షింజో అబే మృతికి నివాళిగా రేపు భారత్‌లో సంతాప దినం

జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్య ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయనతో ఉన్న ప్రత్యేక అనుబంధం దృష్ట్యా శనివారం ఒక్కరోజు సంతాపం దినం పాటించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.

“నా ప్రియమైన మిత్రుడు షింజో అబే ఇక లేరనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది” అని ప్రధాని మోదీ ట్విటర్‌ ద్వారా సంతాపం తెలియజేశారు. “భారతదేశం-జపాన్ సంబంధాలను బలోపేతం చేయడంపై ఎల్లప్పుడూ మక్కువ చూపే ఆయన (షింజోను ఉద్దేశించి..) జపాన్-ఇండియా అసోసియేషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. టోక్యోలో నా ప్రియమిత్రుడితో దిగిన ఇటీవల  ఫొటో” అంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌లో ఓ పోస్ట్‌ ఉంచారు.

ఎన్నో ఏళ్లుగా ఆయనతో అనుబంధం కొనసాగిందని, ఇరు దేశాల మధ్య సంబంధాలు బలంగా ఉండేందుకు ఆయన ఎంతో కృషి చేశారని, తాజా పర్యటనలోనూ ఆయనతో ఎన్నో కీలకాంశాలపై చర్చించినట్లు ప్రధాని మోదీ షింజో అబే సేవలను గుర్తు చేసుకున్నారు.  తనకున్న అతి కొద్దిమంది సన్నిహితుల్లో షింజో అబే ఒకరని, ఆయన ఇక లేరన్న విషయం తీవ్ర విషాదం కలిగిస్తోందని ప్రధాని పేర్కొన్నారు.

ఇవాళ ఈ విషాదకర పరిస్థితుల్లో యావత్ భారతదేశం జపాన్ శోకాన్ని పంచుకుంటోందని, ఈ కష్ట సమయంలో జపాన్ సోదర సోదరీమణులకు భారత్ తోడుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. తొలుత, షింజో అబేపై జ‌రిగిన కాల్పుల ఘ‌ట‌న‌ను ప్రధాని ఖండించారు. ప్రియ మిత్రుడు షింజో అబేపై అటాక్ జ‌ర‌గ‌డం తీవ్ర బాధ‌ను క‌లిగించింద‌ని మోదీ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు.

మరోవూపు మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ కూడా షింజో పై కాల్పులు షాక్ వ్య‌క్తం చేశారు. త‌న మిత్రుడుపై దాడి జ‌ర‌గ‌డం బాధాక‌ర‌మ‌ని పేర్కొన్నారు. షింజో కుటుంబస‌భ్యుల త‌ర‌పున ప్రార్థిస్తున్న‌ట్లు మ‌న్మోహ‌న్ వెల్ల‌డించారు.
చైనా దుష్టపన్నాగాలను ముందే ఊహించిన వ్యక్తి, చైనా అంటే బెణుకు లేని నేతగా షింజో అబేకి ఓ పేరుంది. అలాగే భారత్‌తో మైత్రి బలపడడానికి అబే కృషి ఎంతో దాగుంది. ప్రధాని పదవిలో ఎనిమిదేళ్లు ఉన్న టైంలో  ఆయన నాలుగసార్లు భారత్‌కు వచ్చారు. ఆ సమయంలో భారత్‌ ఆతిథ్యాన్ని ఆస్వాదించడంతో పాటు మోదీ సర్కార్‌తో ఆయన కీలకమైన ఒప్పందాలు చేసుకున్నారు.

అంతేకాదు.. ప్రపంచబ్యాంక్‌, ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకులు చైనాకు భయపడి అరుణాచల్‌ ప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సమకూర్చేందుకు వెనుకంజ వేశాయి. ఆ సమయంలో.. సుమారు రూ 13,000 కోట్లను  ఈశాన్య రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు షింజో అబే. 2014లో భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొ‍ని ఆ గౌరవంద దక్కించుకున్న జపాన్‌ ప్రధానిగా నిలిచారాయన. అలాంటి ఆత్మీయుడి కోసం జాతీయ జెండాను సగం వరకు అవనతం చేసి.. శనివారం నివాళి అర్పించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.

మార్పుకు గుర్తుగా అంబే 
జపాన్‌కు సుదీర్ఘ కాలం ప్రధాన మంత్రిగా సేవలందించిన షింజో అబేకు ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంతోపాటు ముఖ్యమైన దౌత్య సంబంధాలను ఏర్పరచుకుని దేశానికి లబ్ధి చేకూర్చారు. జపాన్ ప్రధాన మంత్రిగా షింజో అబే 2006లో తొలిసారి బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిని అలంకరించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు.
మార్పునకు గుర్తుగా ఆయనను జపాన్ ప్రజలు పరిగణిస్తారు. ఓ సంప్రదాయ సంపన్న  కుటుంబంలో మూడో తరం వ్యక్తి అయిన అబేను బాల్యం నుంచి రాజకీయ నేతగా తీర్చిదిద్దారు.  మొదటిసారి ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన తర్వాత ఆ పదవీ కాలంలో ఆయన సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు. అకస్మాత్తుగా రాజీనామా చేయవలసి వచ్చింది. 2012లో మళ్ళీ ప్రధాన మంత్రి పదవిని చేపట్టారు.
 2011లో వచ్చిన సునామీ, ఆ తర్వాత ఫొకుషిమాలో అణు విపత్తు పర్యవసానాలు జపాన్‌పై తీవ్రంగా ఉన్నాయి. అప్పట్లో అబే సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించారు. జపాన్ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేసేందుకు షింజో అబే విశేష కృషి చేశారు.  ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ జపాన్‌దే. అయితే దాదాపు రెండు దశాబ్దాల పాటు తీవ్రమైన ఒడుదొడుకుల్లో చిక్కుకుంది. ప్రభుత్వ వ్యయాన్ని పెంచవలసి వచ్చింది. ద్రవ్య పరమైన నిబంధనలను సడలించి, రెడ్ టేపిజానికి అడ్డుకట్ట వేశారు.
పని చేసే చోటుకు తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకు రావడానికి ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న తల్లులకు అనుకూల ప్రదేశాలుగా కార్యాలయాలను తీర్చిదిద్దారు. నర్సరీలకు నిధులు ఇవ్వడానికి, సాంఘిక భద్రతా వ్యవస్థలో లోపాలను సరిదిద్దడానికి వివాదాస్పద కన్జంప్షన్ ట్యాక్స్ పెంపును అమలు చేశారు.
షింజో అబే ఉత్తర కొరియా విషయంలో కఠిన వైఖరిని అవలంబించారు. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి స్థాపకుని పాత్రను కోరుకున్నారు.  అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సన్నిహిత వ్యక్తిగత సంబంధాలను ఏర్పరచుకున్నారు. కానీ జపాన్‌లోని అమెరికన్ దళాలకు మరింత ఎక్కువ నిధులు చెల్లించాలని ట్రంప్ పట్టుబట్టారు. రష్యా, చైనాలతో సత్సంబంధాల కోసం కృషి చేశారు.