిర్ణయం తీసుకున్నామని, ఇప్పుడు కూడా అలాగే జరిగిందని థాక్రే పేర్కొన్నారు. 

”తొలిసారి ఒక గిరిజన మహిళకు రాష్ట్రపతి అయ్యే అవకాశం వచ్చిందని మా పార్టీకి చెందిన కొందరు గిరిజన నేతలు నాతో చెప్పారు. నిజానికి ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఆమెకు నేను మద్దతు ఇచ్చి ఉండాల్సింది కాదు. కానీ, మాది సంకుచిత బుద్ధి కాదు” అని ఉద్ధవ్ తెలిపారు.

కాగా, సోమవారం ఉద్దవ్‌ ఠాక్రే నివాసంలో జరిగిన సమావేశంలో పార్టీ ఎంపీల్లో ఎక్కువ మంది ముర్ముకే మద్దతివ్వాలని కోరినట్టు తెలిసింది. మొత్తం 22 మంది ఎంపీల్లో 16 మంది ముర్ముకే మద్దతివ్వాలని సూచించినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. మహారాష్ట్ర జనాభాలో 10 శాతం ఆదివాసీలున్నారు.

మరోవైపు ముర్ముకు మద్దతిచ్చినంత మాత్రాన బీజేపీకి సపోర్ట్‌ చేసినట్టు కాదని ఆ పార్టీ నేత సంజయ్‌ రౌత్‌ చెప్పారు. టీడీపీ, వైసీపీ, శివసేన తదితర ప్రాంతీయ పార్టీలు కూడా మద్దతు ప్రకటించడంతో ముర్ముకు 60 శాతానికి పైగా ఓట్లు పడే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటూ యుపిఎ రాష్ట్రపతి అభ్యర్థులు ప్రతిభ పాటిల్, ప్రణబ్ ముఖేర్జీలకు శివసేన మద్దతు ఇచ్చింది. ఇప్పుడు యూపీఏతో ప్రయాణం చేస్తూ ఎన్డీయే అభ్యర్ధికి మద్దతు ప్రకటించారు.