నూతన పార్లమెంట్ భవనంపై జాతీయ చిహ్నం ఆవిష్కరించిన ప్రధాని

నిర్మాణంలో ఉన్న నూతన పార్లమెంట్ భవనంపై దేశ జాతీయ చిహ్నం ప్రతిమను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఆవిష్కరించారు. గంభీరంగా ఉన్న నాలుగుసింహాల అశోకస్థూపం కొత్తపార్లమెంట్‌కు తలమానికంగా ఉంటుంది. 

6.5 మీటర్ల ఎత్తుతో, 9500 కిలోల బరువుతో ఉండే ఈ కాంస్య ప్రతిమ ఈ ఏడాది చివరిలో ఆరంభం అయ్యే పార్లమెంట్ భవన సంపూర్తి దిశలో కీలక మైలురాయి అయింది. ఇంతటి బరువు మోసే విధంగా పార్లమెంట్ హాల్‌పై భాగంలో పెద్ద భారీ ఉక్కు వేదికను ఏర్పాటు చేశారు. 

లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభ ఉపాధ్యక్షులు హరివంశ్, పట్టణాభివృద్ధి మంత్రి హర్దీప్ సింగ్, ఉన్నతాధికారులు వెంటరాగా ప్రధాని మోదీ ఈ జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించారు. ప్రధాని మోదీ  కొద్ది సేపు అక్కడున్న భవన నిర్మాణ కార్మికులు, ఇంజనీర్లు ఇతర నిపుణులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 

పార్లమెంట్ కొత్త భవన నిర్మాణంలో పాలుపంచుకోవడం అపూర్వ విషయం అని ప్రధాని వారిని అభినందించారు. దేశ ప్రజాస్వామిక సౌథం సమున్నత రీతిలో ఉండేలా తీర్చిదిద్దేందుకు పాటుపడే వారి గొప్పతనం ఎనలేనిదని కొనియాడారు. పార్లమెంట్ నిర్మాణ పనులలోని శ్రమజీవులతో తన ముచ్చట తనకు ఆనందం కల్గించిందని ప్రధాని తెలిపారు.

ఈ నిర్మాణ పనిలో ఉన్న వారు భవనాల నిర్మాణంలో ఉన్నారనే అనుకోరాదని, వారు చరిత్రను నిర్మిస్తున్నారని ప్రధాని స్పందించారు. తాము ఎన్నో కట్టడాలలో పాలుపంచుకున్నా, ఈ పార్లమెంట్ భవన నిర్మాణ పని తమకు విశేష అనుభూతిని కల్పించిందని, గర్వకారణంగా భావిస్తున్నామని కార్మికులు తెలిపారు.

అక్కడున్న ఓ కార్మికుడు ప్రధాని రాకపై స్పందిస్తూ రాముడు శబరి కుటీరానికి వచ్చినట్లు ఉందని పేర్కొన్నారు. రామాయణాన్ని ప్రస్తావించారు. దీనిపై ప్రధాని బదులిస్తూ అవును ఈ భవనం మీ వంటి వారెందరికో ప్రజాస్వామ్య దివ్య కుటీరం. చాలా బాగా చెప్పారని ప్రశంసించారు. జాతీయ చిహ్నం ఆవిష్కరణకు ముందు ప్రధాని మోదీ  పార్లమెంట్ ఆవరణలో స్పీకర్‌తో కలిసి అగ్నిసాక్షిగా వేదోచ్ఛారణల నేపథ్యంలో పూజాదికాలు నిర్వహించారు.

స్వతంత్ర భారతావని 75 వసంతాలు పూర్తి చేసుకున్నప్పటి నుంచి ఈ నూతన భవనంలో పార్లమెంటు ఉభయ సభల సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2022తో 75 సంవత్సరాలు పూర్తవుతాయి. టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ పార్లమెంటు నూతన భవనాన్ని నిర్మిస్తోంది. దీనికి హెచ్‌సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ రూపకల్పన చేసింది. నూతన పార్లమెంట్ భవన నిర్మాణం కోసం రూ.971 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.

ముఖ్యమైన విశేషం ఏమిటంటే, దేశీయ వాస్తు రీతుల్లో దీనిని నిర్మిస్తున్నారు.  దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన వాస్తు రీతులు దీనిలో చూడవచ్చు. సాంస్కృతిక వైవిధ్యం కూడా కనిపిస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 200 మందికి పైగా కళాకారులు ఈ నిర్మాణంలో పాలుపంచుకుంటారు. ప్రస్తుత పార్లమెంటు భవనాన్ని పురావస్తు సంపదగా పరిరక్షిస్తారు. 93 ఏళ్ళనాటి ప్రస్తుత పార్లమెంటు భవనానికి బదులుగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు.