సంగీత దర్శకుడు ఇళయరాజా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆయనతో పాటు దర్శకుడు రాజమౌళి తండ్రి వి.విజయేంద్ర ప్రసాద్, లెజండరీ అథ్లెట్ పీటీ ఉష కూడా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. కర్ణాటకకు చెందిన వితరణ శీలి, ధర్మస్థల ఆలయ ధర్మాధికారి వీరేంద్ర హెగ్దేను కూడా రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేశారు.
ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో వెల్లడించారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయా రంగాల్లో వాళ్ల గొప్పతనాన్ని తెలియజేస్తూ.. వాళ్లను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నందుకు గర్వంగా ఉందని ప్రధాని మోదీ తెలియజేశారు.
‘శ్రీ వి.విజయేంద్ర ప్రసాద్ గారు దశాబ్దాలుగా సృజనాత్మక ప్రపంచంతో అనుబంధం కలిగి ఉన్నారు. అతని రచనలు భారతదేశం యొక్క అద్భుతమైన సంస్కృతిని ప్రదర్శిస్తాయి మరియు ప్రపంచవ్యాప్తంగా ఒక ముద్ర వేసాయి. రాజ్యసభకు నామినేట్ అయినందుకు ఆయనకు అభినందనలు’ అంటూ మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. గత దశాబ్దాలుగా కళా రంగానికి ఎంతో సేవ చేస్తున్నారు శ్రీ విజయేంద్ర ప్రసాద్ గారు.. భారత సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆయన పని తనం ఉంటుంది.. ఆయన తన పనితనంతో ప్రపంచ వ్యాప్తంగా మన కీర్తిని వ్యాపింపజేశారు. రాజ్యసభకు నామినేట్ అయినందుకు ఆయనకు కంగ్రాట్స్ అని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేసారు.
క్రియేటివ్ జీనియస్ ఇళయరాజా గారు ఎన్నో తరాలను అలరిస్తూ వస్తున్నారు.. ఎన్నో భావాలను ఆయన తన సంగీతంతో పలికించారు.. ఆయన కింది స్థాయి నుంచి వచ్చి.. ఎంతో ఎత్తుకు ఎదిగారు.. ఆయన జీవిత ప్రయాణం ఎంతో మందికి స్పూర్తి.. ఆయనలాంటి వ్యక్తి రాజ్యసభకు నామినేట్ అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది అని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేసారు. పీటీ ఉష జీవితం ప్రతి భారతీయుడికీ ఆదర్శనీయమని, అనేక ఏళ్లుగా ఎందరో క్రీడాకారుల్ని ఆమె తీర్చిదిద్దారన్నారని ప్రధాని కొనియాడారు.
రాజ్యాంగ అధికరణ ప్రకారం.. సంగీత, సాహిత్య, వైజ్ఞానికత, ఆర్థిక రంగాలతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను 12 మందిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసే అధికారం ఉంది. ఆ కోటాలోనే ఆరేళ్ల కింద మోదీ ప్రభుత్వం సుబ్రమణ్యస్వామిని ఎగువసభకు పంపింది. ఆయన పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఈ నలుగురు ప్రముఖులు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారు కావడం గమనార్హం.
తూర్పు గోదావరి జిల్లా కొవ్వురులో జన్మించిన కోడూరి విశ్వ విజయేంద్ర ప్రసాద్ సుప్రసిద్ధ కథా రచయితగా పేరొందారు. పలు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. విజేయంద్ర ప్రసాద్ తనయుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి’ చిత్రంతో విజయేంద్ర ప్రసాద్ మరింత ప్రాచుర్యం పొందారు. తెలుగు చిత్రాలతో పాటు తమిళ, హిందీ సినిమాలకు కూడా ఆయన పనిచేశారు.
వాణిజ్యపరంగా ప్రేక్షకాదరణ పొందిన 25కు పైగా చిత్రాలకు ఆయన స్క్రీన్ రైటర్‌గా వ్యవహరించడం విశేషం. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, బజరంగీ భాయిజాన్, మణికర్ణిక, మగధీర, మెర్సల్ వంటి చిత్రాలు ఆయన కలం నుంచి జాలువారిన కథలతోనే తెరకెక్కాయి. 2011లో ఆయన తెలుగులో రాజన్న చిత్రానికి దర్శకత్వం వహించారు కూడా. ఇది ఉత్తమ చలన చిత్రంగా నంది పురస్కారాన్ని దక్కించుకుంది. బజరంగీ భాయిజాన్ చిత్రానికి 2016లో ఉత్తమ కథా రచయితగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు.
More Stories
సరిహద్దులో కంచె నిర్మాణం కోసం భూమి బీఎస్ఎఫ్కు బదిలీ
ఎవరి ఒత్తిళ్లు, ఆంక్షలకు భారత్ తలొగ్గదని నిరూపించాం
స్వయంసేవకుల అసాధారణ ప్రవర్తన, ఆచరణతోనే సంఘ్