భజరంగ్ దళ్ కేసులో హైకోర్టులో సాయిపల్లవికి ఎదురుదెబ్బ

వివాదాస్పద వ్యాఖ్యల కేసులో నటి సాయి పల్లవికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆమె వేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.  సాయి పల్లవి.. కాశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాతో పాటుగా, గోరక్షకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని భజ్‌రంగ్‌ దళ్‌సభ్యుడి ఫిర్యాదుతో సుల్తాన్‌ బజార్‌ పీఎస్‌లో కేసు నమోదయింది. 

పోలీసులు సాయిపల్లవికి జూన్‌ 21వ తేదీన నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో పోలీసుల నోటీసులు రద్దు చేయాలని కోరుతూ ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సాయి పల్లవి అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు పేర్కొంది.

‘విరాటపర్వం’ సినిమా ప్రచారంలో భాగంగా సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమా గురించి మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె గోసంరక్షణను కాశ్మీర్ మారణహోమంతో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారంటూ బజరంగ్ దళ్ కార్యకర్త అఖిల్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

దీనిపై జూన్ 21న పోలీసుల ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.తనపై దాఖలైన ఫిర్యాదు చట్టవిరుద్ధమని, ఏకపక్షమని సాయి పల్లవి తన పిటిషన్‌లో పేర్కొంది. అయితే, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలిత ధర్మాసనం జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. పోలీసుల ముందు హాజరు కావాలని కోరింది.

ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ రాజకీయంగా తనకు పెద్దగా తెలియదని, తాను సైద్ధాంతికంగా తటస్థంగా ఉన్నానని, అలా పెరిగానని పేర్కొంది. వామపక్షాలు లేదా ఇతర పార్టీలు సరైనవో తనకు తెలియదని అంటూ  లెఫ్ట్ వింగ్‌, రైట్‌వింగ్‌ల గురించి విన్నాను.. కానీ, ఎవరు ఒప్పు, ఎవరు తప్పు అని చెప్పలేను అంటూ తెలిపారు.

ఇక.. కాశ్మీరీ పండిట్‌లను ఎలా చంపేశారో ‘‘ది కాశ్మీర్ ఫైల్స్’’ అనే సినిమాలో చూపించారు.. తాజాగా ఓ వ్యక్తి ఘటన జరిగింది. ముస్లిం అని అనుమానించి ఆవును తీసుకెళ్లినందుకు చంపారు. వ్యక్తిని చంపిన తర్వాత దాడి చేసిన వారు ‘జై శ్రీరామ్’ నినాదాలు చేశారు. కాశ్మీర్‌లో జరిగిన దానికి ఇటీవల జరిగిన దానికి తేడా ఎక్కడ ఉంది?” అని ఆమె ప్రశ్నించారు.

ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో దీనిపై సాయిపల్లవి వివరణ కూడా ఇచ్చారు. ఏదైనా మతం పేరుతో హింస చేయడం పెద్ద పాపమని తెలియజేయడమే తన ఉద్దేశమని, ఇంటర్వ్యూలోని స్నిప్పెట్‌లను సందర్భోచితంగా తీయడం జరిగిందని ఆమె పేర్కొన్నారు.