పన్నీర్‌సెల్వానికి భారీ ఎదురుదెబ్బ… పార్టీ నుండి వేటు

 
ఏఐఏడీఎంకే నేత ఓ పన్నీర్‌సెల్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ అధినాయకత్వాన్ని నిర్ణయించేందుకు తలపెట్టిన పార్టీ జనరల్ కౌన్సిల్ మీటింగ్‌కు మద్రాస్ హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎడప్పాడి పళనిస్వామి సారధ్యంలో పార్టీ జనరల్ సెక్రటరీ సమావేశంపై స్టే విధించాలంటూ ఓపీఎస్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్ట్ తోసిపుచ్చింది.
ఆ వెంటనే  జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో  జయలలిత మరణం తర్వాత ఎడప్పాడి పళనిస్వామి, ఓ పన్నీర్ సెల్వం వర్గాల మధ్య సయోధ్య కోసం ఏర్పాటు చేసిన ద్వంద్వ నాయకత్వ విధానాన్ని రద్దు చేశారు. పార్టీకి ఎకైక తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి(ఈపీఎస్) ఎన్నికయ్యారు. దీంతో పార్టీ పగ్గాలు పళనిస్వామి చేతులోకి చేరాయి.
ఈ సందర్భంగా అన్నాడీఎంకే పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి పన్నీర్‌ సెల్వాన్ని తొలగించాలని ఎమ్మెల్యే నాథం విశ్వనాథన్‌ ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. పన్నీర్‌ సెల్వాన్ని పార్టీ ముఖ్య పదవులు, సభ్యత్వం నుంచి తొలగిస్తూ అన్నాడీఎంకే జనరల్‌ కౌన్సిల్‌ తీర్మానించింది.
ఓపీఎస్‌పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఓపీఎస్‌ మద్దతుదారులపైనా బహిష్కరణ వేటు పడింది. పదవులు, సభ్యత్వం నుంచి ఓపీఎస్‌ మద్దతురాలను తొలగిస్తూ తీర్మానించింది. ఓపీఎస్‌తోపాటు  వైతిలింగం, జేసీడీ ప్రభాకర్, పీహెచ్ మనోజ్ పాండియన్ కూడా బహిష్కరణకు గురయ్యారు.
ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి పునరుద్ధరించి.. కోఆర్టినేటర్, సంయుక్త కోఆర్డినేటర్ పోస్టులను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో మొత్తం 16 తీర్మానాలకు ఆమోదం తెలిపారు.
 
పన్నీర్ సెల్వం పోటీ సమావేశం… 
 
మరోవంక, పన్నీర్ సెల్వం వర్గం ఓ మ్యారేజ్ హాల్ లో పోటీ జనరల్ బాడీ సమావేశం జరిపి పళనిస్వామిని పార్టీ నుండి బహిష్కరిస్తూ తీర్మానం చేశారు. పార్టీ సీనియర్ నేత ఆర్ విశ్వనాథన్ ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. పళనిస్వామి అధికార డీఎంకేతో చేతులు కలిపి, పార్టీని బలహీనపరచే ప్రయత్నం చేస్తున్నారని తీర్మానంలో ఆరోపించారు. 
 
పార్టీ కార్యకర్తలు తనను కోఆర్డినేటర్ గా ఎన్నుకొనగా, మరెవ్వరికీ తనను తొలగించే అధికారం లేదని పళనిస్వామి స్పష్టం చేశారు. కోటిన్నర క్యాడర్‌ ఎన్నుకున్న తనను ఎలా తప్పిస్తారని? ఆ అధికారం ఒక్క పళనిస్వామికో, ఇతర నేతలకో అస్సలు లేదని పేర్కొన్నారు. తన బహిష్కరణకు అసంబద్ధంగా పేర్కొన్న ఓపీఎస్‌.. తనను తొలగించే అధికారం ఎవరికీ లేదని, బహిష్కరణ నిర్ణయంపై చట్ట ప్రకారం కోర్టుకు వెళ్తానని ప్రకటించారు.