వైభవంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఎప్పటిలా వైభవంగా నిర్వహించాలని  టీటీడీ పాలకమండలి  నిర్ణయించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. కరోనా కారణంగా రెండేళ్లపాటు నిలిపివేసిన వాహన సేవలను మాడ వీధుల్లో నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారు.

బ్రహ్మోత్సవాల తొలిరోజున ధ్వజారోహణం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారరు. అక్టోబర్‌ 1న గరుడ సేవ జరుగనుంది. సోమవారం జరిగిన పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

ఆనంద నిలయం బంగారు తాపడం పనులకు ఆగమ పండితుల సలహాల మేరకు మరో నెలలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బాలాలయం చేయడం వీలుకాదు కాబట్టి, టెక్నాలజీని వినియోగించి తాపడం పనులు నిర్వహించడంపై పరిశీలన చేస్తున్నామని పేర్కొన్నారు.

తిరుమలలో అక్టోపస్ భవన నిర్మాణానికి రూ.7 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అమలవుతున్న విధంగా సర్వదర్శన విధానం కొనసాగుతుందని తెలిపారు. ఎస్.ఎస్.డి టోకన్లు జారీ పునరుద్ధరణపై సాధ్యాసాధ్యాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జూలై 24 నుండి నెల్లూరు నగరంలో శ్రీవారి వైభవోత్సవాలు జరుగుతాయని వివరించారు.

రూ.2.07 కోట్లతో నూతన పారువేటు మండపం నిర్మాణం, రూ.7.30 కోట్లతో ఎస్వీ గోశాలలో పశుగ్రాసం కొనుగోలుకు టెండర్ ఖరారు చేశారు. అమరావతి శ్రీవారి ఆలయంలో పచ్చదనాన్ని పెంపొందించడానికి రూ.2.09 కోట్లు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. బేడీ ఆంజనేయస్వామి మూలమూర్తికి ఉన్న రాగి కవచానికి బంగారు తాపడానికి రూ.18.75 లక్షలు మంజూరు చేశారు.

తిరుమలలోని ఎస్వీ పాఠశాలను సింఘానియా ఎడ్యుకేషన్ ముంబై ద్వారా మోడర్న్ స్కూల్ ను రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు.  8 రకాల టీటీడీ క్యాలండర్ లు, డైరీలు ముద్రణకు టెండర్ ఆహ్వానం, రామానాథా గుహ అనే ఎన్ఆర్ఐ భక్తుడు బెంగళూరులోని రూ.3.20 కోట్లు విలువ చేసే అపార్ట్ మెంట్ విరాళం ఇచ్చినట్లు తెలిపారు.

రూ.4.42 కోట్లతో తిరుపతిలో స్విమ్స్ ఆసుపత్రి ఐటి డెవలప్ మెంట్, శ్రీవారి ఆలయ పొటు మోడ్రనైజడ్ చేయాలని నిర్ణయించారు. ఆస్ట్రేలియా, స్విజర్లాండ్ కు చెందిన కంపెనీల సహకారంతో మానవరహిత బుంది తయారీ విధానం పరిశీలన, ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా 12 రకాల గో ఆథారిత వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నట్లు  సుబ్బారెడ్డి వివరించారు.

ఇలా ఉండగా, అమెరికాలో స్థిరపడిన భారతీయులు, తెలుగువారి కోసం ఎపిఎన్ఆర్టిఎస్, పలు ప్రవాసాంధ్రుల సంఘాల సహకారంతో జూన్ 18 నుంచి తొమ్మిది నగరాల్లో నిర్వహించిన శ్రీనివాస కల్యాణాలు సోమవారం ముగిశాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసునికి ఈ కల్యాణాలు జరిగాయి.  

జూన్ 18న శాన్ ఫ్రాన్సిస్కో, 19న సియాటెల్, 25న డల్లాస్, 26న సెయింట్ లూయిస్, 30న చికాగో నగరాల్లో స్వామివారి కల్యాణాలు జరిగాయి. అదేవిధంగా, జూలై 2న న్యూ ఆర్లిన్, 3న వాషింగ్టన్ డిసి, 9వ తేదీ అట్లాంటా జులై 10న బర్మింగ్ హమ్ నగరాల్లో శ్రీవారి కళ్యాణాలు నిర్వహించారు.