అభద్రతతోనే కేసీఆర్ మోదీపై అసందర్భ విమర్శలు 

భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న ప్రజలను ఆదుకొనేందుకు సమీక్ష సమావేశం పెట్టి, ప్రధాని మోదీపై  ముఖ్యమంత్రి కేసీఆర్ దాడి చేయడం పట్ల బిజెపి నేతలు భగ్గుమంటున్నారు.  
 
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంతో బాధ్యత కలిగిన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి తన హోదాను మరిచి, హుందాగా వ్యవహరించాల్సింది పోయి చాలా చౌకబారు భాషతో అపహాస్యంగా అవహేళనగా మాట్లాడటం కెసిఆర్ గారి అసహనాన్ని, అభద్రతా భావాన్ని, తన లోపల గూడుకట్టుకున్న భయాన్ని తెలియజేస్తున్నదని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.  .

సొంత డబ్బా పరనింద అన్నట్టు అసలు విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న సంగతిని మర్చిపోయి తన చిల్లర మాటలు చిల్లర వేషాలతో మరోసారి కేంద్ర ప్రభుత్వం పైన, బిజెపి పైనా అన్నిటికంటే ముఖ్యంగా ప్రధాని మోదీపై తీవ్రమైన విమర్శలు చేశారని మండిపడ్డారు. 
 
రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసి లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గతంలో వర్షం వచ్చినప్పుడు ఏ తప్పులు జరిగాయి, ఏ లోపం కారణంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు, వంటి వాటిని ఎలా అధిగమించాలి అనే విషయాన్ని మర్చిపోయి మరొక్కసారి తన కల్లబొల్లి మాటలతో అసందర్భ వాచాలత్వం తో అడ్డగోలుగా మాట్లాడారని దుయ్యబట్టారు దుయ్యబట్టారు. 
 
ప్రపంచంలోని అనేక విషయాల్ని ఉదహరిస్తూ తనను తాను మహా జ్ఞాని అన్నట్లు అన్ని విషయాలు తనకే తెలిసినట్టుగా తానెంతో అహంకారంతో మాట్లాడుతూ బిజెపిని, మోదీని అహంకారంతో వ్యవహరిస్తున్నారని విమర్శించడం కెసిఆర్ గారి డొల్లతనానికి నిదర్శనం అంటూ ఎద్దేవా చేశారు. 
 
ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు గాని, దేశ ప్రజలు గాని అమాయకులు కారని అబద్ధాల్ని అసంబద్ధ విషయాల్ని పదేపదే చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కెసిఆర్ గారు ఇకనైనా హుందాగా వ్యవహరించి ముందుగా స్థానికంగా వరదల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి తన బాధ్యత నిర్వహించాలని ఆయన హితవు చెప్పారు.  
 
టీఆర్‌ఎస్‌లో చాలామంది ఏక్‌నాథ్‌షిండేలు
 
‘టీఆర్‌ఎస్‌లో ఏక్‌నాథ్‌షిండేలు చాలామంది ఉన్నారు. అందుకే సీఎం కేసీఆర్‌ భయపడుతున్నారు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎద్దేవాచేశారు. ‘కేసీఆర్‌ ముఖంలో భయం తాండవిస్తోంది,. ఒకవేళ ఆయన కుటుంబసభ్యుల్లోనే ఎవరైనా ఏక్‌నాథ్‌షిండేలు ఉన్నారేమో తెలియదు. అందుకే పదేపదే మహారాష్ట్ర పరిణామాలను గుర్తుచేసుకుని మాట్లాడుతున్నారు’అని ధ్వజమెత్తారు.
‘కేసీఆర్‌కు సొంతపార్టీపై ఏదో తెలియని భయం వెంటాడుతోంది. నీ బోడి ప్రభుత్వంలో ఉండటం అవసరమా? అని నీ పార్టీ ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నరు. మంచి పార్టీలోకి పోవాలని నీ పార్టీలోని ఏక్‌నాథ్‌షిండేలు ఆలోచిస్తున్నరు. అది తెలిసే ఆ పేరే తీస్తున్నవ్‌’ అని తెలిపారు. 
బీజేపీ పేరు వింటేనే, ప్రధాని మోదీ అంటేనే కేసీఆర్‌కు నిద్రపట్టట్లేదని, అందుకే ఇన్ని రోజుల తర్వాత ఫామ్‌హౌస్‌ నుంచి బయటికొచ్చాక కూడా మోదీపై విమర్శలకు పరిమితమయ్యారని విమర్శించారు. తెలంగాణలో ప్రభావం కోల్పోతూ, ప్రతిష్ట దిగజారిందని గ్రహించిన కేసీఆర్‌ కేంద్రంపై, మోదీపై , బీజేపీపై విమర్శలు గుప్పించి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని సంజయ్‌ ధ్వజమెత్తారు. ఇకపై ప్రధానిపై, ఇతర అంశాలపై మాట్లాడేపుడు హద్దులు మీరొద్దని హెచ్చరించారు.