ఉద్ధవ్ థాకరేకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ 

శివసేన అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు సుప్రీంకోర్టులో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. తన ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి, కొత్త ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే వర్గంలో చేరిన 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించింది.
ఆ ఎమ్మెల్యేలపై వచ్చిన అనర్హత ఫిర్యాదులపై ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మహారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీకర్ రాహుల్ నార్వేకర్ ను ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుంప్రీకోర్టు బెంచ్ ఆదేశించింది. ఇదే విషయాన్ని స్పీకర్ కు తెలియజేయాలని మహారాష్ట్ర గవర్నర్ తరఫున విచారణకు హాజరైన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సుప్రీం బెంచ్ సూచించింది.

ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో థాకరే, షిండే వర్గాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. అయితే, అత్యవసర విచారణ చేపట్టలేమన్న జస్టిస్ ఎన్వీ రమణ ఈ పిటిషన్లపై విచారణకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. 

దాంతో, కొత్తగా అధికారంలోకి వచ్చిన షిండే వర్గానికి ఊరట కలగ్గా,  థాకరే వర్గానికి ఎదురు దెబ్బ తగిలినట్లయింది. పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసిన 16 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటుపై ఎటూ తేలకముందే మహారాష్ట్రలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ షిండేను ఆహ్వానించారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని థాక్రే వర్గం గతవారం సుప్రీంను ఆశ్రయించింది.

ఈ 16 మంది బలపరీక్షతో పాటు స్పీకర్ ఎన్నిక ఓటింగ్‌లోనూ పాల్గొన్నారని పేర్కొంది. వారి అనర్హత వేటు విషయంపై సుప్రీంకోర్టే తీర్పు చెప్పాలని కోరింది. అయితే ఈ పిటిషన్‌పై సోమవారమే విచారణ జరుగుతుందని థాక్రే వర్గం భావించింది. కానీ లిస్టింగ్‌లో ఇది కన్పించలేదు.

దీంతో పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని థాక్రే వర్గం కోరింది. అయితే దీన్ని రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించాల్సి ఉందని, కొంత సమయం పడుతుందని కోర్టు తెలిపింది.  ఆ తర్వాతే విచారణ చేపడతామని చెప్పింది. మంగళవారం కూడా థాక్రే పిటిషన్‌పై విచారణ జరిగే సూచనలు కన్పించడం లేదు.