ద్రౌపది ముర్ముకు శివసేన మద్దతు అవకాశం!

బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు రాష్ట్రపతి ఎన్నికలలో శివసేన మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.  ఈ మేరకు పార్టీ ఎంపీల అభ్యర్థనపై పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సానుకూలంగా స్పందించక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

పార్టీలో మూడింట రెండు వంతుల మందికి పైగా ఎమ్యెల్యేలు తిరుగుబాటు చేసి బిజెపి మద్దతుతో  ఏకనాథ్ షిండే ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ఎంపీలలో కూడా తిరుగుబాటు సూచనలు కనిపిస్తూ ఉండడంతో ఎన్డీయే అభ్యర్ధికి మద్దతు ఇవ్వమని థాకరే వత్తిడి ఎదుర్కొంటున్నారు. 

ఉద్ధవ్ థాకరే నివాసం మాతోశ్రీలో సోమవారం జరిగిన శివసేన ఎంపీల సమావేశంలో దీనిపై నిర్ణయం ఎంపీలు తమ అభిప్రాయాలను స్పష్టం చేసిన్నట్లు తెలిసింది. సుమారు 12 మందికి పైగా ఎంపీలు ముర్ముకు మద్దతివ్వాలని స్పష్టం చేశారు.   ఉద్ధవ్ నివాసంలో జరిగిన సమావేశానికి 1 మంది హాజరయ్యారు. 

మహారాష్ట్రలో గిరిజనులు ఎక్కువగా ఉన్నందువల్ల..రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు మద్ధతు ఇద్దామని ఠాక్రేను ఎంపీలు కోరారు. శివసేనకు మొత్తం 19 మంది లోక్ సభ, ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అందులో ఏక్ నాథ్ షిండే కొడుకు సహా ఐదుగురు షిండేకు మద్ధతు ఇస్తున్నారు. దీనిపై రెండు రోజుల్లో తన నిర్ణయం చెప్తానని ఠాక్రే చెప్పినట్లు తెలుస్తోంది.

 భేటీ అనంతరం సేన ఎంపీ గజానన్ కిరీట్కర్ మాట్లాడుతూ ముర్ము గిరిజన మహిళ అయినందున ఆమెనే బలపర్చాలని, ఓటేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. అయితే వాళ్ల నిర్ణయానికి అధిష్టానం ఎలా స్పందించిందన్న విషయం మాత్రం వెల్లడించలేదు.

రాష్ట్రపతి ఎన్నికల సమయంలో గతంలో కూడా శివసేన రాజకీయాలకు అతీతంగా నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ ఎంపీ గజానన్ కీర్తికర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటూనే ప్రతిభా పాటిల్ యూపిఏ రాష్ట్రపతి అభ్యర్ధి అయిన మరాఠీ మహిళ కావడంతో గతంలో మద్దతిచ్చామన్నారు.

అలాగే యూపిఏ రాష్ట్రపతి అభ్యర్ధి అయిన ప్రణబ్ ముఖర్జీకి కూడా మద్దతిచ్చామని కీర్తికర్ చెప్పారు. ద్రౌపది ముర్ము గిరిజన మహిళ కావడం వల్ల ఉద్ధవ్ ఆమెకే మద్దతిస్తారని ఆయన చెప్పారు.

అయితే శివ సేన ఎంపీలు ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇస్తున్న విషయంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ మరోలా స్పందించారు. మాతోశ్రీలో లోక్‌సభ ఎంపీల భేటీ జరిగిందని, 15 మంది హాజరయ్యారని చెప్తున్నారు. అయితే భేటీలో ఏం చర్చించారనే విషయాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.

 ద్రౌపదీ ముర్ముకే టీడీపీ మద్దతు

మరోవంక, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా బరిలో నిలిచిన ద్రౌపదీ ముర్ముకే మద్దతు ఇవ్వాలని టిడిపి నిర్ణయించింది. టీడీపీ వ్యూహ కమిటీలో చర్చించిన అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

గతంలో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లోనూ పార్టీలకు అతీతంగా కేఆర్‌ నారాయణన్‌, ఏపీజే అబ్దుల్‌ కలామ్‌లకు మద్దతు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. లోక్‌సభ స్పీకర్‌గా బాలయోగిని, నంద్యాల ఎన్నికల్లో పీవీ నరసింహారావును టీడీపీ బలపరిచిందని గుర్తుచేశారు.