జంతు కార్యకర్త ఆత్మహత్యపై అసోం సీఎం క్షమాపణ

యువ వ్యాపారవేత్త, జంతు కార్యకర్త వినీత్ బగారియా (32)  ఆత్మహత్యపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తీవ్రంగా స్పందించారు. వినీత్ కుటుంబానికి క్షమాపణలు తెలిపిన సీఎం ఎస్పీని విధుల నుంచి తొలగించారు.
దిబ్రూగఢ్‌లోని మాఫియా బెదిరింపులను తట్టుకోలేని వినీత్ గురువారం తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు.  వినీత్ బగారియా ఇంటిని సందర్శించి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చిన ముఖ్యమంత్రి వినీత్ మృతికి సంతాపం తెలిపారు. అధికార యంత్రాంగం వైఫల్యానికి, సమయానికి స్పందించి వినీత్‌ను రక్షించలేకపోయిందుకు క్షమించాలని వేడుకున్నారు.
బాధిత కుటుంబానికి ‘సారీ’ అని క్షమాపణ చెబుతూ…తానెప్పుడూ ఇంతలా సిగ్గుపడలేదంటూ భావోద్వేగానికి గురయ్యారు. పోలీస్‌ యంత్రాంగం ఉన్నప్పటికీ మాఫియా గ్యాంగ్‌ బెదిరింపులకు పాల్పడే సాహసం చేసిందంటే నిజంగా ఇది చాలా సిగ్గుచేటు అని తెలిపారు. 
 ‘‘ఇది పూర్తిగా దిబ్రూగఢ్ జిల్లా యంత్రాంగం వైఫల్యమే. ఇందుకు నేను సిగ్గుపడుతున్నాను. అసోం ప్రజల తరపున బగారియా కుటుంబానికి క్షమాపణలు. నేరస్థులతో కఠినంగా వ్యవహరించాలన్న నా సందేశంలోని సారాంశాన్ని గ్రహించడంలో దిబ్రూగఢ్ పోలీసులు విఫలమై ఉండవచ్చు. బాధ్యులు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని సీఎం పేర్కొన్నారు.
మరోవైపు, ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిని బైదుల్లా ఖాన్, నిశాంత్ శర్మగా గుర్తించారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులైన సంజయ్ శర్మ, లజాజ్ ఖాన్‌ ఇంకా పరారీలోనే ఉన్నారు.  ఆత్మహత్యకు ముందు వినీత్ ఓ వీడియోను రికార్డు చేశాడు. తన కుటుంబానికి చెందిన ఓ షాపులోని వ్యక్తితో సహా ముగ్గురు తననను బెదిరిస్తున్నారని, ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో రికార్డు చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసిన వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని కూడా వినిత్‌ బగారియా సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. అందులో అతడు మాట్లాడుతూ ఆస్తిలో కొంత భాగం కోసం బైదుల్లాఖాన్, సంజయ్ శర్మ, నిశాంత్ శర్మ తన కుటుంబాన్ని శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.