డోలో-650 తయారీ సంస్థపై ఐటీ దాడులు

డోలో- 650 తయారీ సంస్థ మైక్రో ల్యాబ్స్‌ లిమిటెడ్‌పై ఐటి శాఖ దాడులు జరిపింది. బెంగళూరులోని రేస్ కోర్సు రోడ్డు లోని ఆ కంపెనీ కార్యాలయంలో దాదాపు 20 మంది అధికారుల బృందం సోదాలు నిర్వహించారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో జరిపిన ఈ దాడుల్లో కార్యాలయంలో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తున్నది. 

అదేవిధంగా, ఢిల్లీ సిక్కిం, పంజాబ్‌, తమిళనాడు, గోవాలతో పాటు దేశవ్యాప్తంగా 40 చోట్ల ఏకకాలంలో సోదాలు జరిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 200 మందికి పైగా అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నట్లు  ఆ వర్గాలు పేర్కొన్నాయి. మైక్రో ల్యాబ్స్‌ సిఎండి దిలీప్‌ సురానా, డైరెక్టర్‌ ఆనంద్‌ సురానా నివాసాల్లోనూ సోదాలు నిర్వహించినట్లు సమాచారం.

కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి ఈ కంపెనీ రికార్డు స్థాయిలో 350 కోట్ల డోలో-650 టాబ్లెట్లను విక్రయించింది. పారాసెటమాల్ కు పర్యాయ పదంగా మారినట్లు నిపుణులు  పేర్కోన్న సంగతి తెలిసిందే. ఒక్క  ఏడాదిలోనే సుమారు రూ.400 కోట్ల ఆదాయంతో అనేక కంపెనీలను వెనక్కి నెట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.