కాల్పులతో కుప్పకూలిపోయిన జపాన్ మాజీ ప్రధాని షింజో

పశ్చిమ జపాన్‌లోని నారా నగరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న జపాన్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధాన మంత్రి షింజో అబే (67)పై కాల్పులు జరిగాయి. దానితో గుండె ఆగి కుప్పకూలిన్నట్లు చెబుతున్నారు. అబేను ఆసుపత్రికి తరలించేలోపు కార్డియోపల్మోనరీ అరెస్ట్‌లో ఉన్నట్లు నారా అగ్నిమాపక విభాగం తెలిపింది

జపాన్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్  ఎన్ హెచ్ కె ప్రకారం , అబే  శుక్రవారం ఉదయం షాట్‌గన్‌తో వెనుక నుండి కాల్చిన తర్వాత నేలపై పడి ఛాతీ నుండి రక్తస్రావం అవుతున్నట్లు కనిపించింది. 40 ఏళ్ల నారా నివాసి టెత్సుయా యమగామి అనే అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, అయితే తదుపరి వివరాలను అందించలేదని తెలిపింది.

మొదటి షాట్ అబే వెనుకకు జారిపడిందని, రెండో షాట్ తర్వాత ఆయన  నేలపై పడిపోయాడని దాడికి సంబంధించిన ప్రత్యక్ష సాక్షి ఒకరు బ్రాడ్‌కాస్టర్‌తో చెప్పాడు. అనుమానిత ముష్కరులు పారిపోయేందుకు ప్రయత్నించలేదని, ఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.హెలికాప్టర్‌లో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఈ ఆదివారం ఎగువ సభ ఎన్నికలకు ముందు ప్రచార ప్రసంగం చేయడానికి నారాలో ఉన్నారు. అమెరికా రాయబారి రహమ్ ఇమాన్యుయేల్ కాల్పుల పట్ల  “విషాదం, దిగ్భ్రాంతి” వ్యక్తం చేశారు. “అబే-సాన్ జపాన్ అత్యుత్తమ నాయకుడు. అమెరికాకు తిరుగులేని మిత్రుడు” అని ఇమాన్యుయేల్ ఒక ప్రకటనలో తెలిపారు. “యుఎస్ ప్రభుత్వం, అమెరికన్ ప్రజలు అబే-సాన్, అతని కుటుంబం, జపాన్ ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నారు” అని చెప్పారు.

అబే ప్రతి ద్రవ్యోల్బణం నుండి ఆర్థిక వ్యవస్థను కాపాడటం కోసం అనుసరించిన “అబెనోమిక్స్” విధానాలకు ప్రసిద్ధి చెందారు.  జపాన్ సైన్యాన్ని బబలోపేతం చేశారు.  తన పదవీ కాలంలో చైనా పెరుగుతున్న పలుకుబడిని ఎదుర్కోవడానికి ప్రయత్నించారు. 2006 నుంచి 2012 వరకు జపాన్ ప్రధానిగా షింజో అబే సేవలందించారు. భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించిన నేపథ్యంలో ఆయనకు కేంద్రం పద్మ విభూషణ్‌ ప్రకటించింది.

మరో జపాన్ మీడియా హౌస్ క్యోడో ప్రకారం మాజీ ప్రపంచ నాయకుడు అపస్మారక స్థితిలో,  కార్డియో రెస్పిరేటరీ అరెస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

రాజకీయ కుటుంబానికి చెందిన అబే, దీర్ఘకాలిక అనారోగ్యంతో తిరిగి బయటపడిన తర్వాత 2020లో పదవీ విరమణ చేయాలన్న తన నిర్ణయాన్ని ప్రకటించారు. జపాన్ లో అత్యధిక కాలం  పనిచేసిన ప్రధానమంత్రిగా వార్తల్లో నిలిచారు. భారత దేశంతో సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకున్న ఆయన 2006, 2014, 2015, 2017లలో మన దేశాన్ని సందర్శించారు.

షింజో అబేపై కాల్పులకు సంబంధించి లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ప్రతిస్పందనను సిద్ధం చేస్తోందని జపాన్ ప్రధాన క్యాబినెట్ కార్యదర్శి హిరోకాజు మట్సునో చెప్పారు. అబే పరిస్థితి ఏమిటన్నది స్పష్టంగా తెలియడం లేదని ఆయన తెలిపారు. జపాన్ ప్రభుత్వం సంక్షోభ నిర్వహణ ఆపరేషన్‌ను ఏర్పాటు చేసిందని, ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా, క్యాబినెట్ మంత్రులు ఇప్పుడు టోక్యోకు చేరుకున్నారని ఆయన చెప్పారు.

“ఉదయం 11.30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) తుపాకీ కాల్పులు జరిగాయి. పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మిస్టర్ అబే పరిస్థితి తెలియదు. ఇటువంటి హింస అనుమతించం.   మేము దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తాము. మేము సాధ్యమైన ప్రతి చర్య తీసుకుంటాము” అని వివరించారు.