మరో చైనా మొబైల్‌ కంపెనీ వివోపై ఇడి దాడులు

మరో చైనా మొబైల్‌ కంపెనీ వివోపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) మంగళవారం దాడులు జరిపింది. మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో సోదాలు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బీహార్‌లతో పాటు పలు దక్షిణాదిరాష్ట్రాల్లో సోదాలు జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇంటర్నేషనల్‌ మొబైల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ (ఐఎంఇఐ) అనేది స్మార్ట్‌ ఫోన్‌లను వ్యక్తిగతంగా గుర్తించేందుకు వినియోగించే ప్రత్యేకమైన 15 అంకెల కోడ్‌. అయితే 2020లో మీరట్‌ పోలీసులు దేశంలో ఒకే ఐఎంఇఐ నెంబర్‌తో సుమారు 13,500 ఫోన్‌లను వినియోగిస్తున్నారనే ఆరోపణలపై వివోపై కేసు నమోదు చేసింది.
2017లో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (టిఆర్‌ఎఐ) అన్ని స్మార్ట్‌ ఫోన్‌లకు ప్రత్యేకమైన ఐఎంఇఐ ఉండాలని నిర్దేశిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఆదేశాలను పాటించని సంస్థలకు మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
అయితే  చైనా కంపెనీపై ఇడి నమోదు చేసిన రెండో కేసు కావడం గమనార్హం. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ ( ఫెమా)ను ఉల్లంఘించి అక్రమంగా విదేశీ చెల్లింపులు చేశారనే ఆరోపణలపై చైనా కంపెనీ షావోమీపై గతంలో కేసు నమోదు చేసింది.
 ఏప్రిల్‌లో ఫెమా యాక్ట్‌ 1999 కింద షావోమి టెక్నాలజీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన రూ. 5,551.27 కోట్ల ఆస్తులను ఇడి స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.