స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ లో అగ్రగామిగా గుజరాత్, కర్ణాటక, మేఘాలయ

వర్థమాన పారిశ్రామికవేత్తల కోసం స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడంలో గుజరాత్‌, కర్ణాటక, మేఘాలయ అత్యుత్తమ పనితీరు కనబరిచే రాష్ట్రాలుగా నిలిచాయి. ఎమర్జింగ్‌ స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ కేటగిరిలో గ్రూప్‌ – ఎలో ఆంధ్రప్రదేశ్‌కు స్థానం లభించింది. 

ఇందులో ఆంధ్రప్రదేశ్‌తోపాటు బీహార్‌ ఉండగా, గ్రూప్‌ – బిలో మిజోరాం, లడఖ్‌ ఉన్నాయి. డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండిస్టీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డిపిఐఐటి) రూపొందించిన రాష్ట్రాల స్టార్టప్‌ ర్యాంకుల నివేదికను అశోక్‌ హోటల్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేంద్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ సోమవారం విడుదల చేశారు. 

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను బెస్ట్‌ పెర్ఫార్మర్స్‌, టాప్‌ పెర్ఫార్మర్స్‌, లీడర్స్‌, ఔత్సాహిక లీడర్స్‌, ఎమర్జింగ్‌ స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ వంటి ఐదు కేటగిరీలుగా వర్గీకరించారు. స్టార్టప్‌లకు నిధులు, ప్రభుత్వ మద్దతు వంటి 26 యాక్షన్‌ పాయింట్లతో ఈ నివేదిక తయారు చేశారు. 

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌ – ఎలో కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉండగా, గ్రూప్‌ – బిలో కోటి లోపు జనాభా ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అత్యుత్తమ పనితీరు (బెస్ట్‌ పెర్ఫార్మర్స్‌) కేటగిరిలో గ్రూప్‌ాఎలో గుజరాత్‌, కర్ణాటక ఉండగా, గ్రూప్‌ాబిలో మేఘాలయ నిలిచింది.

ఉత్తమ పనితీరు (టాప్‌ పెర్ఫార్మర్స్‌) కేటగిరిలో గ్రూప్‌ – ఎలో తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా నిలిచాయి. గ్రూప్‌ – బిలో జమ్మూ కాశ్మీర్‌ నిలిచింది. స్టార్టప్‌ లీడర్ల (నాయకత్వం) కేటగిరిలో గ్రూప్‌ – ఎలో తమిళనాడు, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, అస్సాం నిలిచాయి. 

గ్రూప్‌ – బిలో అరుణాచల్‌ప్రదేశ్‌, గోవా, అండమాన్‌ నికోబార్‌ దీవులు నిలిచాయి. ఔత్సాహిక నాయకత్వం (అస్పిరింగ్‌ లీడర్‌) కేటగిరిలో గ్రూప్‌ – ఎలో ఢిల్లీ, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ ఉండగా, గ్రూప్‌ాబిలో చండీగఢ్‌, దాద్రా నగర్‌ హవేలీ, డామన్‌ అండ్‌ డయ్యూ, హిమాచల్‌ప్రదేశ్‌, మణిపూర్‌, నాగాలాండ్‌, త్రిపుర, పుదుచ్ఛేరి ఉన్నాయి.

కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 1,500కు పైగా స్టార్టప్‌లు మహిళలను ఇంక్యుబేట్‌ చేసినట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో 200కి పైగా, కేరళలో 20కి పైగా స్టార్టప్‌లకు మహిళలు నాయకత్వం వహిస్తున్నారని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ఇ-కామర్స్‌ను ఒఎన్‌డిసి అనుసంధానం చేయనుందని తెలిపారు.

డిపిఐఐటి కార్యదర్శి అనురాగ్‌ జైన్‌ మాట్లాడుతూ  ప్రతిరోజూ పెరుగుతున్న స్టార్టప్‌ల సంఖ్యతో పోల్చుకుంటే అమెరికా కంటే ముందున్నామని థెయ్ల్పారు. కార్యక్రమంలో డిపిఐఐటి సంయుక్త కార్యదర్శి శ్రుతి సింగ్‌, నేషనల్‌ స్టార్టప్‌ అడ్వైజరీ కౌన్సిల్‌ మనోజ్‌ జోషి తదితరులు మాట్లాడారు.