విప్‌ ధిక్కరణపై 53 మంది శివసేన ఎమ్మెల్యేలకు షోకాజ్‌ నోటీసులు

మహారాష్ట్రాలో శివసేనతో తలెత్తిన రాజకీయ ముసలం ఇప్పట్లో  సద్దుమణిగేటట్లు లేదు. ఒక వంక తిరుగుబాటు చేసి, బిజెపి మద్దతుతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఏకనాథ్ షిండే అసెంబ్లీలో బలనిరూపణ చేసుకొని, మంత్రివర్గం ఏర్పాటుపై కసరత్తు చేస్తుండగా,   మరోవంక 55 మంది సేన ఎమ్యెయేలలో విప్ ధిక్కారంపై 53 మంది షోకాజ్ నోటీసులు అందుకోవడం కలకలం రేపుతున్నది. 

విప్‌ ధిక్కరణపై 55 మంది శివసేన ఎమ్మెల్యేల్లో 53 మందికి షోకాజ్‌ అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. వారిలో షిండే వర్గం ఎమ్మెల్యేలు 39 మంది ఉండగా, ఉద్ధవ్‌ థాక్రే వర్గానికి చెందిన 14 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఉద్ధవ్‌ వర్గంలోని ఎమ్మెల్యే సంతోష్‌ బంగర్‌,  జులై 4న బలపరీక్ష రోజే షిండేతో చేతులు కలిపారు. తమకు షోకాజ్‌ నోటీసులు అందినట్లు ఇరువర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ధ్రువీకరించారు.

మహారాష్ట్ర శాసనసభ సభ్యుల (ఫిరాయింపుల ఆధారంగా అనర్హత) నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేశారు. ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు.  స్పీకర్‌ ఎన్నిక, విశ్వాస పరీక్ష సందర్భంగా పార్టీ విప్‌ను ధిక్కరించారని ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపించుకున్నాయి. విప్‌ ధిక్కరించిన వారిని అనర్హులుగా వేటు వేయాలని డిమాండ్‌ చేశాయి.

అయితే.. అనర్హత వేటు వేయాలన్న ఎమ్మెల్యేల జాబితాలో ఉద్ధవ్‌ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే పేరును షిండే వర్గం మినహాయింటం గమనార్హం. 288 స్థానాలు కలిగిన అసెంబ్లీలో శివసేనకు 55 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.  జులై 4న జరిగిన విశ్వాస పరీక్ష అనంతరం  ఉద్ధవ్‌ థాక్రే వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలకు విప్‌ ధిక్కరించారంటూ  షిండే వర్గం నోటీసులు ఇచ్చింది.

పార్టీ గుర్తుపై రసభ 

మరోవంక, కీలకమైన పార్టీ గుర్తును కైవసం చేసుకోవడం కోసం రెండు వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. గుర్తును (పులి) తమ నుండి ఎవ్వరు వేరు చెయ్యలేరని పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే గత వారం స్ఫష్టం చేశారు. షిండే వర్గానికి చెందిన రెబల్ ఎమ్మెల్యే గులాబ్ రావ్ బుధవారం మట్లాడుతూ.. పార్టీ గుర్తుకు నిజమైన హక్కుదారు ముఖ్యమంత్రి షిండేనే అని పేర్కొన్నారు. 

షిండే వర్గానికి చెందిన రెబల్ ఎమ్మెల్యే గులాబ్ రావ్ బుధవారం మట్లాడుతూ పార్టీ గుర్తుకు నిజమైన హక్కుదారు ముఖ్యమంత్రి షిండేనే అని పేర్కొన్నారు. శివసేన పార్టీ బాలాసాహెబ్‌ది, ఆయన శివసైనికులదని  షిండే వర్గానికి చెందిన దీపక్ కేసార్కర్ స్పష్టం చేశారు. అందరినీ ఆదరించేలా ఉద్ధవ్‌కు కూడా బాలాసాహెబ్ లాంటి హృదయం ఉండాలని ఆయన చెప్పుకొచ్చారు. 

కాగా, ఉద్ధవ్ వర్గానికి చెందిన లోక్‌సభ ఎంపీ వినాయక్ రౌత్ షిండే వర్గంలోని ఎమ్మెల్యేలకు సవాలు విసురుతూ దమ్ముంటే వారు పార్టీని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు పెట్టాలని బీజేపీకి సవాలు విసిరారు. బాలాసాహెబ్ స్థాపించిన పార్టీ గుర్తును కోరే అధికారం రెబల్స్‌కు లేదని ఆయన స్పష్టం చేశారు.