రాజ్యసభ సభ్యునిగా లక్ష్మణ్ ప్రమాణస్వీకారం 

ఇటీవల ఉత్తర ప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎన్నికైన బిజెపి ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె లక్ష్మణ్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ను బిజెపి ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్ ఛార్జ్ తరుణ్ ఛుగ్, తెలంగాణ రాష్ట్ర  అధ్యక్షులు బండి సంజయ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ నాయకులు, మాజీ ఎంపీలు, తెలంగాణ బీజేపీ నేతలు, కార్యకర్తలు అభినందించారు. 

అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ రాజ్యసభకు ఎంపిక చేసినందుకు జాతీయ నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ నుంచి ఎంపిక చేసినందుకు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేర్చడానికి కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణ వాదనను వినిపించడానికి యూపీ నుంచి తనను రాజ్యసభకు ఎంపిక చేసినట్లు తెలిపారు. 

జాతీయ నాయకత్వానికి తెలంగాణ పట్ల ఉన్న చిత్తశుద్ధికి తన ఎంపిక నిదర్శనమని చెబుతూ నాలుగు దశాబ్దాలుగా పార్టీలో పనిచేస్తున్నానని.. తనకు దక్కిన రాజ్యసభ అవకాశం కార్యకర్తలకు దక్కిన గుర్తింపు అని ఎంపీ చెప్పుకొచ్చారు.

అనేక పదవుల్లో వెనుకబడిన వర్గాలకు బీజేపీ ప్రత్యేక గుర్తింపు ఇస్తుందని తెలిపారు. రాష్ట్రపతి కోటాలో దక్షిణాదికి పెద్దపీట వేస్తూ కేంద్రం నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేసిందని గుర్తు చేశారు. బీజేపీ పేదలకు ప్రాధాన్యం కల్పిస్తున్న పార్టీ అని పేర్కొన్నారు.

తెలంగాణలో దోచుకున్నది చాలక జాతీయ స్థాయిలో దోచుకోవాలని కేసీఆర్ అభసుపాలవుతున్నారని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. జాతీయ పార్టీ అని కేసీఆర్ పగటి కలలుకంటున్నారని విమర్శించారు. తెలంగాణ వాదిగా తెలంగాణ అంశాలను పార్లమెంట్ ముందుంచాలని జేపీ నడ్డా సూచించారని ఆయన తెలిపారు.

కేసీఆర్‌కు ప్రధాని మోదీని ప్రశ్నించే స్థాయి లేదని చెబుతూ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యామ్నాయం బీజేపినే అని స్పష్టం చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్ దిక్కు తోచని స్థితిలో ముందస్తు ఎన్నికలకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉండటానికి బీజేపి జమిలి ఎన్నికలను కోరుకుంటుందని చెప్పారు. తెలంగాణ టీఆర్ఎస్‌లో కట్టప్పలు సిద్ధంగా ఉన్నారని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.