ఆగస్టు 2 నుంచి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టనున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఆగస్టు 2 నుండి 20 రోజుల పాటు పాదయాత్ర చేయనున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్  ప్రకటించారు. ఈ యాత్ర పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. అట్లాగే పోడు భూములు, ధరణి సమస్యలపై సోమవారం కరీంనగర్ లో బండి సంజయ్ ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ‘మౌన దీక్ష’ చేపడతారని చెప్పారు. 
 
 అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటంలో భాగంగా ఈనెల 21 నుండి ‘పల్లె గోస – బీజేపీ భరోసా’ పేరిట అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.  సంజయ్ ఆధ్వర్యంలో దాదాపు 30 మంది సీనియర్ నేతలు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బైక్ ర్యాలీలు నిర్వహిస్తారని, రాత్రి పూట పల్లెల్లోనే బస చేస్తారని తెలిపారు. 
 
రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలనలో గోస పడుతున్న ప్రజలకు న్యాయం జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆజాదీ కా అమ్రుతోత్సవ్ నేపథ్యంలో ఆగస్టు 9 నుండి 15 వరకు రాష్ట్రంలోని ప్రతి బీజేపీ కార్యకర్త నివాసాలపై జాతీయ జెండాను ఎగరేయాలని ఆయన  పిలపునిచ్చారు. 
 
మరోవైపు నర్సంపేట నియోజకవర్గానికి చెందిన పలువురు టీఆర్ఎస్ నేతలు ఆదివారం తరుణ్ చుగ్,  సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. మాజీ ఎంపీపీ గటిక అజయ్ కుమార్, మాజీ ఎంపీటీసీ గోపాల్, సర్పంచ్ వడ్డే రజిత సర్పంచ్ సహా వందలాది మంది టీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరారు. 
ఇలా ఉండగా,  ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ము ఈనెల 12న హైదరాబాద్ రానున్న సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో సన్నాహక సమావేశంలో పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు, మాజీ మంత్రి రవీంద్ర నాయిక్, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బంగారు శృతి, దుగ్యాల ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.